పునరావాస కేంద్రాల్లో మెడికల్‌ క్యాంపులు

– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అవసరమైన వారందరికీ టెస్టులు చేసి, మెడిసిన్‌ అందజేయాలని సూచించారు. వరదల తీవ్రత ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో పది మెడికల్‌ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి టీమ్‌లో స్పెషలిస్ట్‌ డాక్టర్లు, సిబ్బంది, టెస్టులు చేయడానికి అవసరమైన పరికరాలు, మెడిసిన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం మెడికల్‌ క్యాంపుల ఏర్పాటు, నిర్వాహణ బాధ్యతలను హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ కర్ణన్‌కు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వరదల తర్వాత జ్వరాలు, డయేరియా వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫీవర్‌ సర్వే పకడ్బందీగా చేయాలనీ, బాధితుల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ కర్ణన్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ వాణి, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజరుకుమార్‌, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ రవిందర్‌ నాయక్‌తో మంత్రి సోమవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.