– 80 శాతం ప్రజల సమస్యలకు మినహాయింపు
– ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ప్రశ్నించటం లేదు
– ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు దాపురించాయి
– బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రతిపక్ష ఎంపీల సస్పెండ్
– బ్రిటిష్ పాలన నాటి అసమానతలు పునరావృతం
– సహజ వనరులు కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు
– అందుకే కార్పొరేట్ల సంపదలో భారీ పెరుగుదల
– ‘ఐలు’ అఖిల భారత మహాసభలో పాలగుమ్మి సాయినాథ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో మీడియా అతిపెద్ద వ్యాపారంగా మారిందని ప్రముఖ పాత్రికేయులు, రామన్ మెగాసిస్ అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. ప్రధాన స్రవంతి మీడియా కార్పొరేట్ల చేతుల్లో ఉందని, అందువల్ల ఆ మీడియా 80 శాతం ప్రజల సమస్యలను రిపోర్టు చేయకుండా మినహాయిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కూడా మీడియా ప్రశ్నించటం లేదని అన్నారు. కలకత్తాలోని హౌరాలో జరిగిన ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 14వ అఖిల భారత మహాసభలో పాలగుమ్మి సాయినాథ్ శనివారం ప్రసంగించారు. న్యాయవాదులు, జర్నలిస్టుల మధ్య దగ్గర సంబంధం ఉందనీ, చాలా మంది జర్నలిస్టులు న్యాయవాదులేనని అన్నారు. భగత్ సింగ్, మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్ వంటి వారు గొప్ప జర్నలిస్టులని తెలిపారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను పోలి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారని, ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు లేని సమయంలో ఎటువంటి చర్చా లేకుండా మూడు క్రిమినల్ చట్టాలను ఆమోదించారని గుర్తుచేశారు. మూడు రైతు చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ కమిటీలు డ్రాఫ్ట్ చేయలేదని, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపలేదని, వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యేక కమిటీ ముందు పెట్టలేదని పేర్కొన్నారు. ఆ బిల్లులను కార్పొరేట్లు తయారు చేశారని విమర్శించారు. ఓటింగ్‌కు డిమాండ్ చేస్తారని ఎంపీలను సస్పెండ్ చేసి ఆ బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారని విమర్శించారు. కీలకమైన బిల్లులను ఆమోదించుకునేందుకు మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్ చేస్తున్నదని విమర్శించారు. ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న మీడియా, అధికార బిజెపిని ప్రశ్నించటం లేదని సాయినాథ్ విమర్శించారు.
ప్రజాస్వామ్య పునాదులపై దాడి
ప్రజాస్వామ్య పునాదులపై దాడి జరుగుతుందని విమర్శించారు. ప్రజాస్వామ్యం ముందుకు సాగాలంటే, అసమానతలు తగ్గడం, భయోత్పాత వాతావరణం క్షీణిం చడం, మానవ హక్కుల హననం జరగకుండా ఉండటం ముఖ్యమని అన్నారు. కానీ ప్రస్తుతం ఈ మూడు అంశాల్లో తిరోగమనం ఉందని, దీంతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నదని చెప్పారు. దేశంలో కరోనా మరణాలపై స్పష్టమైన లెక్క లేదన్నారు. కరోనాతో భారతీయులు ఐదు మిలియన్లపైగా మరణించారని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయని, మన విశ్వగురు (ప్రధాని మోడీ) కేవలం 4.86 లక్షల మంది చనిపోయినట్టు చెప్పారని గుర్తుచేశారు. తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత ఆ లెక్కను కేంద్ర ప్రభుత్వం సవరించి, 5.21 లక్షల మరణాలుగా ప్రకటించిందని తెలిపారు. యూపీలో కరోనా మరణాలపై ప్రధాన మీడియా మౌనంగా ఉందని, ఎందుకంటే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రభుత్వం బెదిరిస్తుందని విమర్శించారు. 20 మిలియన్ల వలస కార్మికులు రోడ్లపై వందల కిలో మీటర్లు నడిచి స్వస్థలాలకు వెళ్తే, ఒక్కరు కూడా జాతీయ రహదారిపై లేరని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిందని, 14 రోజుల తరువాత మరో అఫిడవిట్లో 23 వేల ఫుడ్ సెంటర్లు తెరిచినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిందని అన్నారు. అయితే ఈ రెండు విరుద్ధ అంశాలపై సుప్రీం కోర్టు కూడా కేంద్రాన్ని ప్రశ్నించిందని పేర్కొన్నారు. ఇండియన్ రైల్వే శ్రామిక్ రైలు పేరుతో 25 రోజుల్లో 9.1 మిలియన్ల మంది వలస కార్మికులను తరలించినట్టు చెప్పిందని పేర్కొన్నారు.
అసమానతల పెరుగుదల
దేశంలో అసమానతలు రోజు రోజుకు పెరుగుతు న్నాయనీ, బ్రిటిష్ పాలన నాటి అసమానతలు పునరావృతం అవుతున్నాయని తెలిపారు. సంపద కొంత మంది చేతుల్లోనే కేంద్రీకృతం అయిందనీ, బిలియనీర్లలో మనదేశం మూడో స్థానంలో ఉందని చెప్పారు. అయితే ఈ ర్యాంక్‌పై మోడీ సర్కార్ సంతోషంగా వేడుకలు చేసుకుంటుందని, అదే మానవాభివృద్ది సూచీ (హెచ్‌డీఐ)లో 132వ స్థానంలో ఉందని అన్నారు. యూఎన్ఓ ఇచ్చిన ఈ రిపోర్టును మోడీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, యూఎన్ఓపై దాడికి పూనుకుందని పేర్కొన్నారు. వారికి అనుకూలంగా రిపోర్టులు ఉంటే స్వాగతిస్తారని, వ్యతిరేకంగా ఉంటే దాడి చేస్తారని విమర్శించారు. ఆకలి సూచీలో 121వ స్థానం, ప్రెస్ ఫ్రీడం సూచీలో 161వ స్థానం, పర్యవరణ సూచీలో 180వ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. 1991 నుంచి 2001 వరకు భారత దేశంలో 98 మంది బిలియనీర్లు ఉంటే, ఈ 20 ఏళ్లలోనే 42 మంది జత అయ్యారని తెలిపారు. మొత్తం 160 మంది బిలీనియర్లు ఉన్నారని, ఇటీవల జత అయిన బిలినీయర్లలో హెల్త్, ఐటీ, ఉత్పత్తిదారుల రంగంలో ఉన్నారని తెలిపారు. సంపద పేదల నుంచి బిలియనీర్లకు వెళ్తున్నదని, వారి సంపద రెట్టింపు అవుతున్నదని వివరించారు. జీడీపీలో ఐదో వంతు కేవలం 160 మంది వద్ద ఉందని అన్నారు. దేశంలో 30 శాతం మంది సంపద మైనస్‌లో ఉందని, 50 శాతం మంది సంపద కేవలం ఆరు శాతమేనని అన్నారు.
సహజ వనరుల దోపిడీ
ప్రజలకు సంబంధించిన సహజ వనరులు కార్పొరేట్లకు దోచిపెట్టడంతోనే కార్పొరేట్ల సంపద పెరుగుతుందని అన్నారు. 2006 గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అదానీ సంపద మిలియన్ డాలర్లని, ప్రధాని మోడీ కావడానికి ముందు 2013 నాటికి ఆయన సంపద 3.8 బిలియన్ డాలర్లని, 2022 నాటికి 129 బిలియన్ డాలర్లకు పెరిగిందని తెలిపారు. ప్రపంచంలోని ఏ బిలియనీర్ సంపద కూడా ఇంతలా పెరగలేదని పేర్కొన్నారు. ఇటీవలి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన రెండు కీలకమైన ఒప్పందాలను చేసుకుందని అన్నారు. ఇవి వ్యవసాయ రంగానికి, భద్రతకు నష్టం చేస్తాయన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సెంట్రల్ డేటాబేస్‌ను ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) మాన్‌శాంటో, అమెజాన్ వంటి కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారని, డేటాబేస్ మొత్తం అమెజాన్, మాన్‌శాంటో నియంత్రణలోకి వెళ్తుందని పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధమని అన్నారు.