– 2800 బస్సుల్లో 2200 మేడారం జాతరకే..!
– 25 డిపోల నుంచి 80 నుంచి 100 బస్సులు అక్కడికే..
– వారం పాటు గ్రేటర్‌లో నడిచేవి 600 బస్సులే..
– ప్రత్యామ్నాయ రవాణా చూసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఒకప్పుడు రోజుకు 12 లక్షల మంది ప్రయాణిస్తే.. ఇప్పుడు సుమారు 18లక్షల మందికిపైగా ప్రయాణిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీనికితోడు గ్రేటర్ పరిధిలో ఇప్పటికే వెయ్యి బస్సులు తగ్గి.. సమయానికి బస్సులు రాక జనం అవస్థలు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేడారం జాతరకు గ్రేటర్ ఆర్టీసీ దాదాపు 80శాతం బస్సులను కేటాయించడంతో.. ఆ ప్రభావం నగరంలోని సిటీబస్సు ప్రయాణికులపై పడింది. 80 శాతానికిపైగా బస్సులు అటే వెళ్లనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 25 డిపోలుండగా.. వీటి పరిధిలో సుమారు 2800 వరకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 18-20లక్షల మందికిపైగా ప్రయాణికులను చేరవేస్తున్నాయి. మహాలక్ష్మి నేపథ్యంలో గతంలో ఆర్టీసీలో మహిళ ప్రయాణికులు 40శాతం వరకు ప్రయాణిస్తే.. ఇప్పుడా సంఖ్య 80శాతానికి పెరిగింది. ఈ క్రమంలో రేపట్నుంచి (21వ తేదీ) నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6 వేల ప్రత్యేక బస్సులు నడుపుతుండగా.. గ్రేటర్ జోన్ నుంచి 2200 సిటీబస్సులను నడిపించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ప్రతి డిపో నుంచి 80 నుంచి 100 బస్సులు ఇప్పటికే మేడారం జాతరకు బయలుదేరాయి. మంగళవారం ఉదయం నుంచే ఆయా డిపోల నుంచి బస్సులు బయలుదేరగా.. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ చొప్పున ఉన్నారు. వీరితో పాటు ఆర్‌ఎంలు, డీవీఎంలు, డీఎంలు, పీవోలు, ఇతర అధికారులు వెళ్లారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలో నేటి నుంచి ఆదివారం వరకు 600 రూట్లలో 600 బస్సులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.
జాతరకు లక్షలాది ‘మహాలక్ష్మి’లు
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే వెయ్యి బస్సులు తగ్గడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. కొత్త బస్సులు వస్తాయని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఉన్న బస్సుల్లో 80శాతం మేడారం జాతరకు నడుపుతుండటంతో.. సిటీ ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణాను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ సమయంలోనే ఓలా, ఊబర్, ఆటోవాలాలు చార్జీలతో బాదేస్తుంటే.. ఇప్పుడు రెండింతలు దోపీడీ చేసే అవకాముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులకు లేకుండా మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులు పెంచుతూనే.. ప్రయివేట్ రవాణాపై పోలీసుల, ఆర్టీఏ అధికారులతో నిఘా పెట్టించాలని కోరుతున్నారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ఈసారి మేడారం జాతరకు లక్షలాది మంది వచ్చే అవకాశముంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని బస్సులతో పాటు సిటీ బస్సులను జాతరకు ఉపయోగిస్తున్నామని, వారం రోజులపాటు ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా చూసుకొని.. తమకు సహకరించాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ ప్రాంతాల నుంచి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపనున్నారు.