స్కిల్ వుంటే కొలువు సులువు

స్కిల్ వుంటే కొలువు సులువు‘విద్యార్థులను సొంత కాళ్లపై నిలబెట్టేలా చిన్ననాటి నుంచే వత్తి విద్యలో బోధించాలి
– మహాత్మగాంధీ

ఏ దేశ అభివద్ధి అయినా యువశక్తి పైనే ఆధారపడి ఉంటుంది. నేటి యువతే రేపటి తరానికి కొలమానం. ఏదేశమైతే ఉత్పాదక రంగాలలోకి యువతను తీసుకుపోతుందో ఆ దేశమే నిరుద్యోగాన్ని చాలావరకు అధిగమిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత యువశక్తి మనదేశంలోనే ఉంది. ఆ యువత ఉత్పాదనా రంగాల వైపు మళ్లితే మొత్తం ప్రపంచానికి కావాల్సిన ఉత్పత్తులను మనమే అందించగలం. నిరుద్యోగ మహమ్మారిని దేశం జయిస్తుంది. కానీ, నైపుణ్యమున్న యువత పనిని వెతుక్కుంటూ రాష్ట్రాలు, దేశాల ఎల్లలు దాటి వలస వెళ్ళిపోతుంది. కొన్ని ప్రాంతాలలోని యువత తాము నేర్చుకున్న నైపుణ్యాలతో దేశవ్యాపితంగా విస్తరించారు. నైపుణ్యాలున్న యువతకు ప్రాంతంతో, భాషతో సంబంధం లేదు. మరి మన ఉత్పాదక రంగాలకు అత్యవసరంగా ఇలాంటి నిపుణ యువజనులే కావాలి. అయినా ప్రపంచ దేశాలు అభివద్ధిలో పోటీ పడి ముందుకు పోతున్న తరుణంలో భారత్‌ మాత్రం ఇంకా అభివద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఇది మారాలి.
‘యువరక్తంతో ఉప్పొంగుతున్న ఇండియానే నేడు ప్రపంచానికి అతిపెద్ద కార్మాగారం’ అని ప్రధాని మోడీ అంటుంటారు. డిగ్రీలు, పీజీలు, డాక్టరేట్లు చేసిన వారేందరో సరైన బతుకుదెరువు దొరక్క ఏదో ఒక కొలువు దక్కించుకుంటే చాలు అని అరకొర వేతనాలతో భారంగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. మరి ఈ పరిస్థితికి కారణం ఎవరన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.
పోటీ ప్రపంచంలో రాణించాలంటే మనకంటూ ఓ స్కిల్‌ ఉండాలి. డిగ్రీ పట్టాలు ఎన్నున్నా వత్తి నైపుణ్యాలు లేకపోతే అవి వథానే. నైపుణ్యాలు లేని యువత జీవనోపాధి మార్గాల అన్వేషణలో వెనుకబడిపోతారు. ఉద్యోగావకాశాలకు దూరమవుతారు. కెరియర్‌లో అద్భుతంగా ఎదగాలంటే.. కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితమైపోతే సరిపోదు. అంతకుమించినవెన్నో నేర్చుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి జీవన నైపుణ్యాలు (లైఫ్‌ స్కిల్స్‌). బతుకు దెరువుతో పాటు మెరుగైన జీవితానికి పునాది వేసే ఈ నైపుణ్యాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా అధ్యయనం చేసింది. వాటిని ఎంత త్వరగా నేర్చుకుని, అవగాహన ఏర్పరచుకుంటే అంత త్వరగా జీవితంలో రాణించవచ్చు అని తెలిపింది.
మనకు ఇద్దరు విజేతలు కనిపిస్తుంటారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించినవారు ఒకరైతే, పెద్దగా చదువుకోకపోయినా ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నవారు మరొకరు. బాగా చదువుకున్నవారు చాలామందే ఉంటారు. కానీ, అందుతో అతి కొద్దిమంది మాత్రమే విజేతలుగా నిలుస్తుండటాన్ని గమనిస్తుంటాం. జీవిత పరుగులో అగ్రభాగాన నిలబడాలంటే రాసి పెట్టి ఉండాలని నమ్మే రోజులు పోయాయి. ఓ మనిషికి ఒక విజయం సాధ్యమైతే అదే పనిని పదిమంది పది రకాలుగా వేర్వేరు దారుల్లో ఆలోచించి సుసాధ్యం చేసి నిరూపిస్తున్న శకమిది. అవే.. జీవన నైపుణ్యాలు!
వేర్వేరు దశల్లో విభిన్న నైపుణ్యాలు
నైపుణ్యాలు అన్నపుడు రకారకాల విషయాలు ప్రస్తావనకు వస్తాయి. విద్యార్థి దశలో అవసరమైన నైపుణ్యాలు వేరు. ఉద్యోగ సాధన- ఉద్యోగ పర్వంలో అక్కరకు వచ్చేవి వేరు. విద్యార్థిగా ఉన్నపుడు లక్ష్యం చదువులో రాణించడమే. కాబట్టి ఆ దశలో అనుసరించాల్సివని స్టడీ స్కిల్స్‌. అలాగే ఉద్యోగ సాధన రాణించడానికి దోహదపడేవి సాఫ్ట్‌స్కిల్స్‌. జీవిత పర్యంతం మనల్ని గెలుపుబాటలో నడిపించే జీవన నైపుణ్యాలు వేరు. అయితే ఇవన్నీ లక్ష్యాన్ని సులభతరం చేసే వేర్వేరు మార్గాలు. వీటన్నింటికి ముఖ్యమైన భావ వ్యక్తీకరణ అనేది విద్యార్థి, ఉద్యోగి దశల్లోనూ అవసరమే. ఇది జీవిత పర్యంతం ఉండాల్సిన జీవన నైపుణ్యం.
సెల్ఫ్‌ అవేర్‌నెస్‌
నో దై సెల్ఫ్‌ (నిన్ను నువ్వు తెలుసుకో). ఇది చాలా ముఖ్యమైన అంశం. మన గురించి మనం తెలుసుకుంటేనే మన ఆసక్తులు, అయిష్టతలు తెలుస్తాయి. మనం ఏ రంగంలో ప్రవీణ్యం సాధించాలని కోరుకుంటున్నామో అప్పుడే అర్థమవుతుంది. ఆ పురోగమన పథంలో నడిచేందుకు మనకున్న క్రమశిక్షణ ఎలాంటిది? ఒత్తిడి అనివార్యమైన ప్రస్తుత కాలంలో దాన్నెలా నియంత్రించుకుంటున్నాం? వివిధ సందర్భాల్లో మన ప్రవర్తన ఎలా వుంటుంది? మనం అనుసరించే విలువలేమిటి? మన బలాలూ బలహీనతలేంటి?.. ఈ స్వీయ విశ్లేషణ అవసరం. జీవన నైపుణ్యాల్లో ఒకటైన ఈ స్వీయ అవగాహనతో ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరినవారెందరో ఉన్నారు.
కమ్యూనికేటింగ్‌ థింకింగ్‌
మెదడులోకి ఆలోచనలు రాని క్షణమంటూ ఉండదు. మనిషి మెదడులోకి రోజుకు 6400 ఆలోచనలు వచ్చిపోతుంటాయని నూతన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆలోచనలను అనుకున్న లక్ష్యదిశగా ఫలాత్మకంగా మార్చుకోగలగడం జీవన నైపుణ్యం. ఉత్తమ నిర్ణయ ప్రక్రియ (డెసిషన్‌ మేకింగ్‌), సమస్యా పరిష్కారం దిశగా ఆలోచనలను మళ్లించడం చక్కని జీవన నైపుణ్యం.
ఎమోషన్స్‌
స్వీయ ఉద్వేగాల నియంత్రణ, సానుకూల దిశగా వీటి వినియోగం కూడా జీవన నైపుణ్యమే! మనలో చెలరేగే ఉద్వేగాల వివిధ దశలను అర్థం చేసుకోవటం, వాటిపై నియంత్రణ సాధించటం విజయాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కోపం, భయం, ప్రేమ లాంటి స్వీయ ఉద్వేగాలను అర్థం చేసుకోవడం, ఆయా సమయాలలో పరిస్థితులను సానుకూలంగా మలచుకోవడానికి దోహదం చేస్తుంది.
రిలేటెడ్‌ టూ అదర్స్‌
మనం ఎదుటి వారితో ఎలా ఉంటున్నాం? తోటి వారితో ఎలా మెలుగుతున్నాం అనేది కూడా చాలా అవసరం. నేటి కార్పొరేట్‌ యుగంలో టీమ్‌ బిల్డింగ్‌, టీమ్‌ లీడర్‌షిప్‌, ప్రభావశీల భావ వ్యక్తీకరణ వంటి స్కిల్స్‌ కు ప్రాధాన్యం ఉంది. వీటిని సాఫ్ట్‌స్కిల్స్‌గా పరిగణిస్తున్నప్పటికీ జీవనపథంలో ఈ స్కిల్స్‌ ఏర్పరచుకున్నవారికి విభిన్న కోణాల్లో విజయాలు సిద్ధిస్తున్నాయి.
దేశ యువతలో ఉద్యోగార్హత 51.25 శాతానికి పెరిగిందని భారత నైపుణ్యాల నివేదిక- 2024 వెల్లడించింది. కానీ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు మాత్రం ఇప్పటికీ మన యువతకు సరిగ్గా అలవడలేదని వెల్లడించింది. 2047 కల్లా వికసిత భారత్‌ సాకారం కావాలంటే యువతలో నైపుణ్యాభివద్ధికి తగిన పెట్టుబడులు, శిక్షణ సౌకర్యాలను పెంపొందించాలి. తద్వారా యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలి. దేశంలో నిరుద్యోగిత రేటును అంచనా వేయడానికి జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) చేపట్టే కార్మికశక్తి సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. 2022 జులై-సెప్టెంబరు కాలంలో దేశంలో నిరుద్యోగిత 7.2శాతం. 2023లో అదే త్రైమాసికంలో నిరుద్యోగిత 6.6శాతానికి తగ్గినట్లు పీఎల్‌ఎఫ్‌ఎస్‌ వెల్లడించింది. 15-29 ఏళ్ల వయస్కుల్లో గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత 2022-23లో 10 శాతానికి దిగివచ్చింది. 2017-18లో అది 17.8 శాతంగా ఉండేది. గడచిన ఆరేళ్లలో మహిళా కార్మిక భాగస్వామ్యం 24 శాతానికి పెరిగింది. అయినప్పటికీ, పురుషులతో పోలిస్తే మహిళల్లో నిరుద్యోగిత ఎక్కువగానే ఉంటోంది.
వత్తివిద్యపై నిర్లక్ష్యం వల్లే…
భారతీయ కార్మికుల్లో 90శాతం అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వారికి సరైన విద్యార్హతలు, నైపుణ్యాలు ఉండవు. దేశంలో ఉన్నత విద్యార్హతలు కలిగినవారిలోనే నిరుద్యోగిత ఎక్కువగా ఉంటోంది. దాంతో యువతలో నైపుణ్యాభివద్ధి కోసం 2015లో ప్రారంభించిన ‘స్కిల్‌ ఇండియా’ కార్యక్రమం ఏం సాధించిందనే ప్రశ్న తలెత్తుతోంది. 2000 సంవత్సరం వరకు వత్తివిద్య, శిక్షణలపై భారత్‌ అంతగా శ్రద్ధ చూపలేదు. 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)లో మాత్రమే మొట్టమొదటిసారి నైపుణ్య శిక్షణ గురించి ప్రస్తావించారు. ఇప్పటికీ పరిశ్రమలు, సేవా రంగాల్లోని సిబ్బందికి పూర్తిస్థాయిలో వత్తి విద్యా శిక్షణ లభించడం లేదనేది వాస్తవం. 2022-23లో దేశవ్యాప్తంగా వత్తివిద్యలో శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య కేవలం 2.10 కోట్లు. అదే దక్షిణ కొరియాలో 96శాతం కార్మికులకు, జపాన్‌లో 80శాతం, అమెరికాలో 52శాతం కార్మికులకు వత్తి విద్యా శిక్షణలు లభించాయి. ప్రపంచ కర్మాగారంగా పేరొందిన చైనాలో 11,300 వత్తి విద్యా శిక్షణాలయాలు ఉన్నాయి. అవి ఏటా 3.88 కోట్ల మంది విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వారిలో ఏడాదికి కోటి మంది పట్టభద్రులవుతున్నారు. భారత్‌లో 2009లో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ నైపుణ్యాభివద్ధి కార్యక్రమం… 2015లో నరేంద్ర మోడీ హయాంలో కౌశల్‌ భారత్‌ (స్కిల్‌ ఇండియా)గా రూపాంతరం చెందింది. 2014లో నైపుణ్యాలు, వ్యవస్థాపకతల వద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. అది జాతీయ నైపుణ్యాభివద్ధి మిషన్‌ (ఎన్‌ఎస్‌డీఎం)ను చేపడుతోంది. ఈ శాఖ ఛత్రం కిందనే జాతీయ నైపుణ్యాభివద్ధి ఏజెన్సీ (ఎన్‌ఎస్‌డీఏ), జాతీయ నైపుణ్యాభివద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ), డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ (డీజీటీ) పనిచేస్తున్నాయి. రాష్ట్రాలు కూడా తమ పరిధిలో జాతీయ నైపుణ్యాభివద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్‌ యోజన, జాతీయ అప్రెంటిస్‌ ప్రోత్సాహక పథకాలన్నీ జాతీయ నైపుణ్యాభివద్ధి కార్యక్రమంలో అంతర్భాగాలే.
కేంద్రం 2015లో జాతీయ నైపుణ్యాలు, వ్యవస్థాపకతల వద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు- 2022కల్లా 40 కోట్ల మందికి నైపుణ్యాలు నేర్పించాలని లక్షించారు. వారిలో 30 కోట్ల మందికి ముందస్తు అభ్యసన ధ్రువీకరణ (ఆర్‌పీఎల్‌) పత్రాలు ఇవ్వాలని భావించారు. ఆర్‌పీఎల్‌ అనేది ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనలో ముఖ్యభాగం. దేశంలోని వ్యవసాయేతర కార్మికశక్తిలో 95శాతం అసంఘటిత రంగంలోనే నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఆర్‌పీఎల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంవల్ల వారు మెరుగైన జీతభత్యాలను అందుకోగలుగుతారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ శిక్షణ కేంద్రాల్లో స్వల్పకాలిక తర్ఫీదు ఇవ్వడం నైపుణ్య భారత్‌ సాధనకు కొంత ఉపకరిస్తుంది. పాఠశాల, కళాశాల విద్యను మధ్యలోనే విరమించినవారికి, నిరుద్యోగులకు ఈ స్వల్పకాలిక శిక్షణ అక్కరకు వస్తుంది. శిక్షణ కేంద్రాల్లో సాఫ్ట్‌స్కిల్స్‌, వ్యవస్థాపకత, ఆర్థిక, డిజిటల్‌ పరిజ్ఞానాలను బోధిస్తారు. తర్ఫీదు పూర్తయిన వారికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. 2024 తాత్కాలిక బడ్జెట్‌లో కేంద్రం ఎన్‌ఎస్‌డీఎం ద్వారా 1.4 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించింది. అందులో 54 లక్షల మందికి పునఃశిక్షణ ద్వారా నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచినట్లు వివరించింది. కానీ, ఆ లెక్కలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంటున్నాయంటున్నారు.
అనుసంధానమే కీలకం…
భారతదేశ సాంకేతిక, వత్తివిద్య, శిక్షణ వ్యవస్థలో ప్రధాన లోపం- దానికి పరిశ్రమలతో అనుసంధానత లేకపోవడం. ఉన్నత పాఠశాల దశ నుంచే విద్యార్థులకు పరిశ్రమల సహకారంతో వత్తివిద్య, శిక్షణ అందించాలి. శిక్షణ కాంట్రాక్టులు పొందిన సంస్థలు, వ్యక్తుల అర్హతపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 2015లోనే అసంతప్తి వ్యక్తం చేశారు. చాలామంది అభ్యర్థులు శిక్షణ పూర్తికాకముందే మధ్యలో మానేస్తున్నారని, ప్లేస్‌మెంట్లు చాలా తక్కువగా ఉంటున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం 2022లో నివేదించింది. దేశ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే విషయంలో జర్మనీ అనుభవం నుంచి చాలానే నేర్చుకోవాలి. అక్కడ హైస్కూలు చదువు పూర్తి కాగానే రెండు మూడేళ్లపాటు వత్తివిద్యలో శిక్షణ పొందే వెసులుబాటు ఉంది. సిద్ధాంతం, ఆచరణల మేళవింపుతో కూడిన ‘చేస్తూ నేర్చుకొనే’ పద్ధతిని జర్మనీ విద్యావిధానం అనుసరిస్తోంది. దాదాపు 350 రకాల వత్తుల్లో శిక్షణ పొందే సౌలభ్యం అక్కడి విద్యార్థులకు లభిస్తోంది. జర్మనీ ప్రభుత్వం విద్యారంగానికి సరిపడా నిధులు అందిస్తే… కార్పొరేట్‌ సంస్థలు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన బాధ్యతలను చేపడుతున్నాయి. అటువంటి పద్ధతిని భారతదేశమూ అనుసరించాలి.
విలాసాల నుంచి బయట పడాలి
ప్రస్తుతం యువత విలాసవంత జీవితాలకు అలవాటు పడుతున్నారు. ఆల్కాహాల్‌, డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. మత్తులో వాహనాలను వేగంతో నడపడంతో వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలుగుతోంది. యువత స్వేచ్ఛను కోరుకోవడంలో తప్పు లేదు కానీ, అది మితిమీరితే అనేక అనర్థాలు జరుగుతాయి. పిల్లల అవసరాలు తీర్చవలసిన బాధ్యత తల్లిదండ్రులది. వారి మీద ప్రేమతో విలాసవంత జీవితం కల్పించాలని ప్రయత్నించడం సబబు కాదు. ప్రపంచ యువతలో దేశ యువత అధికంగా ఉంది. యువశక్తి చెడు మార్గం పట్టకుండా తగు చర్యలు తీసుకోవాలి. వారి వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రులు కషి చేయాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత పెడదారి పట్టకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకొని వివిధ దేశాలు అద్భుతాలు సష్టిస్తున్నాయి. మన యువతకు అది ఎందుకు సాధ్యం కాదో ఓసారి ఆలోచించాలి. చిన్న చిన్న సంఘటనలకు భయపడుతూ ఎదుర్కొనే సత్తా లేక ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఏ దశలోనైనా ఏ కారణం చేతనైనా చదువు మానేయాల్సి వచ్చినా బతుకు దెరువుకు ఢోకా ఉండరాదు. ఆ సత్సంకల్పంతో మనం అడుగులు వేయాల్సి ఉంది. అప్పుడే ఈ దేశ భవితను మనం కాపాడుకోగలం. ఆ దిశగా యువతలో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కషి చేయాలి.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417