– మంత్రి పొంగులేటి, సీతక్క
నవతెలంగాణ – ములుగు
ముఖ్యమంత్రి నేతృత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో మేడారం జాతరను నిర్వహిస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తెలిపారు. సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మను వారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. మేడారం వచ్చే సందర్శకులందరికీ వీఐపీ తరహాలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటికే దాదాపు 58 లక్షల మంది సందర్శకులు వనదేవతలను దర్శించుకున్నారని, జాతర సమయంలో రెండు కోట్ల మందికి పైగా మేడారం రానున్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. మేడారంలో దాదాపు 16వేలమంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, జాతర నిర్వహణలో అనుభవం ఉన్న అధికారులను ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 6000 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 17కోట్లమంది మహిళలు జీరో టికెట్‌తో ప్రయాణం చేసినట్టు తెలిపారు. జాతరకు మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున బస్సుల కేటాయింపులో వారికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, పారిశుధ్య నిర్వహణకు 4వేలమంది కార్మికులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 270 కిమీ రోడ్లను అభివృద్ధి చేశామని, తాగు నీరుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సందర్శకుల సౌలభ్యం కోసం మంత్రి సీతక్క స్వయంగా పనులు చూసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత జరుగుతున్న అతి పెద్ద జాతర అని, ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సులభంగా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రెండు నెలల నుండే మేడారానికి సందర్శకులు పోటెత్తారని, ముందస్తుగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం ఇదే ప్రథమమని తెలిపారు. నిరంతరం మేడారం పనులు పర్యవేక్షించిన అధికార యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్‌కి అంతరాయం కలగకుండా ఆర్టీసీ బస్సుల్లో జాతరకు రావాలని సూచించారు. ఇది రాష్ట్ర పండుగ అని, జాతర విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని మీడియాను కోరారు. జాతర అనంతరం ప్రతి రూపాయి లెక్క ప్రజలకు తెలియజేస్తామన్నారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడతామని తెలిపారు. వనదేవతల కీర్తి ప్రతిష్టలు శిలాశాసనం చేసి చరిత్ర లికించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జిల్లా అధికారులందరూ జాతరలో విధులు నిర్వహిస్తున్నందున గ్రామాల్లో మంచి నీటి, ఇతర సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. వారి వెంట సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత రావు, ములుగు కలెక్టర్ త్రిపాఠి తదితరులు ఉన్నారు.