ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు : ఎమ్‌డీ సజ్జనార్‌

ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు : ఎమ్‌డీ సజ్జనార్‌– తార్నాక ఆస్పత్రిలో దాడులకు గురైన సిబ్బందికి పరామర్శ
విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. దాడులు చేసిన వారిపై పోలీసు కేసులు పెట్టి హిస్టరీ షీట్లు తెరుస్తామని చెప్పారు. ఈనెల 4వ తేదీ ట్యాంక్‌బండ్‌పై వెళ్తున్న ఆర్టీసీ బస్సు కండక్టర్‌, డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేయడంతో కండక్టర్‌కు చేయి విరిగింది. డ్రైవర్‌ గాయపడ్డారు. వీరు తార్నాక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం సజ్జనార్‌ తార్నాక ఆస్పత్రిలో బాధితులను పరామర్శించా రు. ధైర్యంగా ఉండాలనీ, సంస్థ వారికి అండగా ఉంటుం దని భరోసా ఇచ్చారు. కండక్టర్‌ రమేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. డ్రైవర్‌ షేక్‌ అబ్దుల్‌ ను పరామర్శించారు. జరిగిన ఘటనలో తమ సిబ్బంది ఎలాంటి తప్పు చేయలేదనీ, కేవలం ఉద్దేశపూర్వకంగానే దుండగులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ కేసులో నిందితులు మహ్మద్‌ మజీద్‌, మహ్మద్‌ ఖాసీంలను పోలీసు లు అరెస్ట్‌ చేశారని చెప్పారు. ఎమ్‌డీ వెంట టీఎస్‌ఆర్టీసీ సీవోవో డాక్టర్‌ రవీందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లు కృష్ణ కాంత్‌, వెంకటేశ్వర్లు, తార్నాక ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ శైలజామూర్తి, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, ఆస్పత్రి ఓఎస్డీ సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.