కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యం

– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రి లలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ లో వైద్య, ఆరోగ్య ఉత్సవాలలో భాగంగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కెసిఆర్ కిట్, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు, పండ్ల పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తుందన్నారు. హుస్నాబాద్ లోరూ. 12 కోట్ల 6 లక్షలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం, 30 పడకల ఆసుపత్రిని 50 పడకల సామర్థ్యం గల కమ్యూనిటీ ఆసుపత్రిగా మార్చడం జరిగిందన్నారు. మీర్జాపూర్ లో రూ.2 కోట్ల రూపాయలతో ప్రైమరీ హెల్త్ సెంటర్ ,బస్తీ దవాఖాన కు రూ. 12 లక్షలు, అదనంగా మరో 35 పల్లె దవాఖానాలు, ఒక డయాలసిస్ సెంటర్, మోకీలు ఆపరేషన్ కేంద్రం ఏర్పరచుకున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 54 టెస్టులు చేసే సౌకర్యం మాత్రమే ఉండగా 134 రకాల పరీక్షలు చేసుకునేల అభివృద్ధి చేశామన్నారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు వైద్యం కోసం జిల్లా కేంద్రాలకు, హైదరాబాదుకు పోకుండా ఇక్కడే అన్ని రకాలుగా వైద్య సౌకర్యాలు కల్పించామని అన్నారు. రానున్న రోజులలో ఇంకా మెరుగైన వైద్య సేవలు హుస్నాబాద్ ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, ఎంపీపీ లకావత్ మానస సుభాష్, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, జెడ్పిటిసి భూక్య మంగా వైద్యాధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.