సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను తక్షణమే విడుదల చేయాలి: ఎండీ యాకూబ్ పాషా

నవతెలంగాణ – పాల్వంచ 
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సిఎం రిలీఫ్ ఫండ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నిధులను తక్షణమే విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండి యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని  కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి సుమారు 7 నెలల సమయం కావస్తున్నా నేటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ జరగలేదన్నారు. దాంతో సుమారు 60 వేల మంది లబ్దిదారులు కొన్ని నెలలుగా నిధుల విడుదల కోసం పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. ఈ 7 నెలల కాలంలో జిల్లాలో అనేక మంది నిరుపేదలు అత్యవసర పరిస్థితుల్లో వడ్డీలకు డబ్బులు తెచ్చి వైద్యం చేయించుకున్నారని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనే బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. నేటి  వరకు ఆ నిధులు విడుదల కాకపోవటంతో లబ్దిదారులు దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నారని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి నిధులను విడుదల చేసి, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.