‘చందమామ’ కథల జ్ఞాపకాలు

తెలుగు నాట ‘చందమామ’ పిల్లల మాసపత్రిక చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. 1947 జూలైలో మొదలైన ఈ పత్రిక 2013 వరకు 66 సంవత్సరాల పాటు నడిచింది. చందమామను స్థాపించిన ఘనత, విజయ వాహిని స్టూడియో అధినేత, పాతాళభైరవి, మాయాబజార్‌, గుండమ్మ కథ వంటి హిట్‌ చిత్రాలను అందించిన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి; రచయిత, నిర్మాత, దర్శకులు అయిన చక్రపాణి గార్లది. మొదట తెలుగు, తమిళం భాషల్లో మొదలై, క్రమేపీ- కన్నడ, హిందీ, మరాఠీ, మలయాళం, గుజరాతి, ఆంగ్లం, ఒరియా, బెంగాలీ, పంజాబీ, అస్సామీ, సంస్కతం, సింహళం, సంతాలి వంటి 15 భాషల్లో వెలువడి లక్షలాది పాఠకులకు చేరువైంది. దీనిని గొప్పగా తీర్చిదిద్దిన ఘనత కొడవటిగంటి కుటుంబరావు గారిది. 1952లో చేరిన వీరు 1980లో చనిపోయే వరకు చందమామ ఎడిటర్‌గా కొనసాగారు. వీరు సాహిత్యంలో లబ్ధ ప్రతిస్టులు. అనేక కథలు, నవలలు, గల్పికలు రాసి, చందమామ ద్వారా బాల సాహిత్యాన్ని వెలిగింప చేశారు. వీరి సాహిత్యాన్ని విశాలాంధ్ర వారు ఆరు సంపుటాలుగా కేతు విశ్వనాథ రెడ్డి సంపాదకత్వంలో వెలువరించారు. నవలలను కొన్ని విడిగా ముద్రించారు.
పాఠశాలకు వెళ్లే విద్యార్థుల మొదలు, ఇంటికాడ విశ్రాంతి తీసుకునే నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యల వరకు ఆబాలగోపాలాన్ని ఎంతగానో ఈ పత్రిక ఆకట్టుకుని, అక్కున చేర్చుకుంది. పెద్దలు తమకు ఇచ్చిన పాకెట్‌ మనీతో పిల్లలు కొనుక్కుంటే, పుస్తకం కోసం బుక్‌స్టాల్‌ వద్ద పెద్దలు ఎదురు చూసేవారు. ఆనాడు చందమామను ధర పెట్టి కొనలేని మాబోటి వారు, గ్రంథాలయానికి వెళ్లి చదువుకునేవారు. మా హుజూర్‌నగర్‌ గ్రంథాలయం 7:30 కి అటెండర్‌ హుస్సేన్‌ తెరిచేవాడు. మేము ఏడు గంటలకల్లా గ్రంథాలయం మెట్ల మీద కూర్చొని, హుస్సేన్‌ గది తాళం తీయగానే లోపలికి పరిగెత్తి వెళ్లి చందమామను అందుకొని కథలన్నీ అయిపోయే వరకు వదిలిపెట్టకుండా చదివేవారం. ఒక్కోసారి చందమామ చేతిలో ఉన్న విద్యార్థి మధ్యలో కూర్చుంటే, అటు ఒకరు ఇటు ఒకరు కూర్చొని ఒకేసారి ముగ్గురు చదివిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంతలా చందమామ అందర్నీ ఆకట్టుకోవడానికి కారణం కథల్లో రకరకాల పాత్రలు ఉండటం ఒక కారణం. రాజులు, రాక్షసులు, దయ్యాలు, మాంత్రికులు, వ్యాపారులు, కవులు అమాయకులు, గహిణులు, పూజార్లు, రైతులు ఇలా వందలాది పాత్రలు చందమామ నిండా పరుచుకుని ఉండేవి. విభిన్న పాత్రలతో భిన్నమైన కథలు ప్రతినెల చదువరులను అలరించేవి. దాసరి సుబ్రహ్మణ్యం గారు పాతాళ దుర్గం, కంచుకోట, మాయా ద్వీపం, రాతి రథం, తోక చుక్క, జ్వాలా ద్వీపం మొదలైన జానపద సీరియల్స్‌ ఉచ్చు కథను ఉత్సుకతను కలిగించేలా ఉండేవి. మరో ఆసక్తికర అంశం బేతాళ కథను ప్రతినెలా ప్రచురించడం. ఈ కథ పటితుల మెదడుకు మేత పెట్టేదిలా, తార్కికతతో నిండి ఉండేది. మన సంస్కతీ, సంప్రదాయాల విలువలను పెంచేలా రామాయణం, భారతం, జానపద కథలు, పంచతంత్ర కథలు రీ రైట్‌ చేసి ఇస్తుండే వారు. రచనా విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. పిల్లల శరీరానికి పుష్టికరమైన ఆహారం ఎలాగో, మానసిక ఆరోగ్యానికి, తెలివితేటల పెరుగుదలకు, విజ్ఞానం వికసించడానికి, జ్ఞానం అభివద్ధి చెందటానికి, సమాజంలో మనుగడకు ఎంతో ఉపకరిస్తూనే పిల్లలకు వినోదాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలుగ జేసేది.
చందమామలో బొమ్మల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, ఊదారంగుల మేళనంతో, చూడగానే ఇది చందమామ బొమ్మ అనిపించేలా ఒక ప్రత్యేక శైలితో చిత్రకారులు వేస్తుండేవారు. వారిలో వడ్డాది పాపయ్య, ఆచార్య, చిత్ర, వీరరాఘవన్‌, గోఖలే, శివ శంకరం, శక్తిదాస్‌, భాష, అయ్యర్‌, మహేష్‌, వంటి ఎందరో చిత్రకారులు పత్రికకు చిత్రాలతో అలంకరించి వన్నె తెచ్చారు.
ఇట్టి చందమామకు కథలను అనేక మంది రచయితలు అందించి తమ రచనా శక్తిని పెంపొందించుకోవడమే కాకుండా, చందమామ రచయిత అనే గొప్ప కీర్తిని గడించుకున్నారు. చందమామ రచయితలు అనే వాట్సప్‌ గ్రూపును నిర్వహించుకుంటూ ఇటీవలే సమావేశం ఏర్పాటు చేసుకొని తమ అనుభవాలను అనుభూతులను కలబోసుకున్నారు. వారిలో ప్రముఖులు వసుంధర అనే కలం పేరుతో రచనలు చేసిన రాజగోపాల్‌ రావు, రామలక్ష్మి గార్లు, మాచిరాజు కామేశ్వరరావు, ఎం వి వి సత్యనారాయణ, సిహెచ్‌ శివరాం ప్రసాద్‌, ఎన్‌ వి ఆర్‌ ఎస్‌ మూర్తి, జె.నారాయణమూర్తి., కే.ఎన్‌.వి.ఆంజనేయులు, జొన్నలగడ్డ మార్కండేయులు, ఎం. శివ నాగేశ్వరరావు., లక్ష్మీ గాయత్రి, రాంబాబు, గణేశ్వర రావు, పద్మలత జయరాం, రాంబాబు, బూర్లే నాగేశ్వరరావు, ఆరుపల్లి గోవిందరాజులు, గంగిశెట్టి శివకుమార్‌, యండమూరి వీరేంద్రనాథ్‌, మల్లాది వెంకట కష్ణమూర్తి, దాసరి వెంకట రమణ, మల్లవరపు మనోహర్‌ రెడ్డి, పుప్పాల కష్ణమూర్తి వంటి ఓ పాతికమంది రచయితలు నిరంతరం ఈ పత్రికకు కథలను అందిస్తుండేవారు. వీటిని సాన పట్టి, తప్పులు ఉంటే సరిచేసి ప్రచురించడమే కాకుండా – స్వదస్తూరితో ఒక కార్డు కూడా రాసేవారు కొ.కు.గారు. అలాంటి కార్డులను, నాటి చందమామ కథల కాపీలను నేటికీ భద్రంగా దాచుకున్నారు రచయితలు. చందమామ కథల మీద దాసరి వెంకటరమణ గారి తో పాటు అనేక మంది విధ్యార్థులు వివిధ యూనివర్సిటీలలో పరిశోధనలు చేసి, పట్టాలను తీసుకున్నారు.
చందమామ కథలను నేటి తరానికి పరిచయం చేయ్యాలని సదుద్దేశంతో జేపీ పబ్లికేషన్స్‌ ప్రసాద్‌ రావు గారు 2000 సంవత్సరం నుండి నేటి వరకు పది సంపుటాలుగా చందమామ కథలను 22శ28 సైజుతో అందంగా ముద్రించి. మార్కెట్‌లోకి తెచ్చారు. ఆనాటి చందమామనే చదువుతున్నంత ఫీల్‌ తో పాఠకులు ఆనందపడాలని బొమ్మలను చందమామ చిత్రకారులు శక్తిదాసు తోటి వేయించారు. తన ఆరోగ్యం సహకరించని కారణంగా మాచిరాజు గారి దేశ భక్తి కథల పుస్తకానికి దేవితో బొమ్మలు గీయించారు. వీరు నాటి చందమామ కథలను తలపించే విధంగా చక్కటి బొమ్మలను, ఆకర్షణీయమైన రంగుల్లో చిత్రించి అందించారు.
21 మే 1955 తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో పుట్టిన మాచిరాజు కామేశ్వరరావు గారు కెనరా బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి 2015లో పదవి విరమణ చేశారు. తన 14వ ఏటి నుండి రచనలు చేయడం ప్రారంభించిన వీరు నేటి వరకు 450 దాకా కథలు రాశారు. కేవలం 250 కథలు ఒక్క చందమామలోనే రాశారు. పిల్లల కథలే కాకుండా ఆంధ్రప్రభ, పత్రిక, జ్యోతి, ఆంధ్రభూమి, స్వాతి, విపుల మొదలైన పత్రికల్లో 100కు పైగా పెద్దల కథలు, స్వాతిలో నాలుగు నవలలు, చతురలో రెండు నవలలు రాశారు. వీరి సాహిత్య కషికి చక్రపాణి – కొలసాని అవార్డు, మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం, శ్రీమతి ఆకెళ్ళ సుబ్బలక్ష్మి సత్కారం బాలసాహిత్యంలో అందు కున్నారు. 5-11-2023 న రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ, బాలసాహిత్య పరిషత్‌ వారు వీరి దేశ సేవ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా కథల చందమామ అను బిరుదును ప్రధానం చేశారు.
ఇటీవలే విడుదలైన వీరి ”దేశ సేవ” పిల్లల కథల పుస్తకంలోని 21 కథల్లో, 14 కథలు చందమామలో వచ్చినవే. మిగతావి బాల జ్యోతి, ప్రమోద పత్రికల్లో వచ్చాయి. మనిషికి శాపం కథలో ప్రతాపుడు పరుల ఐశ్వర్యం చూసి ఈర్ష పడటంతో- ఆరోగ్యం, నిద్ర, ఆనందం, తప్తిని మించిన ఐశ్వర్యం మరొకటి లేదని ఋషి హితబోధ చేస్తాడు. అలాగే జైలు నుంచి పారిపోయి ఒక ఇంట్లో జొరబడిన దొంగను మంచి మాటలతో తిరిగి జైలుకు వెళ్లేలా చేసిన ఇల్లాలి కథ పారిపోయిన దొంగ. ఈ కథ కేం బ్రిడ్జి యూనివర్సిటీ వారు తీసుకున్నారు. పదవీ విరమణ చేసిన పంతులు గ్రామంలో నిరక్షరాశ్యులకు చదువు నేర్పాలని, తన పాండిత్యం ప్రదర్శించగా, వారి స్థాయికి దిగి విద్య నేర్పాలని, పాలేరు చెప్పిన పాఠం కథ ద్వారా పాలేరు చెబుతాడు. అలాగే పిల్లలకు గుడ్‌ టచ్‌ – బ్యాడ్‌ టచ్‌ గురించి పిల్లలు తెలుసుకోండి కథ ద్వారా చెప్తారు ఈ మొత్తం కథల్లో విజ్ఞానాన్ని, వివేకాన్ని, తార్కిక శక్తిని, సమాజ పోకడలను చక్కగా తెలియజేస్తారు. ముందుమాట అందించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ గ్రహీత దాసరి వెంకటరమణ , వీరి కథలు పిల్లలకు మనోవైజ్ఞానిక పాఠాలని కొనియాడారు. ఈ పిల్లల కథల పుస్తకాన్ని చదువుతుంటే, పాత చందమామ చదువుతున్న అనుభూతి ఖాయం. పిల్లలు పెద్దలు తప్పకుండా చదివి, దాచుకోవలసిన పుస్తకం.

(శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారు 2022 సంవత్సరానికి గాను బాల సాహిత్యంలో శ్రీ మాచిరాజు కామేశ్వరరావుకు బాల సాహిత్య పురస్కారం ప్రకటించిన సందర్భంగా.)
-పుప్పాల కష్ణమూర్తి, 99123 59345