
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఆస్పత్రిలో అరకొర వైద్యం అందుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా బృందం జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుండి అనేకమంది వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి వస్తుంటారని, మెరుగైన వైద్యం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఏదైనా అత్యవసర చికిత్స అవసరం అయితే హైదరాబాదు పంపించవలసిన పరిస్థితి ఉందని వారు అన్నారు. వైద్యుల కొరత వల్ల జిల్లా కేంద్రం ఆసుపత్రిలో అరకొర వైద్యం అందుతుందన్నారు. 20 మంది డాక్టర్ పోస్టులు, ఇద్దరి లాబ్ టెక్నీషియన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి మెడికల్ కళాశాలకు అనుబంధమైన ఇప్పటివరకు ఆస్పత్రి విస్తరణ పనులు జరగడంలేదని ఆలస్యం అవుతుందని వారన్నారు. నిత్యం ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలలో నమ్మకం కల్పించడంలో వైఫల్యం జరుగుతుందన్నారు. సాధారణ కాన్పులు అయ్యేటట్లు చేయాలని కోరారు. గత మూడు రోజులుగా థైరాయిడ్ టెస్టులు ఆగిపోయాయన్నారు. టెక్నీషియన్లు లేక రోగ నిర్ధారణ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయన్నారు. రోగులకు ఇచ్చే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని వారు అన్నారు. ఆసుపత్రిని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటుచేసిన కమిటీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించాలని వారు సూచించారు. ప్రస్తుతం ఉన్న మాతా శిశు కేంద్రాన్ని విడిగా నిర్మించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్, నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, చింతల శివ, ఓవల్దాస్ అంజయ్య పాల్గొన్నారు.