– హడావుడిగా ముగిసిన పీఈసీ
– ఇన్ని పేజీలు చదవాలా? రేణుకా చౌదరి అసహనం
– ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క గైర్హాజర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఆశావాహుల దరఖాస్తులను పరిశీలించేందుకు ఆదివారం సమావేశమైన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) హడావుడిగా ముగించింది. దరఖాస్తులను పరిశీలించకుండానే టిక్ మార్క్ చేసి వెళ్లిపోయారు. పర్సన్ టు పర్సన్ చర్చించి మూడు పేర్లు ఖరారు చేస్తారని భావించిన వారికి నిరాశే మిగిలింది. దరఖాస్తు చేసుకున్న వెయ్యి మందికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచిన స్పైరల్ బైడింగ్ సభ్యులకు ఇచ్చినట్టు తెలిసింది. అందులో తెలిసినోళ్ల గురించి టిక్ మార్క్ చేయాలనీ, తెలియకపోతే వదిలేయాలంటూ పీఈసీ చైర్మెన్ సూచించడంతో సభ్యులు హడావుడిగా టిక్ మార్క్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో మాటల్లేకుండానే టిక్‌మార్క్ చేయడంతో తొందరంగానే సమావేశం ముగిసింది. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మాత్రం ఇన్ని పేజీలు చదవాలా? అంటూ అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. మొత్తంగా అభ్యర్థుల గురించి చర్చించకుండానే పీఈసీ సమావేశాన్ని ముగించడంతో అభ్యర్థి ఎంపిక పారదర్శకంగా ఉండదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. దీంతో పీఈసీ సభ్యులు ముందుగానే అభ్యర్థుల జాబితా రూపొందించి, తూ…తూ మంత్రంగా సమావేశాన్ని నిర్వహించారనే విమర్శలు వస్తున్నాయి. పీఈసీ సభ్యుడు ఏయే పేరుపై టిక్ మార్క్ చేశాడో వారికి గురించి పూర్తిగా సోమవారం జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ముందు చెప్పాల్సి ఉంది. అతనికి కచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పే హక్కు సభ్యుడికి లేదు…కానీ దరఖాస్తుదారుల్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో చెప్పడానికి స్క్రీనింగ్ కమిటీ అవకాశం కల్పిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాటన్నింటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత నియోజకవర్గానికి మూడు పేర్ల చొప్పున ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పీఈసీ పంపనుంది. సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క గైర్హాజర్ అయ్యారు.
అభ్యర్థుల ఎంపికలో అపోహలకు గురి కావొద్దు
ఆశావహులకు రేవంత్ విజ్ఞప్తి
ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ) ఎంపిక చేసిన జాబితాను.. సీల్డ్ కవర్‌లో స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చెప్పారు. పీఈసీ సమావేశానంతరం తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. మూడు రోజులపాటు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లోనే ఉంటుందని చెప్పారు. సోమవారం పీఈసీ సభ్యులతో వేర్వేరుగా స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటుందని చెప్పారు. ‘అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈసారి అభ్యర్థుల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయబోతున్నాం. స్థానిక పరిస్థితులు, సామాజిక వర్గాలు ఆధారం చేసుకుని బీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తాం. అభ్యర్థుల ఎంపికలో ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదు’ అని రేవంత్ వివరించారు. మంగళవారం డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో కమిటీ సమావేశమవుతుందని తెలిపారు. ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పీఈసీ ఇచ్చిన నివేదికపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుందన్నారు. స్క్రీనింగ్ కమిటీ తయారు చేసిన జాబితా…సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిస్తుందని వివరించారు. వీలైనంత తర్వలో మొదటి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితానే ఫైనల్ అనీ, అప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా తనకు కూడా సమాచారం ఉండదని చెప్పారు.