నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల భద్రతా చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే అధికారులను ఆదేశించారు. గురువారం నాడు కలెక్టరేటు కాన్ఫరెన్సు హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్లు అభివృద్ధికి సూచికలని, అలాంటి రోడ్ల మీద ప్రమాదాల నివారణ, ప్రమాదాల తగ్గింపుకు అన్ని రకాల భద్రతా చర్యలను తీసుకోవాలని, కమిటీలో వున్న శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చూడడం, ప్రమాదాలు జరిగే ముఖ్య ప్రదేశాలలో ప్రమాద సూచికలు, మలుపుల వద్ద స్పీడ్ లిమిట్స్ సూచికలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ప్రతి నెలా రోడ్డు భద్రతా చర్యలపై జరిగిన పురోగతి సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలల వద్ద ప్రత్యేకమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎయిమ్స్ వద్ద వెహికల్ అండర్ పాస్ కొరకు డిపిఆర్ వెంటనే రూపొందించాలని, అనంతరం టెండర్ దశకు వెళ్లాలని తెలిపారు. కొండమడుగు దగ్గర అండర్ పాస్ రోడ్ శాంక్షన్ అయిందని, ఒక నెలలో పనులు ప్రారంభం కావాలని, సింగన్నగూడెం అండర్ పాస్ పనులకు టెండర్లు పిలవాలని, రద్దీ ఎక్కున ప్రాంతాలు, బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కమిటీ సమావేశంలో మెంబర్ కమ్ సెక్రటరీ, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి.బాల ప్రసాద్, అసిస్టెంట్ పోలీసు కమీషనర్ ఎం.ప్రభాకర్ రెడ్డి, ట్రాఫిక్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీసు ఎం.ప్రభాకరరెడ్డి, మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ అహ్మద్, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్ శాఖల ఇంజనీర్లు, నేషనల్ హైవే అథారిటీ, పంతంగి, గూడూరు టోల్ ప్లాజాల అధికారులు పాల్గొన్నారు.