21వ శతాబ్దంలో అతి పెద్ద ప్రజారోగ్య సమస్యగా మహానగరాల గాలి కాలుష్యం నిలుస్తున్నది. నేడు దేశ వ్యాప్తంగా విస్తరించిన మెగా సిటీలు ఈ కోరల్లో చిక్కి నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యంత గాలి కాలుష్యం కలిగిన ప్రపంచ నగరాల జాబితాలో భారత దేశానికి చెందిన మహానగరాలు అనేకం ఉండడం నగర వాసుల విషమ పరిస్థితులకు అద్దం పడుతున్నది. పరిశుభ్రమైన భారత నగరాలు అతి తక్కువగా కనిపించడం విచారకరం. శీతాకాలపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో మంచు కురవడం, కాలుష్య పొగ చేరడం, ధూళి కణాలు, వాహన కాలుష్య పొగలు, పారిశ్రామిక విష తుల్య రసాయనాలు, ప్రాణాంతక లోహాలు మొదలగు పలు కాలుష్యాలు కలిసి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్ట డం ప్రతి ఏట చూస్తున్నాం. ముఖ్యంగా ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు లాంటి అనేక మహానగరాలు గాలి కాలుష్య తీవ్రతలు ప్రమాదకర స్థాయికి చేరడం చూస్తున్నాం. నగరాలు కుంపట్లను తలపి స్తున్నాయి. ప్రమాదకర గాలి కాలుష్యంతో ప్రజలు అనారో గ్యాల పాలవుతున్నారు. మురికి వాడల్లో నివసించే కడు పేదలు కాలుష్య కారణ అనారోగ్యాలతో పడరాని పాట్లు పడుతున్నారు. గాలి కాలుష్యం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. కాలుషిత గాలి కాలుష్యంతో విషపూరిత సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి చేరడంతో బిపీ, గుండె పోటు, స్ట్రోక్, అవయవ వాపులు లాంటివి తక్షణమే కలుగుతాయి. మెదడు ప్రభావితం కావడం, నాడీమండల రుగ్మతలు కూడా కలుగుతాయి. ఇంకా చర్మ సమస్యలు, చర్మం ముడతలు పడడం, వాపులు సహితం కలుగు తాయి. శారీరక బలహీనత, అలసట, జ్ఞాపకశక్తి లోపం, వాంతులు, విరోచనాలు, కళ్ల మంటలు లాంటి అనారో గ్యాలు కూడా అనుభవంలోకి వస్తాయి. గాలి కాలుష్య సంబంధ భయంకర వాస్తవాలను గమనిస్తూ పౌర సమా జం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతంగా, సమాజ పరంగా, ప్రభుత్వపరంగా అందరూ సమన్యయంతో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతినబూనాలి. స్వచ్ఛమైన గాలిని భవిష్యత్తు తరాలకు అందజేయాలి.
– మధు