నువ్వు భూగోళానికి అవతలి వైపు
నేను భూమికి ఈవలి వైపు
దేశాలు వేరు ప్రాంతాలు వేరు
నేల వేరు భాష వేరు
ఎక్కడోళ్లం అక్కడే ఉంటాం
ముఖ పుస్తకం మనల్ని కలుపుతుంది
వాట్సప్ కాల్ మనల్ని
ముఖాముఖిగా నిలబెడుతుంది
సంభాషణ ఉంటుంది స్పర్శ ఉండదు
కదలిక ఉంటుంది కనికరం ఉండదు
సుఖ తీరాలను ఒకటి చేస్తుంది
మార్కెట్లో వస్తువు ఉంటుంది
జేబులో రొక్కం నిండుకుంటుంది
ఒకే ఒక్క పాస్వర్డ్ ముందు
లోకమంతా మోకరిల్లుతుంది
సెల్ ఫోన్ ఉంటే చాలు
పిడికిట్లో సకల సౌకర్యాలు
నీ ముందు పరేడ్ చేస్తాయి
ఎక్కడో యుద్ధం జరుగుతుంది
ఒకే ఒక్క రిమోట్ కంట్రోల్ తో
లక్ష్యాలను ఛేదిస్తావు, అదుపు చేస్తావు
మారణ హోమాన్ని సృష్టించేటోడే
యుద్ధాలు తయారు చేస్తాడు
మంచి చెడ్డల ప్రసక్తి లేదు
ధర్మాధర్మాల మాట లేదు
జపాన్ లో భూకంపం వస్తుంది
ప్రపంచ స్టాక్ మార్కెట్లు
నిలువునా కుప్పకూలుతాయి
బంధాల సంబంధాలు తెలిసేసరికి
దుకాణం తెరిచి మూతపడుతుంది
ఎప్పుడో ఒకప్పుడు
ప్రపంచ కోర్టులో దేశాలు ఐ.పి.పెడతాయి
– జూకంటి జగన్నాథం, 9441078097