మెగా డీఎస్సీ నిర్వహించాలి

– డీఎస్సీ అభ్యర్థుల అక్రమ అరెస్టులు సరికాదు
– టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్ 
నవతెలంగాణ- పెద్దవంగర: అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విధంగా 13,086 పోస్టులతో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్‌ మెగా డీఎస్సీ జారీచేయాలని టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు సోమారపు ఐలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ..శాంతియుతంగా తమకు న్యాయం చేయాలని వివిధ జిల్లాల కేంద్రాల్లోని కలెక్టరేట్ కు మెమొరాండం ఇవ్వడానికి వెళ్ళిన డీఎస్సీ అభ్యర్థులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఉపాధ్యాయ నియామకాల కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తుంటే… ప్రభుత్వం నామమాత్రపు పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపించారు. కోచింగ్‌ల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసుకున్న నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ప్రభుత్వం వెంటనే 13,086 టీచర్‌ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి డీఎడ్‌, బీఎడ్‌ నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట కలిగేలా మెగా డీఎస్సీ ప్రకటించాలని, పరీక్షలకు నాలుగు నెలల సమయం ఇవ్వాలని, నియామక పరీక్ష ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత రాస్తున్న మొదటి డీఎస్సీ కావడం వివిధ జిల్లాలలో పోస్టుల కంటే ఖాళీ స్థానాలే ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. సామాజిక వర్గాలవారిగా ముఖ్యంగా పురుష అభ్యర్థులకు పోస్టులే లేకపోవడం వలన తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ పోస్టులను పెంచి వారికి న్యాయం చేయాలని కోరారు.