వందేండ్ల చారిత్రక కట్టడం మెదక్‌ చర్చి

క్రిస్మస్‌కు ప్రత్యేక శోభ ఈ అద్భుతమైన కేథడ్రల్‌ చర్చిలో నిష్కళంకమైన హస్తకళలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఏటా జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో క్రైస్తవులతో పాటు ఇతర మతస్థులు కూడా పెద్ద ఎత్తున్న వస్తారు. ఇలా ప్రతి క్రిస్మస్‌ వేడుకలప్పుడు ప్రత్యేక శోభను మెదక్‌ చర్చి సంతరించుకుంటుంది. ఇక ఈ మెదక్‌ చర్చిలో ఎక్కడ లేని విధంగా కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం చూస్తాం. ఇక వంద ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా ఇప్పుడు వచ్చే క్రిస్మస్‌ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని చర్చి నిర్వాహకులు భావిస్తున్నారు. ఆసియా ఖండంలోనే అత్యంత పురాతనమైదని మెదక్‌ చర్చి.. ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఎత్తైనదిగా గుర్తింపు పొందిన గొప్ప చర్చి ఇది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటున్న ఈ క్యాథెడ్రల్‌ చర్చికి గొప్ప చరిత్ర ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలోనే పర్యాటక కేంద్రంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాదితో 100 ఏండ్లు పూర్తి చేసుకుని క్రిస్మస్‌ వేడుకలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చర్చి గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వారం సోపతిలో…
చార్లెస్‌ వాకర్‌ పోస్నెట్‌ అనే ఇంగ్లాండ్‌ దేశస్థుడు 1914లో ఈ చర్చి నిర్మాణం ప్రారంభించాడు. అది మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయం. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో జనం సమిధలయ్యారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనికి భారత్‌ కూడా మినహాయింపు కాదు. పనిలేక.. తిండిలేక, బతుకుదెరువు కష్టమై బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలాంటి భయంకరమైన కరువు తాండవిస్తున్న సమయంలో చార్లెస్‌ వాకర్‌ పాస్నెట్‌ కరుణామయుడైన జీసెస్‌ కోవెల నిర్మాణం తలపెట్టారు. దీని వల్ల గుక్కెడు మెతుకుల కోసం అల్లాడుతున్న జనానికి ఇలాగైనా కాస్త పని దొరుకుతుందని ఆయన ఆలోచించాడు.
చార్లెస్‌ వాకర్‌ పోస్నెట్‌
చారిత్రాత్మకమైన మెదక్‌ చర్చి నిర్మాణం చేపట్టిన చార్లెస్‌ వాకర్‌ పోస్నెట్‌ 1896లో అధికారికంగా తెలంగాణలోని మెదక్‌ ప్రాంతానికి నియమించబడ్డారు. అంతగా అభివృద్ధికి నోచుకుని అప్పటి మెదక్‌ దట్టమైన అరణ్యాలు, అరుదైన వనరులు, పర్యావరణ సవాళ్ల మధ్య ప్రాంతంలో పోస్నేట్‌ సువార్త ప్రచారం, సామాజిక అభ్యున్నతి, విద్యావ్యాప్తిపై దృష్టి పెట్టారు. తెలుగులో ప్రావీణ్యం సంపాదించంటానికి ఆయన చేసిన ప్రయత్నాలు స్థానిక ప్రజలతో మమేకం కావటాకి మరింత దోహదం చేశాయి. గ్రామీణ పేదల ఉద్ధరణకు ఆయన చేసిన కృషికి ఈ ప్రాంతంలో క్రైస్తవం విస్తరించడానికి ప్రధాన కారణం అయ్యింది. పోస్నెట్‌ మెదక్‌లో ఉన్నంత కాలం ప్రజల కోసం అంకిత భావంతో పని చేశారు. తీవ్రమైన కరువు సంభవించడంతో ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించి స్థానికులను పోషించమే కాకుండా సువార్తను పంచే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మెదక్‌ చర్చి నిర్మాణం శాశ్వత స్మారక చిహ్నంగా నిలవటంతో పనికి ఆహారం అనే కార్యక్రమంగా మారింది.
ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర
సామాజిక సంస్కరణలు, మహిళా సాధికారతకు పోస్నెట్‌ చేసిన కృషి విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. బాలల కోసం పాఠశాలలు, సేవా ఆశ్రమలు స్థాపించి ఆ నాటి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1939లో పదవి విరమణ తర్వాత 45 ఏండ్ల సేవ అనంతరం సాంఘీక సంక్షేమానికి ఆయన చేసిన కృషికిగాను కింగ్‌ జార్జ్‌ చేత కైజర్‌ ఏ హింద్‌ బిరుదు పొందారు. హైదారాబాద్‌ నిజాం ఆయన సేవలను మెచ్చి ధన్యవాదాలు తెలపటానికి వ్యక్తిగత దూతను పంపించి అభినందించారు. భారతీయ సంస్కృతిలో ఏకత్వం సాధించడానికి సైతం ఎంతో కృషి చేసిన ఆయన 1950లో మరణించారు. కానీ ఆయన స్థాపించిన సంస్థలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూ ఎంతో మందికి విద్యనందిస్తున్నాయి. ముఖ్యంగా మెదక్‌ కేథడ్రాల్‌ క్రైస్తవ ఆరాధనకు ప్రముఖ కేంద్రంగా నిలుస్తుంది. ఏటా వేలాదిమంది సందర్శకులను ఆకర్షిస్తున్నది. అటువంటి వ్యక్తి జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం.
మెతుకు సీమ
1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 1924 డిసెంబర్‌ 25న పూర్తైంది. పదేండ్ల పాటు సుమారు 12 వేల మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలుపంచుకుని ఉపాధి పొందారు. ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదక్‌కు ‘మెతుకు సీమ’ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే, ఇప్పుడు ఇక్కడ అంత స్థలం లేదని చెబుతున్నారు. అప్పట్లో ఈ చర్చి నిర్మాణానికి రూ.14 లక్షలు ఖర్చు చేశారు. కొంత కాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు.
దేశదేశాల నుంచి
ప్రపంచంలో వాటికన్‌ చర్చి తర్వాత అతి పెద్దదైన ఈ చర్చి వాస్తుశిల్పి ఎడ్వర్డ్‌ హార్డింగ్‌. పూర్తిగా తెల్లరాయితో కట్టబడిన ఈ నిర్మాణం కోసం ఆరు రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండు నుండి తెప్పించారు. మేస్త్రీలను బొంబయి నుండి పిలిపించారు. ఇంకా పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు. వారానికొకసారి నేలను, అద్దాలను కిరోసిన్‌ కలిపిన కొబ్బరినూనెతో తుడుస్తారు. కిటికీ రంగుటద్దాలపై రాయబడిన వాక్యాలు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషలలో కనిపిస్తాయి. మొదట హిందీలో వాక్యాలు లేవు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ సోదరి, విజయలక్ష్మి పండిట్‌ ఈ చర్చిని సందర్శించినప్పుడు జాతీయభాష అయిన హిందీలో కూడా రాయించారు.
పటిష్టమైన నిర్మాణం
ఈ మెదక్‌ చర్చి 175 అడుగుల ఎత్తు..100 అడుగుల వెడల్పుతో కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ కళా నైపుణ్యాలు ఉన్నవారు నిర్మించారు. ఇందులో ఉన్న ప్రధాన హాల్‌లో ఐదు వేల మంది ఒకేసారి ప్రార్థన చేయొచ్చు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం వందేండ్లు పూర్తైనా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు ఆనాడు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. చర్చి లోపల రంగు రంగుల గాజు ముక్కలతో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
మరో విశేషం ఏమిటంటే…
చర్చికి ఉత్తరం దిక్కున ఉన్న మూడో కిటికీపై అసలు సూర్య కిరణాలే పడవు. అయినా అది ప్రకాశిస్తుంది. ఇక్కడి రాళ్లపై సూర్య కిరణాలు వక్రీభవనం చెంది ఆ కిటికీపై పడటం వల్ల ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. చర్చి నిర్మాణంలో వాడిన మార్బుల్స్‌ను ఇంగ్లండ్‌, ఇటలీ నుంచి తీసుకొచ్చారు. చర్చి లోపల రీసౌండ్‌ రానివిధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతికి, పవిత్రతకు నిలయమైన ఈ కెథడ్రల్‌ చర్చ్‌కు ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ చర్చి నిర్మాణానికి కేవలం రాతి, డంగు సున్నాన్ని మాత్రామే వాడారు. పిల్లర్లు, భీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. 200 అడుగుల పొడవుతో సువిశాలమైన చర్చి చూపర్లను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ చర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఇతర దేశాల నుంచి మెటీరియల్‌ను తెప్పించడం విశేషం.. బ్రిటన్‌ నుండి మొజాయిక్‌ టైల్స్‌, ఫ్లోరింగ్‌ కోసం ఇటాలియన్‌ మెషన్లు తీసుకొచ్చారు. అలాగే యాష్‌ కలర్‌లో చెక్కిన భారీ స్తంభాలు గ్యాలరీతో పాటు మొత్తం భవనానికి పిల్లర్లుగా ఉన్నాయి. చర్చిపై కప్పును బోలు స్పాంజ్‌ మెటీరియల్‌తో తీర్చిదిద్దారు. దీంతో అది సౌండ్‌ ప్రూఫ్‌గా ఉంటుంది. ఇక 175 అడుగుల ఎత్తులో ఉండే బెల్‌-టవర్‌ కూడా చాలా దూరం నుంచే కనపడుతుంది.
సందర్శకులను ఆకట్టుకునేలా…
ఈ కేథడ్రల్‌ చర్చి వెస్లియన్‌ మెథడిస్ట్‌, కాంగ్రిగేషనల్‌, ఆంగ్లికన్‌ మిషనరీ సొసైటీలతో ఏర్పాటైన దక్షిణ భారత దేశంలోని బిషప్‌ స్థానం కలిగిన చర్చి. మొత్తం 300 ఎకరాల్లో విస్తరించిన ఈ సముదాయం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇది గోతిక్‌ నిర్మాణ శైలితో నిర్మించడంతో సందర్శకులను ఇట్టే మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ కేథడ్రల్‌ చర్చిలో అతిపెద్ద ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే.. క్రీస్తు జీవితంలోని భిన్న దృశ్యాలను వర్ణించే స్టెయిన్డ్‌ గ్లాస్‌ విండోలు.. చర్చి లోపలికి వెళ్లగానే రంగు రంగుల్లో అందంగా ఉంటూ సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అక్కడ పశ్చిమ ట్రాన్‌సెప్ట్‌లో క్రీస్తు జననం, తూర్పు ట్రాన్‌సెప్ట్‌లో సిలువ వేయడం వంటివి చూడొచ్చు. మరో విశేషం ఏంటి అంటే ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కావు. ఇంగ్లండ్‌లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్‌ వేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్య కిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్యే ఈ పెయింటింగ్స్‌ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్‌ లైట్స్‌ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుక ఉన్న సైన్స్‌ అందరినీ అబ్బురపరుస్తుంది.
క్రిస్మస్‌కు ప్రత్యేక శోభ
ఈ అద్భుతమైన కేథడ్రల్‌ చర్చిలో నిష్కళంకమైన హస్తకళలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఏటా జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో క్రైస్తవులతో పాటు ఇతర మతస్థులు కూడా పెద్ద ఎత్తున్న వస్తారు. ఇలా ప్రతి క్రిస్మస్‌ వేడుకలప్పుడు ప్రత్యేక శోభను మెదక్‌ చర్చి సంతరించుకుంటుంది. ఇక ఈ మెదక్‌ చర్చిలో ఎక్కడ లేని విధంగా కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం చూస్తాం. ఇక వంద ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా ఇప్పుడు వచ్చే క్రిస్మస్‌ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని చర్చి నిర్వాహకులు భావిస్తున్నారు.
తలారి శ్రీనివాసరావు
ఉస్మానియా రీసెర్స్‌ స్కాలర్‌
9347488350