సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
గ్రామాల్లో వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని డి ఆర్ డి ఓ, మండల ప్రత్యేక అధికారి సాయి గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు గ్రామపంచాయతీ సిబ్బందిచే మురుగు కాలువలను శుభ్రం చేయించాలన్నారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. జ్వరాలు వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు.పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా ప్లాస్టిక్ వినియోగంపై చర్యలు చేపట్టాలన్నారు. వనమహోత్సవం, ప్లాంటేషన్ పై సమీక్షించిన ఆయన  మండలంలోని అన్ని గ్రామాల్లో వనమహోత్సవంలో భాగంగా ప్లాంటేషన్ కోసం మొక్కలను సిద్ధం చేయాలన్నారు. మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించి ఈజీఎస్ సిబ్బందితో గుంతలు తీయించాలన్నారు.   పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరగా పూర్తిచేసేలా కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై సమావేశంలో చర్చించారు.కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యనంద్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఈజీఎస్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.