
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో స్వయం సహాయక సంఘాల మహిళలకు పలు వరాలు ప్రకటించిన నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులు, సెర్ప్ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయం వద్ద ఇందిరా క్రాంతి పథం సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి స్థానిక మహిళా సంఘాల సభ్యులు సిబ్బందితో కలిసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి సీతక్కల చిత్రపటాలకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. మహిళా సంఘాలకు కోటి రూపాయల వరకు రుణం, బ్యాంకు లింకేజీ రుణాలపై వడ్డీ రాయితీ మంజూరు చేయడం, అందరు మహిళా సంఘాల సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పించడం, వీ సేఫ్ ఆప్ ద్వారా మహిళలకు భద్రత కల్పించడం, ఇందిరమ్మ ఇల్లు సహా అన్ని ప్రభుత్వ పథకాలు మహిళల పేరుతో ఇస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతగా ఐకెపి ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి స్థానిక మహిళా సంఘ సభ్యులు సిబ్బందితో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఐకెపి సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలకు కోటి రూపాయల వరకు రుణం ఇవ్వడమే కాకుండా వడ్డీ రాయితీ వర్తింప చేయడంతో మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని అన్నారు. అదేవిధంగా దురదృష్టవశాత్తు మహిళా సంఘ సభ్యులు మరణిస్తే వారి రుణాలు కుటుంబ సభ్యులు కట్టలేక పలు సంఘాలు డిఫాల్ట్ గా మారుతున్నాయని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి బీమా సౌకర్యం కల్పించడంతో అనుకొని కారణాలవల్ల మరణం సంభవిస్తే లభించే ఇన్సూరెన్స్ సదుపాయంతో ఆ కుటుంబం పై ఆర్థిక భారం పడదని అన్నారు.మహిళల కోసం పలు పథకాలు ప్రకటించడం పట్ల మహిళా సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖల మంత్రివ సీతక్క ధన్యవాదాలు తెలియజేస్తూ రాఖీ కట్టి మహిళలతో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిసిలు రవికుమార్, భాగ్య లక్ష్మి, అలేఖ్య, సిబ్బంది ధనలక్ష్మి, వివొఏ లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.