– 223 టార్గెట్ ఊదేసిన ఆసీస్
– రుతురాజ్ శతకం వథా
– మూడో టీ20లో ఆస్ట్రేలియా గెలుపు
222 సరిపోలేదు. మాక్స్‌వెల్ (104 నాటౌట్) మళ్లీ మ్యాడ్‌నెస్ చూపించాడు. 223 పరుగుల భారీ ఛేదనలో 134/5తో ఆస్ట్రేలియా ఓటమి అంచుల్లో నిలువగా.. మాక్స్‌వెల్ వదల్లేదు. 47 బంతుల్లోనే శతకం సాధించిన మాక్స్‌వెల్ 8 సిక్సర్లు, 8 ఫోర్లతో అరాచకం సష్టించాడు. మాక్స్‌వెల్ అద్వితీయ ఇన్నింగ్స్‌తో మూడో టీ20లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచుల సిరీస్‌లో సజీవంగా నిలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్) అజేయ సెంచరీతో తొలుత భారత్ 222/3 పరుగులు చేసింది.
నవతెలంగాణ-గువహటి
పరుగుల వరద పారిన గువహటి టీ20లో ఆస్ట్రేలియా ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరు బంతి థ్రిల్లర్‌లో భారత్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-2తో ఆశలు నిలుపుకుంది. 223 పరుగుల రికార్డు ఛేదనలో గ్లెన్ మాక్స్‌వెల్ (104 నాటౌట్, 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. చివరి 12 బంతులకు 43 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ మాథ్యూ వేడ్ (28 నాటౌట్, 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) తోడుగా అద్భుతం చేశాడు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వేడ్ చెలరేగగా.. ఆఖరు ఓవర్లో మాక్స్‌వెల్ మోత మోగించాడు. వికెట్ల వెనకాల ఇషాన్ కిషన్ వైఫల్యం భారత్‌ను గట్టి దెబ్బతీసింది. ట్రావిశ్ హెడ్ (35, 18 బంతుల్లో 8 ఫోర్లు) పవర్‌ప్లేలో ఆసీస్‌కు ధనాధన్ ఆరంభాన్ని అందించాడు. హార్డీ (16), ఇంగ్లిశ్ (10), స్టోయినిస్ (17), డెవిడ్ (0) నిష్క్రమణతో ఆసీస్ ఓ దశలో 134 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. భారత్ గెలుపు లాంఛనమే అనుకున్న తరుణంలో మాక్స్‌వెల్ మ్యాడ్‌నెస్ చూపించాడు. 20 ఓవర్లలో 5 వికెట్లకు ఆసీస్ 225 పరుగులు చేసింది. ఇక, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్, 57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్ (39), తిలక్ వర్మ (31 నాటౌట్) రాణించారు. భారత్, ఆసీస్ నాల్గో టీ20 శుక్రవారం రారుపూర్‌లో జరుగనుంది.
గైక్వాడ్ సెంచరీ :
టాస్ నెగ్గిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కానీ భారత్‌కు ఈసారి ఆశించిన ఆరంభం దక్కలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) త్వరగా అవుటయ్యారు. పవర్‌ప్లేలో రెండు వికెట్లు చేజార్చుకున్న భారత్ 43 పరుగులే చేసింది. కెప్టెన్ సూర్య కుమార్ (39) తనదైన శైలిలో ఇన్నింగ్స్‌కు వేగం జోడించాడు. రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లతో ఆకట్టుకునే ఇన్నింగ్స్ నమోదు చేశాడు. సూర్య సైతం నిష్క్రమించినా.. తిలక్ వర్మ (31 నాటౌట్) గైక్వాడ్‌కు జత కలిశాడు. పది ఓవర్లలో భారత్ 80/2తో నిలిచింది. ఇక్కడ నుంచి మొదలైన రుతురాజ్ దండయాత్ర ఇన్నింగ్స్ ఆఖరు బంతి వరకు కొనసాగింది. 9 ఫోర్లతో 32 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన గైక్వాడ్.. శతకాన్ని శరవేగంగా అందుకున్నాడు. సిక్సర్ల మోత మోగించి 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. గైక్వాడ్ దెబ్బకు ఆసీస్ బౌలర్లు బేజారిపోయారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అరోన్ హార్డీపై మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 25 పరుగులు పిండుకున్నాడు. అంతకముందు అతడు వేసిన ఓవర్లోనూ మూడు బౌండరీలతో మెరిశాడు. ఇక చివరి ఓవర్లో గ్లెన్ మాక్స్‌వెల్‌కు చుక్కలు చూపించాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో దండెత్తిన రుతురాజ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. రుతురాజ్ మెరుపులతో చివరి మూడు ఓవర్లలో భారత్ 67 పరుగులు పిండుకుంది. మరో ఎండ్‌లో తిలక్ వర్మ ఆశించిన షాట్లు ఆడలేకపోయాడు. అయినా, రుతురాజ్‌కు చక్కగా స్ట్రయిక్‌రొటేట్ చేసి మెప్పించాడు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్‌సన్, బెహాన్‌డార్ఫ్, హార్డీ ఒక్కో వికెట్ తీశారు. బెహాన్‌డార్ఫ్ నాలుగు ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి ఔరా అనిపించాడు.