మేఘమేమీ ప్రేమ లేనిది కాదు
నువ్వు చూడాలే కాని మేఘానికి కళ్ళుంటాయి
చెవులుంటాయి, నోరుంటుంది
కష్ణుడికిమల్లె నల్లనైన శరీరమూ వుంటుంది
అది అప్పుడప్పుడు పెరుగుతుంది
అప్పుడప్పుడు తగ్గుతుంది కూడా !
మేఘమేమీ ఊరికే కూర్చోదు
సూర్యునితో సయ్యాట లాడుతుంది
చంద్రునితో కథలు చెబుతుంది
చుక్కలు నా మిత్రులంటుంది
ఆకాశం నాకు దుప్పటంటుంది
మనుషులందరూ నా వాళ్ళేనని
చినుకులతో రాయబారమూ పంపుతుంది
మేఘం ఒక సోషలిస్టు
పేద ధనిక బేధం లేకుండా
అందరి తలలూ తడుపుతుంది
ప్రకతికి పచ్చని చీర కట్టే మేఘం
తనలోని నీళ్లతో
కన్నీళ్లను తుడుద్దామనుకున్న మేఘం
ఇప్పుడెందుకో అలిగి కూర్చుంది
సమయపాలన పాటించనని మొండికేసింది
మీ పద్ధతి మారేదాకా కరగనని
భీష్మించుకుని కూర్చుంది
అయినా మేఘమేమీ కఠినమైంది కాదు
మేఘానిది తల్లి మనసు, తండ్రి బాధ్యత
నువ్వు మనసుతో పలకరించాలేగాని
అది కరగనంటుందా , వర్షించనంటుందా
తన బాధ్యతేదో నిర్వర్తించనంటుందా !
– ఎన్.నరేశ్ చారి, 9701334516