ప్రత్యామ్నాయ సంస్కృతికి బాటలు వేసిన ‘మేడే’ ఉత్సవాలు

రాష్ట్రంలో మే దినోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. ప్రత్యామ్నాయ సంస్కృతి అలవర్చటం కోసం గత సంవత్సరం ప్రారంభమైన ప్రయత్నాలు, ఈ సంవత్సరం మరింత ఊపందుకున్నాయి. మేడే అనగానే, ఎర్ర తోరణాలతో అలంకరణ, ఎర్ర అంగీలు, చీరలతో కార్మికులు, ఇతర శ్రామికులు అరుణ పతాకావిష్కరణలో పాల్గొనటం, సభలు, ప్రదర్శనలు సహజం. అవన్నీ ఇప్పుడు కూడా జరిగాయి. అదనంగా జరిగిన అనేక కార్యక్రమాలే ప్రత్యామ్నాయ సంస్కృతి పాదుకొల్పే ప్రయత్నంలో అమలు చేసిన ప్రత్యేకతలు. ఈ ప్రయత్నం జరిగిన ప్రతిచోటా సాధారణ కార్మికులలోనే కాదు, ఇతర ప్రజానీకంలో కూడా మంచి ప్రభావం పడింది. ప్రతి సంవత్సరం, ఇదే పద్ధతిలో మేడే ఉత్సవాలు నిర్వహించాలని అనేకమంది స్థానిక ప్రజలు సూచించటమే ఇందుకు నిదర్శనం.
మేడే రోజున చికాగో అమరవీరుల స్థూపంతో లేదా వారి ఫొటోలతో మండపం ఏర్పాటు చేయటం ఒక ప్రత్యేకత. కార్మికుల నివాస ప్రాంతాలలో మండపం ఏర్పాటు చేసి, పందిరి నిర్మించి, కార్మికులు, ఇతర ప్రజలు పాల్గొనడానికి వీలుగా ఏర్పాట్లు చేయటం వల్ల కుటుంబసమేతంగా పాల్గొన్నారు. వందలాది కుటుంబాలు పండుగ వాతావరణాన్ని స్ఫురించేవిధంగా సందడి చేశారు. వారం రోజులపాటు మండపం ఏర్పాటు చేసిన కేంద్రాలు కొన్నిచోట్ల జాతరలను తలపించాయి. అమరవీరుల మండపాలు స్ఫూర్తికేంద్రాలుగా వెలిశాయి. యూనియన్ల అడ్డుగోడలను పక్కనబెట్టి, సాధారణ కార్మికులు, వారి కుటుంబసభ్యులు ప్రతిరోజూ మండపాలను సందర్శించి, పిడికిలి బిగించి నమస్కరించారు. కొన్నిచోట్ల మధ్యతరగతి ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. సీఐటీయూ కార్యక్రమంగా కాకుండా, అందరూ ఆమోదించే సాధారణ ఎర్రజెండాలు ప్రదర్శించటంతో అనేక యూనియన్లకు, అసోసియేషన్లకు చెందిన కార్మికులు, ఉద్యోగులు, ఏ యూనియన్‌కూ సంబంధంలేని సాధారణ కార్మికులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అమరవీరుల మండపం దగ్గర కార్మికులు ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో ప్రదర్శించారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన ఉత్సవాలలో పాల్గొన్నవారు దాదాపు సగంమంది వలస కార్మికులే కావటం విశేషం.
క్రికెట్‌, వాలీబాల్‌, షటిల్‌, కబడ్డీ, క్యారమ్స్‌, కోకో, స్కిప్పింగ్‌, లెమన్‌ స్పూన్‌, మ్యూజికల్‌ చైర్స్‌, ముగ్గుల పోటీ, డ్రాయింగ్‌, పాటల పోటీలు నిర్వహించారు. దీనివల్ల బాలబాలికల నుంచి వృద్ధుల వరకు ఎవరికి నచ్చిన పోటీలో వారు భాగస్వాములయ్యారు. ముగింపు ఉత్సవాలలో విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ఆయా ప్రాంతాలలో కమిటీలు ఏర్పడ్డాయి. కాలనీ అసోసియేషన్స్‌ నాయకులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, కార్మిక నాయకులు, ఉద్యోగులు తదితరులు ఈ కమిటీల్లో పాలుపంచు కున్నారు. వనరుల సేకరణ, ఏర్పాట్ల బాధ్యతలు నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం మండపం దగ్గర పాటలు, నృత్యాలు, మిమిక్రీ ప్రదర్శనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ధూంధాం చేశారు. ఈ వారోత్సవాలలో అంతర్లీనంగా వ్యక్తమైనది లౌకిక భావన. కులం, మతం, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కార్మికులు పాల్గొన్నారు. లింగభేదాలను అధిగమించి ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శించారు. అంతేకాదు…కార్మికవర్గ ఐక్యపోరాట స్ఫూర్తి కేవలం కార్మికులకే పరిమితం కాలేదు. వారి భార్య భర్తలకు, కుటుంబ సభ్యులందరికీ ఈ చైతన్యాన్ని పంచింది. పరస్పర సహకార స్ఫూర్తినందించింది. శ్రామికుల మధ్య మతపరమైన విద్వేషాలు సృష్టించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ లాంటి సంస్థలు, కేంద్ర పాలకులు ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో మేడే సందర్భంగా చేసిన ప్రయత్నం ప్రాధాన్యత సంతరించుకున్నది.
సమాజంలో ఘనీభవించి ఉన్న పురుషాధిక్యత కారణంగా యూనియన్ల ప్రధాన నాయకులు అత్యధిక సందర్భాలలో పురుషులే ఉంటున్నారు. సహజంగానే యూనియన్‌ నాయకత్వ హోదారీత్యా వీరే మే దినోత్సవం రోజు పతాకావిష్కరణ చేస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని ఛేదించే ప్రయత్నం మరో అడుగు ముందుకేసింది. గత సంవత్సరంతో పోల్చితే పతాకావిష్కరణ చేసిన మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. మేడ్చెల్‌ జిల్లాలో 185 పతాకావిష్కరణలు సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగగా, వీటిలో 52చోట్ల మహిళలే ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన 160 పతాకావిష్కరణలలో 45చోట్ల మహిళలు ఆవిష్కరించారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! పతాకావిష్కరణ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టటం, అగర్‌బత్తీలు వెలిగించటం, ప్రసాదం పంచటం వంటి క్రతువులకు అది సందర్భం కాదని కార్మికులు అర్థం చేసుకుంటున్నారు. దీని ప్రాధాన్యతను ముందే కార్మికులకు వివరించటం ద్వారా ఇది సాధ్యపడింది. ఎర్రజెండాను పూజించటం అంటే దేవుడు, దేవతగా మార్చేయటమే కదా! భారమంతా దేవుడిమీద వేయటం ప్రజలలో ఉన్న నమ్మకం. కానీ, దేవుడిమీదనో, మరొకరిమీదనో భారం వేయటం ద్వారా సమస్యలు పరిష్కారం కావు. కార్మికవర్గానికి దోపిడీనుంచి విముక్తి రాదు. కార్మికవర్గం పోరాడి సాధించాలి. పోరాటానికి స్ఫూర్తినిచ్చేది ఎర్రజెండా. అందుకే ఎర్రజెండా నీడలో పోరుబాటన నడుస్తామని ప్రతినబూనవల్సిన సందర్భం. ఈ పోరాటాన్ని నీరుగార్చేందుకే పాలకవర్గాలు, వారి అనుయాయులుగా ఉన్న నాయకులు ఎర్రజెండా దగ్గర పూజలు ప్రోత్సహిస్తారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటనేత, స్వాతంత్య్రోద్యమ నాయకుడు గాంధీనే దేవుడిగా కొలిచే ప్రయత్నాలు మన కండ్లముందే చూస్తున్నాం. కులనిర్మూలన కోసం పోరాడిన బీఆర్‌ అంబేద్కర్‌ను కూడా దైవంగా కొలిచే ప్రయత్నాలు చూస్తున్నాం. ఇలాంటి ప్రయత్నాలనే ఎర్రజెండా విషయంలో కూడా చేస్తున్నారు. పోరాట స్ఫూర్తినిచ్చే చిహ్నాలకు ‘పవిత్రత’ను పులిమి దైవత్వం ఆపాదించే ప్రయత్నిమిది. కార్మికులు వెనుకబాటుతనం వల్ల ఎర్రజెండా ముందు పూజలు చేస్తున్నారని చూసీచూడనట్టు ఉండవల్సిన విషయం కాదు ఇది. కార్మికవర్గాన్ని చైతన్యపరచవల్సిన సందర్భం. ఫ్యూడల్‌ సంప్రదాయాలు బలంగా ఉన్న దేశంలో ఈ వెనుకబాటుతనం సహజమే! దానిమీద పోరాడవల్సిన కార్మికవర్గాన్ని ఆవైపు చైతన్యపరచటం కార్మికసంఘాల బాధ్యత కదా! అందుకే ఇది ప్రాధాన్యత గలిగిన అంశమే!
అమరవీరుల మండపాల దగ్గర, కొన్నిచోట్ల సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. వందలాది కార్మికులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. కులవివక్షను అధిగమించేందుకు, చైతన్యం పెంపొందించేందుకు ఈ కృషి ఉపయోగపడుతున్నది. కుల, మత భేదాలను విస్మరించి, కలిసి భోజనం చేయటం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది ఎక్కువ ప్రభావం చూపుతున్నది. ఇవి దళితవాడల్లో నిర్వహించినప్పుడు ఇతర సామాజిక తరగతులకు చెందినవారు వెళ్ళి పాల్గొనటం మరింత స్ఫూర్తినిస్తున్నది. కొన్నిచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. చలివేంద్రాలు ప్రారంభించారు. హెల్త్‌క్యాంపులు నిర్వహించి ఉచిత వైద్య సదుపాయం కల్పించారు. పేదలకు అంబలి కేంద్రాలు నిర్వహించారు. మే దినోత్సవం నాటికే రాష్ట్రంలో ఐకేపీ వీవోఏల సమ్మె పోరాటం ప్రారంభమైంది. ఇతర యూనియన్ల సభ్యులుగా ఉన్నవారు కొన్ని మండలాలలో సమ్మెలో చేరలేదు. కానీ మేడే వారోత్సవాల ప్రభావంతో సమ్మెలో చేరటం కూడా ఒక మంచి అనుభవం. సందడిగా సాగుతున్న అంతర్జాతీయ కార్మిక దినోత్సవాలు కార్మికులనే కాదు… వివిధ రాజకీయ పార్టీల స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను కూడా ఆకర్షించాయి. తమంతట తాముగా వచ్చి పాల్గొన్న మునిసిపల్‌ కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, ఐసీడీఎస్‌ అధికారులు కూడా బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న సందర్భాలున్నాయి.
ముగింపు ఉత్సవాలు ఉత్తేజభరితంగా సాగాయి. కొన్ని కంపెనీల దగ్గర కూడా అమరవీరుల చిత్రపటాలు వారం రోజులపాటు ఉంచి కార్మికులు రోజూ నమస్కరించి డ్యూటీకి వెళ్ళారు. చివరిరోజు ఆ చిత్రపటం ప్రదర్శిస్తూ ప్రధాన కార్మిక ప్రదర్శనకు చేరుకున్నారు. అమరవీరుల భారీ కటౌట్లూ, ఫొటోలు, యోధుల వేషాలతో, పెద్దపెద్ద ప్రభలు కట్టుకుని కార్మికులు ప్రదర్శనలో పాల్గొన్నారు. వాహనాలమీద కళారూపాలు ప్రదర్శిస్తూ ప్రదర్శనలలో ఆద్యంతం ఉత్తేజపరిచారు. బతుకమ్మ పాటలు, కోలాటాలతో కోలాహలంగా సాగాయి. మండపంలో ఉన్న అమరవీరుల స్థూపం లేదా చిత్రపటాన్ని ప్రదర్శన అగ్రభాగాన ప్రదర్శిస్తూ ముగింపు సందర్భంగా సీఐటీయూ కార్యాలయానికి అందజేశారు. అనేక జిల్లాలలో కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు కలిసి మే దినోత్సవంలో పాల్గొన్నారు. యువతీయువకులు, గృహిణులు, విద్యార్ధులు సైతం ఈ ఉత్సవాలలో మమేకమయ్యారు. మే దినోత్సవం కొత్త పద్ధతులలో నిర్వహించటం ప్రజలలో చర్చనీయాంశమైంది. ఈ ఉత్సవాల ప్రభావంతో మున్సిపల్‌, భవన నిర్మాణం, ట్రాన్స్‌పోర్టు వంటి రంగాలలో కొన్నిచోట్ల కార్మికులు సంఘటితం కావాలని నిర్ణయించుకున్నారు. ప్రయివేటు పారిశ్రామిక కార్మికులు, వలస కార్మికులు సంఘటిత కార్మికోద్యమానికి చేరువవుతున్నారు. వారికి మరింత విశ్వాసం కల్పించవల్సిన బాధ్యత కార్మికవర్గ నాయకత్వానిదే! సంఘటిత కార్మికోద్యమానిదే. పెట్టుబడిదారీ వర్గంగానీ, పాలకవర్గ పార్టీలు గానీ కులం, మతం, ప్రాంతం తదితర పేర్లతో కార్మికుల ఐక్యతకు చిచ్చుపెడుతున్న కాలమిది. ఈ ఎత్తుగడలను తిప్పికొట్టి కార్మికవర్గ ఐక్యతను కాపాడుకోవాలన్నా, ఉద్యమం ముందుకు సాగాలన్నా విశాల కార్మికవర్గాన్నీ, వారి కుటుంబాలను ప్రభావితం చేయగల స్థాయిలో కృషి పెరగాలి.
– ఎస్‌. వీరయ్య