లక్ష రూపాయల ఆర్థిక సహకారాన్ని ఎంబీసీలు సద్వినియోగం చేసుకోవాలి…

– జాదవ్ శరత్, నిజామాబాద్ డిఎన్టి జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ -నవీపేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వృత్తి కులాలు, ఎంబీసీ కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సహకారాన్ని ఎంబీసీ కులాలు సద్వినియోగం చేసుకోవాలని డి నోటిఫైడ్ ట్రైబ్స్( సంచార జాతుల) నిజామాబాద్ల్ జిల్లా అధ్యక్షులు జాదవ్ శరత్ విలేకరుల సమావేశంలో శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 14 వృత్తి కులాలతో పాటు 35 అత్యంత వెనుకబడిన కులాలు (ఎంబీసీ) మరియు అనాధలు సైతం అర్హులని అన్నారు. ఎంబీసీ కులాలు అంటే అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో కేవలం 14 వృత్తి కులాలే అర్హులని, ఎంబీసీ జాబితాను ఒకే కులంగా ప్రచారం జరుగుతోందని దీనివల్ల అర్హులైన కులాల ప్రజలు అవగాహన లేక దరఖాస్తు చేసుకోవడం లేదని కాబట్టి ఎంబీసీ జాబితాలోని 35 సంచార కులాలు సైతం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కొత్తగా బీసీ-ఏ జాబితాలో చేర్చిన 13 సంచార కులాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహకారానికి అర్హులుగా ప్రకటించాలని కోరారు. కులం, ఆదాయ సర్టిఫికెట్ల జారీలో సర్వర్ ఇబ్బందులు ఎదుర్కోవడంతో దరఖాస్తు తేదీని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవే ఎంబిసి కులాలు
బాలసంతు, బుడబుక్కల, దాసరి, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటిపాపల, మొండివారు, వంశరాజ్(పిచ్చకుంట్ల),పాముల, పార్ది,పంబాల, పెద్దమ్మ వాళ్ళు, వీరముష్టి (వీరభద్ర), గూడుల ,కంజారా, రెడ్డికా (కెంపర), మొండి పట్టా, నొక్కర్, పార్లికి ముగ్గుల, యాట, చోపెమరి, కైకాడి, జోషి నందివాల, మందుల, కూనపులి, పాత్ర, పాల- ఎక్కరి, రాజన్నల, బుక్క అయ్యవారు, కాశికాపాడి, సిద్దుల సిక్లీగర్, గోత్రాల మరియు అనాధలు ఎంబీసీ కులాల జాబితాలో ఉన్నారు. కాబట్టి ఈ కులాల ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.