– పోలింగ్ పెంచడంలో.. అధికారుల వైఫల్యం
– గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
నవతెలంగాణ – వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. దాంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పోలింగ్ సరళిపై పార్టీ శ్రేణులతో అభ్యర్థులు కసరత్తు చేశారు. గెలుపుపై ఎవరికి వారు దీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో 10 శాతం పోలింగ్‌ను అదనంగా పెంచేందుకు తగిన చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పినా, ఇందులో ఘోరంగా విఫలమయ్యారు. గత ఎన్నికల కంటే ‘పశ్చిమ’లో 2.62 శాతం పోలింగ్ తగ్గడం గమనార్హం. వరంగల్ తూర్పులో గణనీయంగా 6.71 శాతం, పరకాలలో 4.9, వర్ధన్నపేటలో 3.69, మహబూబాబాద్‌లో 2.72 శాతం పోలింగ్ తగ్గింది.
అత్యధికంగా నర్సంపేటలో అత్యల్పం వరంగల్ పశ్చిమలో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక పోలింగ్ నర్సంపేట నియోజకవర్గంలో 87.87 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 56.59 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో నర్సంపేటలో అత్యధికంగా 90.05 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 2.18 శాతం తగ్గింది. డోర్నకల్‌లో గతంలో 88.96 శాతం పోలింగ్ జరగ్గా, ఈసారి 87.73 శాతం నమోదై 1.23 శాతం తగ్గింది. పాలకుర్తిలో గత ఎన్నికల్లో 89.01 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 86.68 శాతం నమోదైంది. 2.33 పోలింగ్ తగ్గడం చర్చకు దారితీసింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 2018 ఎన్నికలతో పోలిస్తే 6.71 శాతం పోలింగ్ తగ్గడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో 73.45 శాతం నమోదు కాగా, ఈ ఎన్నికల్లో కేవలం 66.74 శాతం మాత్రమే నమోదైంది. కాగా, ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. పలువురు అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో ఓటర్లకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.