అక్రమ గంజాయి అమ్మకాలపై చర్యలేవి..?

– మామూళ్ల మత్తులో  అధికారులు
– బీజేవైఎం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్, అక్కన్నపేట మండల పరిధిలోని గ్రామాలలో గంజాయి అక్రమ అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్న అధికారులు చర్యలు చేపట్టడం లేదని బీజేవైఎం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్ ఆరోపించారు. సోమవారం  హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుస్నాబాద్ ,అక్కన్నపేట పట్టణ ,గ్రామాలలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. కిరాణా షాపులు, పాన్ షాపులలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అడ్డాగా గంజాయి  అమ్మకాలు జరుగుతున్న అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కొన్ని పాన్ షాప్ల లలో సిగరెట్లలో గంజాయిని  పెట్టీ మరీ సిగరెట్ అమ్మకాలు చేస్తున్నారని, పాన్ షాపు యజమానులు కిరాణా షాప్ యజమానులు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం సిగరెట్లు అమ్ముతున్నారని అన్నారు .చిన్నపిల్లలకు సిగరెట్లు అమ్మకూడదని నిబంధనలు ఉన్నా అవేవీ పట్టించుకోవడం లేదన్నారు .పిల్లల భవిష్యత్తును గంజాయి మత్తు లోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లేక నిషేధిత తంబాకు, గుట్కా ప్యాకెట్లను బహిరంగ అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు .గతంలో అంబర్ ,గుట్కాల అక్రమ రవాణా చేసిన వారే కొత్త తరహాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్నారు,  ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.