– లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవు
– డీసీఏ డీజీ వీ.బీ.కమలాసన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రం నిర్ణయించిన ధరలకే అత్యవసర మందులను విక్రయిం చాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ వీ.బీ.కమలాసన్ రెడ్డి సూచించారు. ధరలు పెంచి అమ్మితే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పుబెర్జన్ హెచ్‌పీ ఎన్‌యు 2000 అనే ఇంజెక్షన్‌లను నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధర ముద్రించటంతో హన్మకొండలో వాటిని సీజ్ చేసినట్టు తెలిపారు. కేంద్రం నిర్ణయించిన ధర రూ.343.64 కాగా జీఎస్‌టీ 12 శాతంతో కలుపుకున్నా రూ.384.87 మించకుండా అమ్మాల్సి ఉంటుంది. అయితే వీటిపై మాత్రం రూ.231.29 (55.4 శాతం) అదనంగా అంటే రూ.598.16 (ఒక్కో వయల్ కు) అని ముద్రించడం డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్, 2013ను ఉల్లంఘించడమే అని ఆయన తెలిపారు. ఈ ఇంజెక్షన్లను మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలం, కొల్తూర్ గ్రామంలో సంజైమ్ ప్రయివేట్ లిమిటెడ్ తయారు చేస్తుండగా, ముంబయికి చెందిన జె.బీ.కెమికల్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తున్నది.
అనుమతి లేని మందుల స్వాధీనం
సంగారెడ్డి జిల్లా పటానుచెరు మండలం భానుర్ గ్రామంలో నకిలీ వైద్యులు సుబ్రత మండల్ ప్రాంగణంపై దాడి చేసిన ఔషధ నియంత్రణ మండలి అధికారులు డ్రగ్ లైసెన్స్ లేకుండా స్టాక్ పెట్టుకున్న 54 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు.