మస్తాన్‌ టీ స్టాల్‌

మస్తాన్‌ టీ స్టాల్‌రోజుటి లాగానే పొద్దున్నే ‘మార్నింగ్‌ వాక్‌’ చేసుకుంటూ నేను, నా మిత్రుడు సుబ్బారావు మస్తాన్‌ టీ స్టాల్‌ దగ్గరకు వచ్చాం. టీ తాగి, ఏవో కొద్ది కబుర్లు చెప్పుకొని ఇంటికి చేరటం మా దినచర్య. మార్నింగ్‌ వాక్‌ చేయడానికి వెళుతున్నామా, మస్తాన్‌ టీ తాగడానికి వెళ్తున్నావా, కబుర్లు చెప్పుకోవడానికి వెళ్తున్నామా అని అడక్కండి. ఇందులో ఏది లేకపోయినా మాకు ఆ రోజు వెలితిగానే ఉంటుంది. ఆదివారమైతే మరో గంట ఎక్కువగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తీరిగ్గా పదింటికి ఇంటికి చేరతాం. ఆదివారం మా మస్తాన్‌ టీ షాపు మిగతా రోజులు కన్నా ఎక్కువమందితో సందడిగా ఉంటుంది.
‘మస్తాన్‌..రెండు స్ట్రాంగ్‌ టీ’ అని కేకేసి అక్కడే బయట ఉన్న చెక్కబల్లపై కూలబడ్డాం. ఒక నలుగురైదుగురు నిలబడి చారు తాగుతూ మాట్లాడుకుంటున్నారు. దాన్ని మేము మస్తాన్‌ టీ స్టాల్‌ అని అంటాం కానీ, అక్కడ అటువంటి బోర్డేమి కనబడదు. తెలిసిన వాళ్లకు అది మస్తాన్‌ షాపు, తెలియని వాళ్లకు టీ స్టాల్‌.
‘కావడి యాత్ర ఇక్కడ జరిగితే, మస్తాన్‌ తన పేరుతో బోర్డు పెట్టాల్సి వచ్చేది’ అన్నాడు సుబ్బారావు యధాలాపంగా.
‘కావడి యాత్రా.. అదేమిటి నేనెప్పుడూ వినలేదే’ అడిగాడు పక్కనే చారు చప్పరిస్తున్న శ్రోత ఆసక్తితో.
‘అది ఇక్కడ లేదులే. నార్త్‌లో జరుగుతుంది. పేపర్లలో కన్వర్‌ యాత్ర అని చదవలేదా.. అదే’ అన్నాడు మావాడు.
‘ఓహో.. అదా, గంగానదికెళ్లి కావడిలో ఆ నీళ్లు మోసుకొచ్చి శివాలయాల్లో అభిషేకం చేసేదా? దాని కావడి యాత్ర అని కూడా అంటారా?’
ఇంతలో మరొకరందుకని ‘పిచ్చి భక్తి..శివుడు నెత్తినే గంగ ఉంటే మళ్ళీ నీళ్లు గంగా నదికి వెళ్లి తీసుకొచ్చేదేమిటో?.ఈ పాట అన్నవాడు నాస్తికుడేమో.’
‘కానీ మనం వేసుకోవాల్సింది ఆ ప్రశ్న కాదు. కావడి యాత్ర జరిగే వందో, రెండువందల కిలోమీటర్ల తోవలో రోడ్డు పక్కన ఉన్న అన్ని రెస్టారెంట్లు, డాబాలు, పాన్‌ షాపులు, చివరికి బడ్డీకొట్లు కూడా షాప్‌ పేరుతో బోర్డు పెట్టాలి అని ప్రభుత్వం అంటున్నది. ఆ బోర్డ్‌ లో షాపు యజమాని, అందులో పని చేసే వాళ్ల పేర్లు వుండాలి. ఇది ఉ. ప్ర. అంటే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశం.’
‘ఎందుకంటా..ఈ అనవసరపు ఆయాసపు పని ప్రభుత్వానికి’ ప్రశ్న వేశాడు మా మాటలు వింటున్న మరో శ్రోత.
అప్పుడు నేను కల్పించుకుని సంభాషణ సాగించాను.
‘మొదట ఇది పోలీసుల ఆర్డర్‌ లాగా ఉంది గాని, నిజానికి ఇది అక్కడి బీజేపీ ప్రభుత్వం ఆదేశమే. ఎందుకు ఈ ఆదేశం దేనికంటే యాత్రికుల పవిత్రత కాపాడటానికట.అలా అని పోలీసులు అంటున్నారు, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వమూ అంటున్నది.కానీ, అసలు ఉద్దేశ్యం వేరు.”
‘అయితే ఇన్నేళ్లు యాత్రికులు పవిత్రంగా ఈ యాత్ర జరపలేదంటున్నదా ఆ ప్రభుత్వం.’
‘అలాగైతే మా నాయనమ్మ మైల, మైల అంటూ ఒకటే గోలపెడుతుంటుంది.అక్కడుంటే పోలీస్‌ ప్రొటెక్షన్‌లో పవిత్రంగా గుడికెళ్లచ్చేదేమో?’అని ఒకడు నవ్వాడు.
‘అలా డైరెక్ట్‌గా అనటం లేదు గాని, యాత్రికులు పూర్తిగా సాత్విక అంటే శుద్ధ శాఖాహారం తీసుకోవాలనుకుంటున్నారట. వారికోసం ఈ ఏర్పాటట.’
‘ ఏడ్చినట్టుంది చెప్పే కారణం. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్టు. అలా ఉంది ప్రభుత్వం చెప్పేది.’ శ్రోత అన్నాడు.
‘కరెక్ట్‌గా చెప్పావ్‌. అసలు విషయం ఏమిటంటే బోర్డు మీద ముస్లిం పేరు ఉంటే అక్కడ ఏమీ కొనవద్దని భోజనం చేయవద్దనే అన్యాపదేశంగా చెప్పటం. ఇది ఒక రకంగా ముస్లింలలో చిన్నాచితక వ్యాపారం చేసుకునే బడుగు జీవుల ఆదాయానికి దెబ్బకొట్టటమే.’
‘నాజీ హిట్లర్‌ టైమ్‌లో యూదులను హింసించటానికి వారి ఇళ్ల మీద గుర్తులు పెట్టేవారు అని చెప్తారు.. ఇది అలాగే వుంది.’ అన్నాడు నా మిత్రుడు.
‘ఇది అంతకంటే ఘోరంగా ఉంది. మన చేత్తో మనకళ్లే పొడుచుకున్నట్టు బోర్డులు మన ఖర్చుతో మనమే పెట్టుకోవాలి.’ ఇంకొకరు మాట కలిపారు.
‘ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, యాత్ర జరిగే మూడు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. కానీ, ఈ ఆర్డరు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోనే పెట్టారు. అక్కడి రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం సొంతం బలం మీద ఉంది. బీహార్‌లో లేదు. బీహార్‌లో జెడియుతో కలిసి అధికారంలో ఉంది. జెడియు ఇటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. పైగా అలా ఇవ్వటం తప్పు అంటున్నది..’
‘ బీహార్‌ లోనే కాదు, ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ మిత్రపక్షాలు ఎస్పీ, బీఎస్పీతో పాటు వ్యతిరేకిస్తున్నాయి. మాట అన్న తర్వాత వెనక్కి తీసుకున్నప్పటికీ బీజేపీ ఉత్తరప్రదేశ్‌ నాయకుడు అబ్బాస్‌ నక్వి ఈ ఆదేశాన్ని వ్యతిరేకించాడు. అయినా బీజేపీ ముందుకే వెళుతున్నది, చెట్టు మీద భేతాలుడి లాగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం మౌనంగా వున్నది అంటే ఈ ఆదేశాలకు అంగీకరించినట్టే కదా .’
‘అన్నా, ఇది బీజేపీకి ఉన్న అహంకారంగా ఆరెస్సెస్‌కు ఎందుకు కనబడ లేదా?’
ఇట్లా మాట్లాడుకుంటు న్నప్పుడు ఎవరో ఇద్దరు బైక్‌ను టీ స్టాల్‌ పక్కన ఆపి, మస్తాన్‌ నుంచి చారు అందుకుని, సిగరెట్లు ముట్టించి, చారు తాగుతూ ఒకపక్క నిలబడి మాట్లాడు కుంటున్నారు.మా మాటలు వింటున్న ఇంకొకరు ‘అన్నా, నేను ప్రౌడ్‌ హిందువును కాకపోయిన ప్పటికీ, హిందువునే. కానీ, నా కొడుకు రంజాన్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాడు, వాడికి హలీం అంటే మహా ఇష్టం. మా ఆవిడేమో రంజాన్‌ పండగ రోజుల్లో కచ్చితంగా చార్మినార్‌ వెళ్లి తోపుడు బళ్ల దగ్గర షాపింగ్‌ చేయాల్సిందే.’
‘నువ్వు ప్రౌడ్‌ హిందువు అన్నావు, హిందువులు కాక ఈ రకం హిందువులు కూడా వున్నారా?’ వాడి పక్కనున్న వాడు అడిగాడు.
‘ప్రౌడ్‌ హిందువు అంటే ఆరెస్సెస్‌ వాళ్లు, ఇతర మతాలను ద్వేషించే వాళ్లు. మనం మామూలు హిందువులం.అందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుండేవాళ్లు.’
‘అన్నా.. డిసెంబరు, జనవరి నెలల్లో మన వైపు చాలా చోట్ల -అయ్యప్ప భక్తులకు ప్రత్యేక భోజనం కలదు- అనే బోర్డులు కనపడుతుంటాయి. యూపీలో ఈ గొడవెందుకు? అలా బోర్డులు పెడితే సరిపోతుంది కదా,’ ఎవరో చెప్తున్నదానికి అందరూ శ్రద్ధగా వింటున్నారు.
‘సరిపోతుంది. కానీ వాళ్లకి కావాల్సింది ఆ గొడవేందు కన్నావ్‌ చూసావా? గొడవే వాళ్లకు కావాల్సింది. హిందూ, ముస్లింల మధ్య తగాదా. అట్లా వుంటేనే తమ అధికారం శాశ్వతంగా ఉంటుందని అనుకుంటున్నారు.’ అన్నాను.
అందరూ వింటున్నారు.
‘ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఇద్దరు బైక్‌ మీద వచ్చి మస్తాన్‌ దగ్గర చారు, సిగరెట్లు తీసుకుని పక్కన నిలబడి కబుర్లు చెప్పుకుంటూ చారు తాగి వెళ్లారు. వారికి ఈ షాప్‌ ఏ మతం వాడిదో, ఇక్కడ చారు ఇస్తున్నవాడు ఏ మతం వాడో అక్కర్లేదు. అసలు కొనేవాడికి, అమ్మేవాడికి మధ్య ఈ మత సంబంధం ఉండదు. అది లౌకిక సంబంధం. కానీ దానిలోకి కూడా మతాన్ని జోప్పించాలని చూస్తున్నారు.’
ఒకవైపు పని చేస్తూనే మా మాటలు వింటున్న మస్తాన్‌ ఒక చేతిలో టీ పొడి, మరో చేతిలో పంచదార తీసుకుని వచ్చి మాకు చూపిస్తూ ‘చారు తాగటానికి… టీ తోటలు ఎక్కడ ఉంటాయి, టీ ఆకులు ఎవరు తెంపుతారు, చెరగతోటలకు నీళ్లు ఎవరు పోస్తారు, చెరకు గడల్ని ఎవరు కోస్తారు, వాటిని ఫ్యాక్టరీలకు ఎవరు తీసుకొస్తారు, గేదెల్ని ఎవరు పెంచుతారు, పాలు ఎవరు పితుకుతారు, ఎవరు మా దాకా తీసుకొచ్చి పోస్తారు,వారు హిందువులా , ముస్లింలా, క్రిస్టియన్లా , అనేది చారు తయారుచేసే నాకుగాని, తాగే మీకు గాని అవసరం లేదు.పాలు తెచ్చినవాడు వేరే మతస్తుడని పాలు లేకుండా నేను చారు తయారు చేయగలనా? చారు అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ మీరు తాగగలిగే వాళ్లా? ఇవన్నీ కలిపితేకదా అద్భుతమైన చారు తయారయ్యేది.’ అని చెప్పి తిరిగి పనిలో జొరపడ్డాడు.
‘కరెక్ట్‌గా చెప్పావ్‌ మస్తాన్‌? శ్రమ లేకుండా ఏ వస్తువు తయారుకాదు, ఏ వస్తువు నీ దరి చేరదు. శ్రమ కూడా చేయగలిగేది మనుషులు మాత్రమే. అందుకనే పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, ఆఫీసుల్లో, దుకాణాల్లో ఇలా అన్ని చోట్లా, అన్ని దేశాల్లో వందల వేలల్లో పనిచేస్తూ శ్రామికులు కనపడుతుంటారు. మా మతం వాడు చేసిందే తింటామంటే ఆకలితో మలమల మాడి చావాల్సిందే. నోరూరించే మామిడికాయకు మతం ఏమిట్రా బాబోరు.’ అంటూ ఇంటికి వెళ్లటానికి లేచాను.
నాతో పాటే సుబ్బారావు లేచాడు.
‘అయినా అటువంటి యాత్రలు ఇక్కడ లేవు కదా. ఇక బోర్డులు, పేర్లు తగిలించే పని వుండదులే’ అని వెనక నుంచి ఎవరో అన్నారు.
‘మతపిచ్చి వున్నవాడు ఏ సందర్భాన్ని అయినా గొడవలు లేవనెత్తటానికకే వాడుకుంటాడు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి మన జాగ్రత్తలో మనం వుండాలి.’
‘అయితే మస్తాన్‌ కూడా ఎప్పుడో ఒకప్పుడు ‘మస్తాన్‌ టీ స్టాల్‌ ‘ అని బోర్డు పెట్టాల్సి వస్తుందేమో.
‘ సుబ్బారావు, ఒకటి తెలుసుకో. హిందూ, ముస్లిమ్‌ అనే ఈ రెండు మతాలలోనూ మస్తాన్‌ పేరుతో వ్యక్తులున్నట్లే, రెండు మతాలలోనూ వున్నది మనుషులే అనే నిజం తెలిసి వుంటే ఈ గొడవలు, అల్లర్లు వుండవు. కాదంటావా?’
ఈ మాటను, మీరైనా, ఎవరైనా కాదనగలరా?
– కర్లపాలెం