– అల్కరాజ్, జ్వెరెవ్ సైతం
– ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రష్యా స్టార్ డానిల్ మెద్వదేవ్ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్‌లో మూడో సీడ్ డానిల్ మెద్వదేవ్ నాలుగు సెట్ల సమరంలో విజయం సాధించాడు. పోర్చుగల్ ఆటగాడు నునోపై 6-3, 7-6(7-4), 5-7, 6-1తో మెద్వదేవ్ గెలుపొందాడు. 13 ఏస్‌లు, ఆరు బ్రేక్ పాయింట్లతో సత్తా చాటాడు. పాయింట్ల పరంగా 152-130తో పైచేయి సాధించాడు. రెండో సీడ్ స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ వరుస సెట్లలో నెగ్గాడు. 6-4, 6-4, 6-0తో మియోమిర్ (సెర్బియా)ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. అల్కరాజ్ ఐదు బ్రేక్ పాయింట్లు సాధించగా, సెర్బియా ఆటగాడు ఒక్క సర్వ్‌ను బ్రేక్ చేయలేకపోయాడు. జర్మనీ కుర్రాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 7-5, 3-6, 6-3, 4-6, 7-6(10-3)తో ఐదు సెట్ల పోరులో కామెరూన్ నోరీపై గట్టెక్కాడు. జ్వెరెవ్‌తో సమానంగా నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించిన కామెరూన్ నిర్ణయాత్మక ఐదో సెట్ సూపర్‌టైబ్రేకర్‌లో వెనుకంజ వేశాడు. హుబర్ట్ 7-6(8-6), 7-6(7-3), 6-4తో ఆర్థర్‌పై ఉత్కంఠ విజయం నమోదు చేశాడు. మహిళల సింగిల్స్‌లో జెంగ్, అనా కలినిస్కయ, లిండా నోస్కోవా, డయానలు వరుస సెట్ల విజయాలతో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు. మెన్స్ డబుల్స్‌లో రోహన్ బోపన్న, ఎబ్డెన్ జోడీ 7-6(10-8), 7-6(7-4)తో మూడో రౌండ్లో విజయం సాధించింది.