తేనెలూరు తెలుగు

Mekhalur Teluguఏ జాతి ప్రజల ప్రగతికైనా మాతృభాషే పునాది. అటువంటి గొప్ప భాషే మన తెలుగు. కనుకే ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని అలనాడు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషా సంస్కృతీ వైభవాలను కొనియాడారు. ప్రపంచ భాషలలో తెలుగు అనేక అద్భుతాలను ప్రోది చేసుకున్న భాషగా ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా ఎందరో ఏనాడో ఒప్పుకున్నారన్నది జగమెరిగిన సత్యం. అలాంటి మధురమైన, అద్భుతమైన భాషను నేడు మన తెలుగువాళ్ళే భ్రష్టుపట్టించడం ఎంతో బాధ కలిగించే విషయం. ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌’ సంస్థ 2011 జనాభా ప్రాతిపదికగా చేసిన అధ్యయన నివేదిక ప్రకారం దేశంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 1971లో 8.16 శాతంతో రెండవ స్థానంలో వుండగా, ప్రస్తుతం 6.6 శాతంతో నాలుగో స్థానానికి పడిపోవడం ఎంతటి బాధాకరం. బతుకు తెరువు కోసం నేర్చుకున్న ఇంగ్లీషు మోజులో పడి మాతృభాషను మర్చిపోవడం క్షమించరాని నేరం. తెలుగు భాషను అశ్రద్ధ చేయడం సహించరాని విషయం.
దేశంలో హిందీ మాట్లాడేవారి సంఖ్య నాలుగు శాతం పెరగగా, ప్రాంతీయ భాషలలో మరాఠీ ఆరవ స్థానం నుండి మూడవ స్థానానికి ఎదగడం అదే సమయంలో తెలుగు భాష స్థానం పడిపోవడం ఆందోళనకరం. మాతృభాష పట్ల ఎనలేని ప్రేమ, తపన, గౌరవంతో ఆయా భాషల పరిరక్షణ కోసం పొరుగు రాష్ట్రాలు చేస్తున్న కృషిని చూసైనా మనకు కనువిప్పు కలగాలి. ఆంగ్లం, హిందీ భాషలను నేర్చుకోవాలన్న ఆసక్తి, తపన వుండడంలో తప్పులేదు. కానీ తెలుగు నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదన్న భావన విడిచిపెట్టి తెలుగు భాష నేర్చుకునేలా ప్రతి తెలుగువారు కృషిచేయాలి.
తెలుగు వాళ్లగా పుట్టి తెలుగు మాట్లాడడం, రాయడం రాదని గొప్పగా చెప్పుకోవడం నేటి తరంలో ఓ రివాజుగా మారింది. ఒకపక్క విదేశాలలో స్థిరపడినవారు తమ పిల్లలకు తెలుగు నేర్పించడంలో అనితరసాధ్యమైన కృషి చేస్తున్నారు. కానీ మన దేశంలో వున్నవారు తెలుగును విస్మరిస్తున్నారు. తెలుగు భాషపై నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించడమంటే జన్మనిచ్చిన మాతృమూర్తిని అశ్రద్ధ చేయడంతో సమానం. ప్రభుత్వాలు కూడా తెలుగు భాష పరిరక్షణపై ఉపన్యాసాలు దంచడం తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదు. ఒక సమగ్ర ప్రణాళికతో తెలుగు భాషను, దాని వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి జరగాలి.
తెలుగు భాషలో 100 శాతం పాలనను చేపడతామన్న వాగ్దానాన్ని మన ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి. గ్రామ స్థాయి నుండి పాలనను తెలుగులోనే అమలు చేసేందుకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయ్యాలి. ప్రతి తెలుగు వ్యక్తి తెలుగు భాషలో పాండిత్యం సాధించే విధంగా మన విద్యా విధానాన్ని తక్షణం సంస్కరించాలి. తేనెకన్నా తీయనైన మన భాష ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని కాపాడే ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగానే ఉంది. చాలామంది తెలుగు ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. టీచర్లు లేనందున ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు సుముఖత చూపడం లేదు. టీచర్లు, విద్యార్థులు లేక చాలా స్కూళ్లు బోసిపోతున్నాయి. ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. భాషా పండితులకు పదోన్నతులు ఇవ్వాలి. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ప్రకటించాలి. సర్కారీ బడుల్లో తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో మమకారం పెరిగేలా ప్రోత్సహించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మాతృభాష పట్ల ప్రేమ కలిగేలా చూడాలి. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అంటూ తెలుగును కాపాడుకోవాలి.