మౌఢ్య ‘బోధ’

 Sampadakiyam‘పౌర్ణమి రోజుల్లో గర్భధారణ వద్దు. అలాగే తెలివైన పిల్లల కోసం సూర్యని ముందు విల్లులా వంగుతూ నమస్కారం చేస్తూ నీళ్లను సమర్పించండి’ అని మహిళా డీఐజీ సవితా సోహన్‌ బాలికలకు ఉపదేశం చేశారు. అది కూడా బాలికల రక్షణ కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఒక అవగాహన కార్యక్రమంలో 12వ తరగతి విద్యార్థినులను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం శోచనీయం. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు తీస్తున్న 21వ శతాబ్దంలో ఈ పుక్కిట పురాణాలు బోధించి నేర్పేది కుసంస్కారమే. ఇప్పుడు బాధ్యతగల ప్రభుత్వ అధికారులు విద్యార్థినులకు ఈ విధంగా చెప్పడం అత్యంత దారుణమైన విషయం. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాఠశాలలు నేడు అశాస్త్రీయ పాఠాలకు వేదికలు కావడం విషాదం.
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఒక పోలీసు అధికారిగా, చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆడపిల్లలకు చట్టాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్పకుండా సమాజం ఉలిక్కిపడే ‘తిరోగమన పాఠాలు’ బోధించడం సమాజానికే చేటే గాదు, సిగ్గుచేటు కూడా. ఈ వివాదం కొనసాగుతుండగానే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో క్యాబినెట్‌ హోదా ఉన్న మరో ప్రబుద్ధుడు ”ఈ మధ్య యువత ఒక బిడ్డను కని ఆగిపోతున్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారుతోంది. అందుకే బ్రాహ్మణులు కనీసం నలుగురు సంతానం కనాలి. వారికి రూ.లక్ష నజరానా ఇస్తాం” అని ప్రకటించడం మరీ విడ్డూరంగా ఉంది. దేశం ఆధునికతను సంతరించుకునే కొద్దీ అంతరించ పోవాల్సిన కులం మన రాజకీయ వ్యవస్థ పుణ్యమా అని వెర్రితలలు వేస్తుంది అన్నడానికి ఇంత కంటే రుజువులేం కావాలి. వీటి ప్రభావం పడిన వారు వారి పిల్లలకు నిస్సందేహంగా తిరిగి మౌఢ్యాన్నే బోధించరా? ‘విజ్ఞానంతోనే వికసించు జగత్తు/ పసిపిల్లల చదువే దానికి విత్తు’ అన్న కవి వాక్కులను తిరగరాస్తూ అజ్ఞానాన్ని విద్యార్థుల మెదడులో చొప్పించే పని శరవేగంగా జరుగుతుందన్నదానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.
‘పుట్టేది ఆడపిల్ల అని ముందే తెలిస్తే, కడుపులోని ఆ పిండాన్ని అక్కడికక్కడే కరిగించేస్తున్నారు. భ్రూణ హత్యలు ఆపకుండా గర్భధారణ గురించి అశాస్త్రీయ విషయాలు విద్యార్థులకు చెప్పడం ఏం సంస్కారం? అంతరిక్షంలోకి ఆడపిల్లలు వెళ్తున్న కాలంలో ఇప్పటికీ ప్రజల ఆలోచనల్లోనూ వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. సమాజం ఎప్పుడో వదిలేసిన అమానుష ఆచారాలు మరల భుజాన వేసుకునే కుహనా ‘సంస్కరణ’ వాదులు బయలుదేరినంత కాలం ఎన్ని చట్టాలు వచ్చినా నిరుపయోగమే. పాలకులు చట్టాలను అమలు చేయడం కంటే ప్రజలను అశాస్త్రీయత వైపు నడిపించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దాని ఫలితమే చట్ట విరుద్ధం అని తెలిసినా ఇప్పటికీ బాల్య వివాహాలు ఆగడం లేదు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలు రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్నాయన్న అధికారిక లెక్కలు ఆందోళన కల్గిస్తున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు అభివృద్ధిలోనే కాదు.. సామాజిక వెనుకబాటులోనూ ముందు ఉన్నాయన్న విషయం నిష్టుర సత్యం. పెళ్లంటే ఏమిటో కూడా తెలియకుండానే ముక్కుపచ్చలారని పసిమొగ్గలు కుటుంబ బరువు, బాధ్యతల బందిఖానాలో చిక్కి శల్యమైపోతున్నారు. గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అవిద్య, అవగాహనాలేమి కారణాలుగా కనిపిస్తుంటే… పట్టణాల్లో సినిమాల దుష్ప్రభావాలు, లైంగిక వేధింపులు, లైంగికదాడులు నుంచి బయట పడేందుకు చిన్న పిల్లలకే పెళ్లిళ్లు చేస్తున్నామని తల్లిదండ్రులు చెప్పడం ఒక విషాదం. బాల్య వివాహాలు జరగకుండా నివారించాల్సిన ప్రభుత్వాలు ప్రజల్లో చైతన్యం నింపడంలో విఫలమవుతున్నాయి. పిల్లలకు సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగడానికి, అభివృద్ధి చెందటానికి రక్షణ పొందే హక్కును రాజ్యాంగం కల్పించింది. వారి హక్కులను హరిస్తున్న బాల్య వివాహల పట్ల ప్రజల్లో అవగాహన పెంచి, భయం పోగొట్టి, మహిళలకు, ఆడపిల్లల భద్రతకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చేయకపోతే ఈ బాల్య వివాహాలు అడ్డుకోవడం కష్టం.
శాస్త్ర సాంకేతికాభివృద్ధితో ప్రపంచమంతా పురోగమ నానికి బాటలు వేసుకుంటుంటే… మన పాలకులు మాత్రం ఏ రుజువులూ లేని పుక్కిట పురాణాలూ, అంధ విశ్వాసాల ఆధారంగా దేశాన్ని తిరోగమన బాట పట్టిస్తున్నారు. సమాజ ప్రగతిని ఇలాంటి మౌఢ్యాలు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాల పని వాటన్నింటినీ చేష్టలుడిగి చూస్తుండటమేనా అన్నది జవాబులేని ప్రశ్నగా మిగిలిపోరాదు. ”నేడు భారతదేశం అజ్ఞానం, మత ఛాందసం, మతోన్మాదాల అగాధంలోనూ, అన్నిరకాల జడ పదార్థాల పూజలలోనూ మునిగిపోయి ఉంది. ఈ గందరగోళ పరిస్థితి నుంచి దేశాన్ని ఏ శక్తి బయటపడేయ గలదు? మన జీవితంలో ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నింటినీ ఒక్క దెబ్బతో ఏ శక్తి పరిష్కరించలేకపోవచ్చు. కాని, సర్‌ సి.వి.రామన్‌ చేప్పినట్టు ‘విజ్ఞాన శాస్త్రమే’ ఒక స్వేచ్ఛా జీవనం వికసించడానికో మార్గం పరుస్తుందనే ఎరుక భావితరాలకి అందించాలి. ఇది ప్రజలేకాదు, పాలకులూ గుర్తించాలి.