బాన్సువాడలో మెగా పార్క్

మానసికోల్లాసంకై ఉద్యానవనం స్పీకర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ- నసురుల్లాబాద్ (బాన్సువాడ)
మానసికోల్లాసం కరువవుతోంది. పని ఒత్తిడిలో వివిధ రుగ్మతలకు గురవుతుండగా ప్రకృతే ప్రథమ చికిత్స అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఉద్యానవనం పనులను స్పీకర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ బాన్సువాడ పట్టణం బ్యూటిఫికేషన్ లో భాగంగా స్థానిక కల్కి చెరువు వద్ద నాలుగు కోట్ల రూపాయలతో మల్టీజోన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  సహకారంతో ఈ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఉద్యానవనంలో మహిళ, వృద్దులకు, పిల్లలకు ప్రత్యేకంగా ఉద్యానవనంలో ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో వాకింగ్ చేయడానికి, యోగా, ధ్యానం చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉండడంతో పాటుగా రెస్టారెంట్,  పార్కింగ్, బాత్రూం లను  ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాన్సువాడ పట్టణంలో మౌళిక వసతులు అభివృద్ధి చెందడంతో ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్న జనాభా పెరుగుతుందన్నారు. ఉద్యానవనం ఏర్పాటుతో పట్టణ ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. ఇలా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ఉద్యానవనం ఈ చుట్టు పక్కలే కాదు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేదన్నారు. ప్రజలు కుటుంబ సభ్యులతో వచ్చి ప్రశాంతంగా సేదతీరడానికి ఈ ఉద్యానవనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పార్క్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణా రెడ్డి, ఎఎంసి చైర్మన్ నెర్రె నర్సింహులు, మున్సిపల్ కమీషనర్ రమేశ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.