అత్యంత నాసిరకంగా మేడారం జాతర పనులు

అత్యంత నాసిరకంగా మేడారం జాతర పనులు– సత్వరమే నాణ్యతతో పూర్తి చేయాలి
–  జాతరకు రూ.150 కోట్లు కేటాయించాలి : భద్రాచలం మాజీ ఎంపీ, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు
నవతెలంగాణ -తాడ్వాయి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరైన మేడారం మహా జాతర పనులు అత్యంత నాసిరకంగా జరుగుతున్నాయని, నాణ్యతగా సకాలంలో వెంటనే పూర్తి చేయాలని భద్రాచలం మాజీ ఎంపీ, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు అన్నారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతరలో జరుగుతు న్న పనులను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం, ఆదివాసీ సంఘం నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులు, ఐబీ శాఖ ఆధ్వర్యంలో జంపన్న వాగులో జరుగుతున్న ఇసుక చదును పనులు, పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కన్నెపెళ్లి, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్‌, జంపన్న వాగు, గద్దెల ప్రాంగణం, రెడ్డిగూడెం, కొంగలమడుగు, చింతల్‌ క్రాస్‌, నార్లాపూర్‌, ఊరట్టం జన సందోహంగా ఉండే ప్రదేశాలను సందర్శించి పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మేడారం మహా జాతరకు సుమారు 40 రోజులు మాత్రమే సమయం ఉందని, ఇప్పటినుంచే సందర్శకుల రద్దీ అధికంగా ఉందన్నారు. అయినా ఇంకా కొన్ని పనులు ప్రారంభం కాలేదని, కొన్ని పనులు నత్త నడకన నడుస్తున్నాయని ఆరోపించారు. చేస్తున్న పనుల్లోనూ నాణ్యత కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జాతరకు రూ.75 కోట్లే మంజూరు చేశారని, ఆ నిధులు సరిపోవని కొత్త ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసి సందర్శకుల సౌకర్యార్థం శాశ్వత నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. మేడారం మహా జాతరకు కోటి మంది వచ్చే అవకాశం ఉన్నదని, ఆ స్థాయిలో ఏర్పాట్లపై పర్యవేక్షణ అవసరం ఉందన్నారు. కానీ, నాయకులు, అధికారులు అవినీతి కారణంగా జాతర పనులు ప్రతిసారి నాసిరకంగా జరుగుతున్నాయని విమర్శించారు. ప్రతి జాతరకు కోట్ల నిధులు గంగలో పోసినట్టే అవుతుందన్నారు. జంపన్న వాగు వద్ద మహిళల కోసం గదులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మేడారంలో ఎండోమెంట్‌ శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా కార్యాలయం ఏర్పాటు చేసి అధికారులను నియమించాలని కోరారు. తుఫాను, వరదలకు కళ్యాణ కట్టలు, రోడ్లు ధ్వంసమయ్యాయని, వాటిని వెంటనే మరమ్మతు చేయాలన్నారు. జాతరకు ఎక్కడి నుంచో వచ్చే సందర్శకుల సౌకర్యార్థం అధికారులు ఆలోచిస్తున్నారు గాని, స్థానికంగా ఉండే రైతులు, ఆదివాసీ గిరిజనుల బతుకుల గురించి ఆలోచించడం లేదని వాపోయారు. స్థానిక గ్రామాల రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలని తెలిపారు. జంపన్న వాగు పొడుగునా చిలకల గుట్ట వరకు ఇరువైపులా కరకట్ట నిర్మించి రైతుల భూములు కాపాడాలని డిమాండ్‌ చేశారు. సందర్శించిన వారిలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు గొంది రాజేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు దుగ్గి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు కోటే కృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి వంక రాములు, మండల కార్యదర్శి జెజ్జరి దామోదర్‌, మండల అధ్యక్షులు అల్లెం అశోక్‌, జిల్లా కమిటీ సభ్యులు ఊకే ప్రభాకర్‌, ఇర్ప శ్రీను తదితరులున్నారు.