– శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంత్రులు డి శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని తెలిపారు. మిగిలిన 15 వేలు పోస్టులను కలిపి 20 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించాలని కోరామన్నారు. మెగా డీఎస్సీ ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉందనీ, కొంత సమయం తీసుకుని నోటిఫికేషన్‌ను జారీ చేస్తామంటూ మంత్రులు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం సభ్యులు హరీశ్, ఆదిత్య, శ్రీనివాస్, శ్రీనునాయక్, స్వప్న, కవిత తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి వినతి
15 వేల ఉపాధ్యాయ పోస్టులను కలిపి డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరుతూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనను బుధవారం తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్‌రెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాతపరీక్షల తేదీలను ప్రకటించాలనీ, ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులతో ముడిపెట్టకుండా మెగా డీఎస్సీని ప్రకటించాలని సూచించారు. డీఎస్సీపై ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయనీ, ముఖ్యమంత్రితో సమీక్ష తర్వాత నిర్ణయం తీసుకుంటామని బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారని తెలిపారు.