ఇందూరులో మట్టి కథ సినిమా సందడి

నవతెలంగాణ -ఆర్మూర్
ఎవరితను.. ఎక్కడివాడు… ఎన్ని సినిమాలు చేసిండు…. సినిమా ఇండస్ట్రీ లో ఎప్పుడో ఎంటర్ అయ్యి ఎన్నో హిట్లు కొట్టిన స్టార్ హీరో అయినట్లుగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిండు. చమక్ చమక్ మనే మెరుపులాంటి మాటలతో నిజామాబాద్ కుర్ర కారును నివ్వెర పోయేలా చేసిండు చల్ చయ్య చయ్య అనే షారుక్ ఖాన్ పాటకు అదిరేటి స్టెప్పులతో యువతను కేరింతలు కొట్టించి వారి మనసులు దోచేసిండు. ఆటలతో మాటలతో అందరినీ అలరించిన ఇందూరు బిడ్డ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తాడనిపించిండు ఆయనే మన జిల్లా మట్టిలో నుండి వచ్చిన మాణిక్యం మట్టి కథ సినిమా కథానాయకుడు ఆర్మూర్ కు చెందిన అజయ్ వేద్. జిల్లా కేంద్రంలోని ఆదివారం ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన ప్రి-రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో సినిమా టీజర్ ని సీరియస్ గా తిలకిస్తున్న ప్రేక్షకులకు చేతిలో రోజా పూలతో హాయ్ హలో నిజామాబాద్ అంటూ మెరుపుతీగల ప్రత్యక్షమై మధ్య మధ్యలో కొందరికి ప్రేమగా రోజా పూలు అందిస్తూ కొంటెగా సెటైర్లు వేస్తూ స్టేజ్ ఎక్కి ఎక్కగానే అప్పుడే మొదలైన పాటకు స్టెప్పులేస్తుంటే దాన్ని చూస్తున్న ప్రేక్షకులంతా ఆకాశాన్ని అంటేటంత కేరింతలతో హోరెత్తించారు. డాన్స్ తర్వాత మొదలైన హీరో అజయ్ వేద్ మాట్లాడే మాట మాటకు యువత నుండి అమోఘమైన స్పందన వచ్చింది. కేరింతలతో ఉర్రూతలూగుతున్న యువతకు షారుక్ ఖాన్ యొక్క మాటలు చెప్పి యువత ‘అనుకుంటే అసాధ్యం అనేది లేదు’ అనే మెసేజ్ ని యువత మెదల్లలోకి ఎక్కించాడు. మీరు ఏదైనా అనుకుంటే అవుతుందా అని హీరో అడగగానే “బరాబర్ అవుతుంది” అని యువత నుండి రెస్పాన్స్ రప్పించాడు అజయ్ వేద్. మట్టి కథ సినిమా నిర్మాత అప్పిరెడ్డి సినిమా ఇండస్ట్రీలో పేరుగాంచిన హీరోలని తీసుకొని సినిమా తీయడం కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రతిభ ఉన్నటువంటి కొత్తతరం హీరోలను అందించే లక్ష్యం గలవాడని అజయ్ వేద్ అన్నాడు. మట్టి కథ సినిమాలో మాలాంటి యువ నటి నటులను ప్రోత్సహించిన నిర్మాత అప్పి రెడ్డికి మాలాంటి కొత్త నటీనటులచే ఒక అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పవన్ కడియాల లకు సర్వదా కృతజ్ఞులుగా ఉంటామని ఆయన అన్నారు.మళ్లీ ఆ వెంటనే మట్టి కథ సినిమాలోని ‘సల్లగుండు సల్లగుండు’ అనే పాటకు అజయ్ వేద్ ప్రేక్షకులను స్టేజ్ పైకి ఆహ్వానించి వారందరితో కలిసి స్టేజ్ పైన స్టెప్పులేసి పాట చివరి చరణానికి హాల్ లోని చిన్న పెద్ద ప్రేక్షకులందరిచేత స్టెప్పులు వేయించి అదరగొట్టాడు. సినిమా దర్శకుడు పవన్ కడియాల మాట్లాడుతూ తెలంగాణ పల్లెటూరు కథాంశంగా తెరకెక్కించిన సినిమాకు తొమ్మిది అవార్డులు దక్కడం సంతోషంగా ఉందన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా సహజ సిద్ధంగా తీసిన ఈ సినిమా అందరి మనసులు దోచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా ఈనెల 22 నాడు థియేటర్లలో విడుదల కానున్నదని అందరూ సినిమా చూసి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో వెక్టార్ కాలేజ్ చైర్మన్ జోషి డైరెక్టర్ సంతోష్ సినిమా బృందం శ్రీనివాస్ రావు రుచిత అక్షయ్ తేజ సతీష్ వాఖ్యాత కోకిల నాగరాజు అంజలి తదితరులు పాల్గొన్నారు.