– మౌలిక సదుపాయాలు కల్పించాలి
– ప్రభుత్వం స్పందించకపోతే మేమే గృహప్రవేశం చేయిస్తాం
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెం వద్ద 2015లో శంకుస్థాపన చేసి నిర్మించిన 565 డబల్ బెడ్ రూమ్ లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ డిమాండ్ చేశారు. బుధవారం సింగన్నగూడెం లోని డబల్ బెడ్ రూమ్ లను పరిశీలించి పనుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసిందన్నారు. ఓట్ల రాజకీయాలతో వారికి పట్టాలు ఇచ్చిన ఇండ్లు కేటాయించలేదన్నారు. కోట్ల రూపాయల సంపదతో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ వినియోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తపరిచారు. త్రాగునీరు డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలన్నారు. డబల్ బెడ్ రూమ్ ల వద్ద రక్షణ లేకపోవడంతో ఆ ఇంటి కిటికీలను డోర్లను దొంగలు ఎత్తుకు పతున్నారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు నామమాత్రంగా పరిశీలించారని తప్ప పరిష్కరించలేదన్నారు. డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ఐక్యం చేసి నిరసన తెలుపడంతో పాటు ఆ గదులను వాటికి పట్టాల ప్రకారం కేటాయించి గృహప్రవేశం చేయిస్తామని హెచ్చరించారు. దీంతో సంపద నష్టపోకుండా ఉండడమే కాకుండా వినియోగంలోకి వస్తుందని జహంగీర్ తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధలు మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీకి ప్రభుత్వం నుండి వెంటనే నిధులు కేటాయించి డ్రైనేజీ తాగునీరు ఏర్పాటు చేయించాలన్నారు. చేసిన వెంటనే లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలన్నారు. లబ్ధిదారుల కేటాయించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో వారికి కేటాయించి గృహప్రవేశం చేయిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఎమ్మెల్యేలు ఈ విషయంపై స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, నాయకులు బందెల ఎల్లయ్య, అన్నంపట్ల కృష్ణ, చింతల శివ పాల్గొన్నారు.