బీజేపీతో 3 ప్రాంతీయ పార్టీల మ్యాచ్‌ ఫిక్సింగ్‌

3 regional parties with BJP Match fixing– సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
– కరువుపై ఏపీ సీిఎం ప్రకటన హాస్యాస్పదం
– 15న ప్రజారక్షణ భేరి సభను జయప్రదం చేయాలి
– వైసీపీ సాధికారత నేతి బీరకాయ
– దళితులు, గిరిజనుల భూములు లాక్కుంటూ సామాజిక సంహారం చేస్తున్న వైసీపీి
– తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి
అమరావతి: ఏపీలో వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయని, విచిత్ర రాజకీయ పరిస్థితి ఉందని ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు పార్టీల మధ్య మాయ నడుస్తోందని అన్నారు. వైసీపీ, బీజేపీ నేతలు రాష్ట్రంలో తిట్టుకుంటున్నారని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పరస్పరం సహకరించుకుంటున్నాయని, మద్దతు ఇచ్చుకుంటున్నాయని, ఇదేమీ రాజకీయమని ప్రశ్నించారు. మూడోసారి మోడీ ప్రధాని కావాలని, అధికారంలోకి రావాలని పవన్‌కల్యాణ్‌ కోరుకుంటున్నారని, అదే బీజేపీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని నడిపిస్తోందనే విషయాన్ని గుర్తించాల న్నారు. రాష్ట్రంలో వైసీపీితో పోరాడుతున్నామని చెబుతున్న జనసేన కేంద్రంలో బీజేపీతో కలిసి పనిచేస్తోందని, ఇక్కడ తెలుగుదేశంతో కలిసి రాజకీయ ప్రచారం చేస్తోందని, తెలుగుదేశం కూడా జనసేనతో కలిసి నడుస్తామని చెబుతోందని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయడం లేదని చెబుతుంటే దానితో ఏపీిలో కలిసి పనిచేస్తున్న జనసేన అక్కడ బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లిందని, ఎన్‌డిఎ కూటమిలోనూ ఉందని, ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు బీజేపీ పట్ల వారి వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ వైఖరి స్పష్టం చేయాలని కోరారు. మహిళలు, దళితులు, మైనార్టీలు, ఆదివాసీలను అణచివేస్తున్న బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా వారికి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అన్ని సందర్భాల్లోనూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న బీజేపీతో కలిస్తే ప్రజలకు న్యాయం చేయలేరని అన్నారు.
మరోవైపు రాష్ట్రంలో సాధికారత పేరుతో వైసీపీి చేస్తున్న యాత్ర నేతిబీరకాయ లాంటిదని, అందులో నెయ్యి ఎంత ఉంటుందో వీరి యాత్రలోనూ అంతే సాధికారత ఉంటుందని విమర్శించారు. ఏజెన్సీలో పోడు భూములపై గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చారని, అక్కడ నుండి కూడా వెళ్లగొడుతున్నారని తెలిపారు. అటవీశాఖ అధికారులు గిరిజనులపై దౌర్జన్యం చేస్తుంటే ప్రభుత్వం చూస్తు ఊరుకుందని విమర్శించారు. ఈ భూములను పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో అదానీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గ్రామసభలు జరపకుండా అంగుళం కూడా ఇవ్వబోమని గిరిజనులు తెగేసి చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు ఉంటే వాటిపై పోరాడుతున్న దళితులకు పట్టాలు ఇవ్వకుండా సాధికారత ఎక్కడని ప్రశ్నించారు. పేదలకు భూ పంపకం, కనీస వేతనం, ఉపాధి కల్పన ఉంటేనే సాధికారత అన్నారు. ఆర్థిక సాధికారత కల్పించకుండా కార్పొరేషన్‌ పదవులు ఇస్తే వారు కార్లలో తిరగడం తప్ప ప్రజలకు జరిగే న్యాయం ఏమిటో చెప్పాలన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ వైసీపీి వాళ్లు సామాజిక సాధికార యాత్ర పేరుతో హడావుడి చేస్తూ ఎస్‌సీ, ఎస్‌టీి, బీసీీి, మైనార్టీలను ఉద్దరిస్తామని చెబుతున్నారని కానీ కార్యక్రమంలో గానీ, చేసిన పనుల్లో సామాజిక న్యాయం లేదని విమర్శించారు. ఇప్పటికీ గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటికలు లేవని తెలిపారు. 1235 జిఓను అమలు చేయకుండా సామాజిక సాధికారత గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. భూమిలేక పేదలు ఎక్కువ మంది కూలి పనులకు వెళ్లిపోతున్నారని, అటువంటి వారందరిలో ఎక్కువమంది దళిత, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని, వారికి భూమిపై హక్కు కావాలని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకుండా, ఉపాధి లేకుండా సాధికారత ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు.