మేడారంలో ఘనంగా ఆదివాసి తెగల సమ్మేళనం

నవతెలంగాణ – తాడ్వాయి
ఆదివాసి స్వయం ప్రతిపత్తి కోసం పోరాడి అశువులు బాసిన వీరుల పోరాటాన్ని స్ఫూర్తిగా ఆదివాసీలు తమ సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కుల పరిరక్షణ కొరకు, ఉద్యమ కార్యచరణ కొనసాగించుటకు సమ్మక్క- సారక్క మేడారం జాతర ప్రాంగణంలో “తుడుందెబ్బ” ఆధ్వర్యంలో మంగళవారం ఆదివాసీ తెగల సమ్మేళనం నిర్వహించారు. మొదట సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. తుడుం దెబ్బ ఆదివాసి సంఘాలకు పూజారులు ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. నాయకపోడ్ లక్ష్మీదేవరా కళా సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీదేవి కళా ప్రదర్శన, ఆదివాసి నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ ఆదివాసి తెగల సమ్మేళనానికి కోయ, గోండి, పర్దాన్, కోలాం, నాయకపోడ్, కొండరెడ్డి, మన్నేవార్, చెంచు, తోటి, ఆంద్ ఆదివాసి తెగలవారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పి చైర్మన్ చంద లింగయ్య, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ లు మాట్లాడుతూ వనదేవతల మహా జాతర ఆదివాసి సాంప్రదాయాలకు ప్రకారం ఘనంగా నిర్వహించాలన్నారు. మేడారం ట్రస్ట్ బోర్డ్ కమిటీలో కూడా పూర్తిగా ఆదివాసీలే నియమించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలనలో క్రమక్రమంగా ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఆదివాసీలు రాజ్యాంగం హక్కులు చట్టాలు భూమి పరీక్షల కోసం 5వ షెడ్యూల్ స్వయంపాలన సాగించేందుకు ఆదివాసీ ప్రజలంతా ఏకమై జాతి అస్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు స్వయం ప్రతిపత్తి సాధించుకుందాం అని వారు  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేల సత్యం, జిల్లా పిసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, చింత కృష్ణ, భూర్క యాదగిరి, కబ్బాక శ్రావణ్, యాప అశోక్, పొడెం రత్నం, పొదెం కృష్ణ ప్రసాద్, మేడారం అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన బోజారావు, వట్టం జనార్ధన్, చంద మహేష్, మల్లెల రాంబాబు, పొడుగు శ్రీనాథం, వెనక చంద్రకళ, జి సి డి వో సుగుణ, ఆదివాసి మహిళా అధ్యక్షురాలు ఇర్ప విజయ, నర్సంపేట డివిజన్ అధ్యక్షురాలు పొడెం రాణి,  రాష్ట్ర నలుమూల నుండి ఆదిమత్యగల పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ విద్యార్థి యువజన మహిళా సంఘాలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.