రాష్ట్రాభివృద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌

– మూసీ పొడుగునా వ్యాపార, వాణిజ్య కేంద్రాలు
– పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రాన్ని నాటికి పారిశ్రామికంగా 2050 నాటికి అభివద్ధి పథకంలో పరుగులు పెట్టించేందుకు మెగా మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయనున్నట్టు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. గురువారం సీఐఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మౌలిక సదుపాయాలు, రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా 55 కిలోమీటర్ల మేర మూసీ నది రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి బాధ్యతలను హెచ్‌ఎండీఏకు అప్పగించామని తెలిపారు. మూసీ పొడుగునా అమ్యూజ్‌ మెంట్‌ పార్కులు, జలపాతాలు, వాటర్‌ స్పోర్ట్స్‌, వ్యాపార, వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య పద్ధతిలో షాపింగ్‌ మాల్స్‌ను నిర్మిస్తామని వివరించారు. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతం వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందిడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్టును పారదర్శకంగా చేపట్టడానికి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. టూరిజం, వినోదం, ఆతిథ్య రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే దిశగా వెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, సీఐఐ తెలంగాణ చైర్మెన్‌ సీ శేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మెన్‌ సాయి డీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.