– రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లాలో రాబోయే రోజులలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, అతిసార, టైఫాయిడ్ లాంటి వ్యాదులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం అధికారులను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం నూతన కలెక్టరేట్ ఐడీఓ సీ సమావేశ మందిరంలో జిల్లాలో పని చేయుచున్న వైద్యాధికారులు సీజనల్ వ్యాధులు నివారణ కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రాబోయే రోజులలో మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్య, అతిసార, టైఫాయిడ్ లాంటి వ్యాదులు రాకుండా చేపట్టవలసిన చర్యలు, నివారణ కార్యక్రమాలు గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకొని, జిల్లాలో డ్రై డే, ఫ్రైడే కార్యక్రమం, దోమ పుట్టకుండా కుట్టకుండా ఉండేందుకు చేపట్టవలసిన చర్యల గురించి గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు, ప్రతి పాజిటివ్ కేసును, హై రిస్క్ గ్రామాలు, అన్ని శాఖల సిబ్బందితో వైద్యాధికారులు సందర్శించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటి ఇంటి సర్వే నిర్వహించడం, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి తగిన పరీక్షలు, చికిత్సలు చేయాలని చెప్పారు. జిల్లాలో వ్యాధులను అరికట్టుటకు తగిన ప్రణాళిక సిద్ధం చేసి అమలు పరచాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ నివారణ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహిస్తే రోగాలు బారినపడకుండా చూడవచ్చునని చెప్పారు. డీటీసీవో డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమాలు పరీక్షలు, చికిత్స ప్రజల లో అవగాహన పెంచి తగిన నివారణ కార్యక్రమాలను అమలు చేసి టీబీ నియంత్రణ చేయాలని కోరారు. అనంతరం జిల్లా డిప్యూటీ వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ సైదులు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా జిల్లాలో చేపడుతున్న నివారణ కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సీతారాం, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ప్రమీల, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.