25 వేల టీచర్‌ పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటించాలి

Mega DSC should be announced for 25 thousand teacher posts– రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌
– విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి
– నిరుద్యోగుల భారీ ర్యాలీ, తీవ్ర ఉద్రిక్తత
– అసెంబ్లీ చేరువలో అరెస్ట్‌
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
ఇరవై ఐదు వేల టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్‌ నీల వెంకటేష్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, రామ్మోహన్‌రావు సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగులు మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు అరెస్టుల పరంపర కొనసాగించారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులు పలు దిక్కుల నుంచి కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అలీయా కళాశాల నుంచి ర్యాలీగా బషీర్‌బాగ్‌, రవీంద్రభారతి మీదగా వచ్చి కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడిం చారు. కళాశాల నుంచి బయలుదేరిన వారిని పోలీసు లు ఎల్బీ స్టేడియం వద్ద అడ్డుకోవడానికి ప్రయత్నిం చారు. దీంతో పోలీసులు, నిరుద్యోగుల మధ్య తోపు లాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీ సులను తప్పించుకుని నిరుద్యోగులు కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించడానికి తరలివెళ్లగా.. అక్కడ అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలిం చారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య నిరుద్యోగులను నిలువరించ డానికి ప్రయ త్నించినప్పటికీ మూకుమ్మడిగా తరలిపోయారు.
అంతకు ముందు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పీఆర్సీ కమిటీ రిపోర్ట్‌ ప్రకటిస్తే 5 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడం దారుణమన్నారు. తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో 18 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించారని, సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో 15 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారని, 25 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయని చెప్పారు. 25 సంవత్సరాలుగా ఎయిడెడ్‌ పాఠశాలల్లో 4,900 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 10 వేల పీఈటీ పోస్టులు, 5 వేల క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ టీచర్‌ పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ టీచర్‌ పోస్టులను ఈ అసెంబ్లీ ఎన్నికల్లోపే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని.. లేకపోతే సచివా లయం, ప్రగతి భవన్‌ను నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో బీసీ నిరుద్యోగ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం, డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం నాయకులు జిల్లపల్లి అంజి, పథ్వీ రాజ్‌, మోడీ రాందేవ్‌, సైదులు గౌడ్‌, రాజు, రమా దేవి, గంగ, గౌతమి, శృతి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ అభ్యర్థులపై లాఠీచార్జీ అమానుషం..వైఎస్‌ షర్మిల
భావి తరానికి పాఠాలు నేర్పే ఉపాధ్యాయ అభ్యర్థులపై కేసీఆర్‌ ప్రభుత్వం లాఠీ ఛార్జ్‌ చేయటం అమానుషమని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీలో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తే లాఠీలతో కొడతారా?అని ప్రశ్నించారు. కొలువుల కోసం తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగులను కొట్టటం దారుణమని తెలిపారు. తొమ్మిదేండ్లుగా ఉపాధ్యాయ పోస్టుల ఊసేత్తకుండా నామమాత్రంగా పోస్టులు భర్తీ చేసి, ఓట్లు దండుకునేందుకు కొత్త ఎత్తుగడలతో వస్తున్నారని పేర్కొన్నారు.
డీఎడ్‌,బీఎడ్‌ అభ్యర్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మెగా డీఎస్సీ కోసం ప్రగతిభవన్‌ను ముట్టడిస్తాం
–  22 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిందే
– డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులపై లాఠీచార్జీ సరికాదు :ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఖండన
 రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిందేనని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. 22 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కోట రమేష్‌, కార్యదర్శులు టి నాగరాజు, ఆనగంటి వెంకటేశ్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.