ప్రధాని మోడీ ఆదివారం మహబూబ్‌నగర్ సభలో తెలంగాణకు మరోసారి పసుపుబోర్డును వాగ్దానం చేశారు! పసుపుబోర్డు రైతులకు ఎంతో ఉపయోగమని తెలియజేశారు. ఉపయోగం కాబట్టే పసుపుబోర్డును డిమాండ్ చేస్తూ 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి వందలాది మంది రైతులు నామినేషన్ వేశారు. అప్పుడు మాటిచ్చారు మరిచిపోయారు. ఇప్పుడు కొత్తగా సెలవిచ్చారు. ఎంతైనా మోడీగారు కదా… వారికే చెల్లింది. ములుగులో తొమ్మిది వందల కోట్ల రూపాయలతో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మించబోతున్నట్టు కూడా ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రకటించిన వరాలనే ఈ ఎన్నికల ముందు ప్రకటించారు. హామీల అమలులో వీరి చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి…పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్‌తో నమ్మబలికి గెలిచిన బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. రైతులు ఎన్ని ఆందోళనలు చేసినా ఈ ఐదేండ్లలో పసుపు బోర్డు గురించి ఏ దశలోనూ ప్రధాని సైతం పార్లమెంటులో ప్రకటన చేయలేదు. తీరా ఐదేండ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికల ముందు పసుపు బోర్డు ఏర్పాటు అనేది కొత్త అంశం అన్నట్టుగా రాగాలు తీయడం విడ్డూరం. పసుపుబోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం గతంలోనే కేంద్రం ఆమోదించింది, కానీ ఇప్పటివరకు అమలు చేయకపోగా రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే ఆలస్యం అయిందని, లేకపోతే ఎప్పుడో నిర్మించేవారమని ప్రధాని చెప్పడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాస్తవానికి గిరిజన విశ్వవిద్యాలయం రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది. అయినా ఆచరణకు నోచుకోలేదు. ఇదంతా మరిచి కొత్తగా హామీ ఇవ్వడం ప్రజల్ని వంచించడమే.
వివిధ సందర్భాలలో మోడీ ఇచ్చిన హామీలెన్నో అటకెక్కాయని చెప్పడానికి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు విశాఖకు రైల్వేజోన్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు అడుగుపడలేదు. ఏపీకి అద్భుతమైన రాజధానిని నిర్మించి ఇస్తామని అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యారు. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. అంతెందుకు… తెలంగాణకు ప్రకటించిన కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కూడా దిక్కులేదు కదా..! పైగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోడీకి మించిన వారు లేరంటూ భజన బృందాల ఊకదంపుడు. ‘మోడీ హామీ ఇచ్చాడంటే అది నెరవేరినట్టే.. ఇందుకు నిదర్శనం ఏన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది కదా’ అని గొప్పలు పోతున్నారు. ఆమోదం పొందినా అది ఇప్పట్లో అమలులోకి వచ్చేది కాదనేది అందరికీ తెలిసిందే.
అడ్డంకులను సృష్టించింది బీజేపీ ప్రభుత్వమే. ఎప్పుడో అమలులోకి వచ్చే మహిళా బిల్లును ఆమోదించడంలోని పరమార్థమేమిటో తెలియనిదేమి కాదు. అయితే తాను అధికారంలోకొస్తే నల్లధనం వెలికితీస్తామని, ప్రతి పౌరుడి ఖాతాలో రూ. పదిహేను లక్షలు వేస్తామని, ఏటా రెండు కోట్ల కొలువు ఇస్తామని… ఇలా చెప్పుకుంటే పోతే ఎన్ని హామీల మూటలో..! ఇచ్చే అనేక హామీలు నెరవేరలేదన్న వాస్తవం ఆయనకు తెలియంది కాదు. చాలా హామీలు నెరవేర్చేవి కావని కూడా ఆయనకు తెలుసు. తెలియాల్సింది ప్రజలకే. అయినప్పటికీ ఆయన అనేక హామీలు ఇస్తూ ఓట్లు దండుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పుకుంటున్న మోడీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహౌదా కల్పిస్తామని చెప్పకపోవడంలో ఆంతర్యమేంటనేది ప్రశ్న. వాస్తవానికి మోడీ నిన్నటిరోజున మహబూబ్‌నగర్ వేదికగా పర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చాలావరకు పాతవే. మోడీ వచ్చిన కొత్తలో పీఎం ప్రమాణ్, పీఎం ఉష, పీఎం ఆవాస్ యోజన వంటి ప్రధానమంత్రి పేరుతో ప్రకటించిన పథకాలు బోలెడు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ఇప్పుడు మనుగడలో లేవు. ‘నమామి గంగ’ వంటి పథకాలు పనులు తొమ్మిదేండ్లు గడిచినా ఎప్పటికి పూర్తవుతాయనేది చెప్పడం కష్టం. తాను చేసిన వాగ్దానాలు శుద్ధమైనవని, ప్రతిపక్షాలవి మాత్రం బూటకపు హామీలంటూ తనకు తానుగా కితాబులు ఇచ్చుకోవడం మరోసారి పీఠమెక్కడానికి మోడీ తెగ ప్రయాస పడుతున్నారు. అందులో భాగమే ఈ వాగ్దానాలు. ఎన్నికల సమయంలో ఓటర్లు రాజకీయ పార్టీల కదలికలు, హామీల పట్ల అప్రమత్తంతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశభవిష్యత్తు నిర్ణయించే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.