– 23న రాష్ట్రపతి, సీఎం, గవర్నర్ రాక
– మంత్రి డాక్టర్ దనసరి సీతక్క
నవతెలంగాణ – ములుగు/తాడ్వాయి
మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క తెలిపారు. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నదని అన్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తుందని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉందని, సందర్శకులకు దర్శనం కోసం లెన్ల సంఖ్యను పెంచినట్టు చెప్పారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుందని చెప్పారు. జంపన్నవాగుపై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ పనులు పూర్తయ్యాయన్నారు. అనంతరం వెంకటాపూర్ మండల పాలంపేట గ్రామంలో రూ.90లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న వృద్ధాశ్రమ భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.