– బీజేపీకి 370 ప్లస్ ఖాయం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ హయాంలో అవినీతి రాజ్యమేలగా, తమ పదేండ్ల పాలనలో దేశంలో ఎలాంటి మెగా స్కామ్‌లు జరగలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో ఆదివారం పార్టీ జాతీయ సదస్సు 2024 రెండో రోజు బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ విపక్ష నేతలు ఈసారి ఎన్డీయేకు 400 స్ధానాలని నినాదాలు ఇస్తున్నారని, ఎన్డీయేకు 400 స్ధానాలు వచ్చే దిశగా బీజేపీ 370 స్ధానాలు పైగా గెలుచుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు.తాము మెగా స్కామ్‌లు, ఉగ్ర దాడుల నుంచి దేశాన్ని రక్షించామని యావత్ దేశం విశ్వసిస్తోందని అన్నారు. తాము పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించామని చెప్పారు. అభివద్ధి చెందిన భారత్ ఆవిష్కరణ దిశగా రాబోయే ఐదేండ్లు కీలకమని అన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివద్ధి చెందిన దేశంగా మలిచేందుకు అవసరమైన చర్యలను గత పదేండ్లలో చేపట్టామని ప్రధాని మోడీ వివరించారు. మనం అభివద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపు ఇచ్చారు.