భువనగిరి సీపీఐ(ఎం) అభ్యర్థిగా ఎండీ జహంగీర్‌

Bhuvanagiri as CPI(M) candidate MD Jehangir– మిగతా 16 స్థానాల్లో ఎవరికి మద్దతివ్వాలో త్వరలో నిర్ణయం
– కాంగ్రెస్‌ ప్రతిపాదిస్తే ఆ మూడు చోట్ల ఎక్కడి నుంచైనా పోటీచేస్తాం
– కులాల ప్రాతిపదికన కార్పొరేషన్లు సరికాదు
– మిగతా గ్యారంటీలనూ అమలు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థిగా ఎండీ జహంగీర్‌ను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య ప్రకటించారు. ప్రజాసమస్యలపై పోరాడే ఆయన తమ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పారు. భువనగిరి జిల్లాలో అనేక సమస్యలపై జహంగీర్‌ పోరాటాలు చేశారని అన్నారు. మిగతా 16 స్థానాల్లో ఎవరికి మద్దతివ్వాలనే దానిపై ఇంకా కొంత సమయం వేచిచూసేందుకు పార్టీ నిర్ణయించిందన్నారు. దీనిపై హడావుడిగా ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని అనుకున్నామని వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాన్ని మంగళవారం టి జ్యోతి అధ్యక్షతన నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రేవంత్‌రెడ్డి వంద రోజులపాలన, పార్లమెంటు ఎన్నికలు, పార్టీ వైఖరిపై చర్చించామని వివరించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు చేశారనీ, మిగిలిన వాటినీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సమస్యను పరిష్కరించాలని కోరారు. సీఎం దృష్టికి ఈ సమస్యను తెచ్చామనీ, కార్మికుల వేతనాలను పెంచకుండానే డీఏను మూలవేతనంలో కలుపుతూ ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు. దాంతో కోటిమంది కార్మికులు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కనీస వేతనాల జీవోలను సవరించాలని డిమాండ్‌ చేశారు. ధరణి బాధితుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఓయూ మెస్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు చదువుమీద దృష్టి కేంద్రీకరించాలనీ, వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని 69 కేంద్రాల్లో లక్ష కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాయని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద వారికి రూ.ఐదు లక్షలు ఇచ్చి, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. మూసీ సుందరీకరణ చేయడానికి ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తే సంతోషమేనని అన్నారు. దాని పర్యవసానంగా కొన్ని పనులు చేయాలనీ, ముందు ఆ నీటిని శుద్ధి చేయాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతం నుంచి కల్తీ ధాన్యం, కల్తీ కూరగాయలు, కల్తీ పాలు వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ పక్కన గడ్డి కోసుకునే వారు, అరిటాకులు అమ్ముకునేవారు, ఇండ్లు కోల్పోయే వారికి పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. కులాల ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు సరైంది కాదన్నారు. గతంలో ఏర్పాటు చేసిన వాటికి వెనుకబాటుతనం, ఇతర కారణాలుండేవని గుర్తు చేశారు. కులవ్యవస్థను నిర్మూలించాల్సిన ప్రభుత్వం రెడ్డి, కమ్మ వంటి కులాల పేరుతో కార్పొరేషన్లను ఏర్పాటు చేసి దాన్ని కాపాడే పనిచేయొద్దని కోరారు. పొత్తులకు సంబంధించి కాంగ్రెస్‌ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో జాతీయస్థాయిలో ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి పనిచేస్తే బీజేపీ ఓడిపోతుందని చెప్పారు. ఖమ్మం, మహబూబాబాద్‌, భువనగిరి, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాల్లో తమకు బలముందన్నారు. భువనగిరి కాకుండా మిగతా మూడింటిలో ఎక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్‌ ప్రతిపాదించినా తాము సిద్ధమని ప్రకటించారు. కలిసి పనిచేద్దామని బీఆర్‌ఎస్‌ నుంచి ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వందరోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడు హామీ ఇచ్చారనీ, వాటిని పరిష్కరించాలని కోరారు.
సీపీఐ(ఎం)ను గెలిపించాలి : జహంగీర్‌
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలకు జహంగీర్‌ ధన్యవాదాలు చెప్పారు. ఇది చారిత్రక నియోజకవర్గమనీ, అక్కడ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందనీ, ఎంతో మంది అమరులయ్యారని అన్నారు. త్యాగాలు, చరిత్ర తెలిసిన ప్రాంతమని వివరించారు. కమ్యూనిస్టుల పోరాటాలతో వచ్చిన ఫలితాలను అనుభవించిన ప్రజలున్నారని చెప్పారు. చెట్టు, పుట్టను అడిగినా కమ్యూనిస్టుల చరిత్రను చెప్తాయన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యావైద్యం, కాలుష్యం, మూసీ పరివాహక ప్రాంతం, ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్యలు న్నాయని అన్నారు. దశాబ్దాలు మారినా అనేక మంది పాలకులు మారినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళమెత్తే సీపీఐ(ఎం) అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన జహంగీర్‌ : చెరుపల్లి
పేద కుటుంబం నుంచి వచ్చిన జహంగీర్‌ 35 ఏండ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు చెప్పారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జనగామ, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు కమ్యూనిస్టులకు కేంద్రాలని అన్నారు. గతంలో నకిరేకల్‌, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. నిబద్ధతతో పనిచేసే జహంగీర్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదరికం, కష్టాల నుంచి వచ్చిన ఆయనకు సమస్యలపై మంచి అవగాహన ఉందన్నారు. ప్రస్తుతం ఆయారాం, గాయారాంలు రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. తాను పార్ట్‌టైం రాజకీయ నాయకుడిని, ఫుల్‌ టైం బిజినెస్‌మెన్‌ని అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో విలువలు భ్రష్టుపట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలో అలాంటి వారికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి : జూలకంటి
ప్రజలు వలసపోతున్నారనీ, వాటిని ఆపి ఉపాధి అవకాశాలను కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారిని ఆదుకోవాలని సూచించారు. పంటలు ఎండిపోతున్నాయనీ, రైతులను ఆదుకోవాలని కోరారు. తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వరి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.