– ప్రారంభించనున్న పినరయి
– వైజ్ఞానిక ప్రయోగాలు, సృజనాత్మక ఆవిష్కరణలు
– ప్రముఖులతో చర్చా గోష్టులు
– నెల రోజుల పాటు కొనసాగనున్న గ్లోబల్ ఫెస్టివల్
తిరువనంతపురం : కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం నుంచి అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. శాస్త్రీయ అన్వేషణలు, ప్రకాశవంతమైన కళాత్మకతల మేళవింపుగా ఈ మెగా ఫెస్టివల్ జరగబోతోంది. రాజధాని శివారులోని బయో 360 లైఫ్‌సైన్స్ పార్కులో సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి, సైన్స్ ఫెస్టివల్ చైర్మన్ కేఎన్ బాలగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో మూఢనమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పారు. దేశమంతటా శాస్త్రీయ దృక్ఫధాన్ని వ్యాపింపజేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన తెలిపారు. వైజ్ఞానిక ప్రయోగాలు, సృజనాత్మక ఆవిష్కరణలతో నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. ఈ వార్షిక జాతీయ కార్యక్రమ నిర్వహణ కోసం ఐదు కోట్ల రూపాయలు అందించేందుకు సైన్స్ కాంగ్రెస్ నిరాకరించిందని చెప్పారు.
రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తున్న ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఆసియాలోనే అసాధారణ కార్యక్రమం. శాస్త్ర సాంకేతిక శాఖ, శాస్త్ర సాంకేతిక పర్యావరణ రాష్ట్ర మండలి, ప్రభుత్వేతర స్వచ్ఛంద ట్రస్ట్ అమ్యూజియమ్ ఆర్ట్ సైన్స్ సంయుక్తంగా ఈ మహా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు, విభాగాలు ‘లైఫ్ సైన్స్’ థీమ్‌తో సందర్శకులకు మంచి అనుభవాన్ని అందించబోతున్నాయి.
ఈ ఉత్సవ నిర్వహణ కోసం అమెరికా కాన్సులేట్ జనరల్, బ్రిటీష్ కౌన్సిల్, జర్మన్ కాన్సులేట్, అలయన్స్ ఫ్రాంఛైజ్, తిరువనం తపురంలోని ఐఐఎస్‌ఈఆర్, సీఎస్‌ఐఆర్- ఎన్‌ఐఐఎస్‌టీ, విశ్వేశ్వరయ్య ఇండిస్టియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం వంటివి విరాళాలు అందజేశాయి. బిటన్‌కు చెందిన ఇన్‌స్టలేషన్ కళాకారుడు రూపొందించిన ‘మ్యూజియం ఆఫ్ మూన’్, ‘మార్స్’, మెల్‌బోర్న్ యానిమేటర్ డ్రా బెర్రీ రూపొందించిన ‘మాలెక్యులర్ యానిమేషన్’, డాక్టర్ డగ్లస్ హెర్మన్ రూపొందించిన ‘వాటర్ మ్యాటర్స్’, బెంగళూరుకు చెందిన విశ్వేశ్వ రయ్య మ్యూజియం రూపొందించిన ‘సీడ్స్ ˜్ కల్చర్’ వం టివి ఈ ఉత్సవానికి ప్రధాన ఆక ర్షణ గా నిలుస్తాయి.
సైన్స్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించే చర్చా గోష్టుల్లో నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ మార్టన్ పి. మెల్డల్, చెన్నరులోని అమెరికా కాన్సులేట్ జనరల్, డాక్టర్ మధులిక గుహతాకుర్తా, డెనైస్ హిల్ (నాసా), డాక్టర్ రాబర్ట్ పోట్స్ (మాంచెస్టర్ మెట్రొపాలిటన్ యూనివర్సిటీ), ప్రొఫెసర్ మైకెల్ విల్సన్ (లౌబరో యూనివర్సిటీ), డాక్టర్ సురేష్ సి పిళ్లై (అట్లాంటిక్ టెక్నలాజికల్ యూనివర్సిటీ), డాక్టర్ రాజీవ్ పట్టాథిల్ (రూథర్‌ఫర్డ్ యాపిల్టన్ లేబొరేటరీ), కనిమొళి (ఎంపీ), డాక్టర్ రాజేంద్ర సింగ్ (మెగసెసే అవార్డు గ్రహీత), మాలినీ వి శంకర్ (ఇండియన్ మారీటైమ్ యూనివర్సిటీ) తదితరులు పాల్గొంటారు.