సెప్టెంబర్ 11, 2001ని న్యూయార్క్‌లోని ట్విన్ టవర్లను ధ్వంసం చేసి, ఇతర ప్రాంతాల్లో దాడులు చేసిన కొంతమంది మతోన్మాదులు, అమెరికాపై చేసిన తీవ్రవాద దాడిని గుర్తుచేసుకుంటాం. భారతదేశ చరిత్రతో ముడిపడి ఉన్న సెప్టెంబర్ 11రోజు చాలా ఉన్నతమైంది, నిర్మాణాత్మకమైంది. ఇదే 1893 సెప్టెంబర్11న, స్వామీ వివేకానంద చికాగోలోని ప్రపంచ మతాల పార్లమెంట్ (వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్)లో ప్రసంగించాడు. ఇదే రోజు 1906లో మహాత్మాగాంధీ దక్షిణా ఫ్రికాలో తన మొదటి సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు.
అధిక సంఖ్యాక వాదం
(మెజారిటేరియనిజం)లో వ్యక్తమైన మతోన్మాదం
సెప్టెంబర్ 11నాటి స్వామీ వివేకానందుని సంక్షిప్తమైన, లోతైన ప్రసంగం, అమెరికా ప్రజలను మంత్ర ముగ్ధులను చేయడం ద్వారా వారిని కదిలించింది. తరువాత ఆధ్యాత్మికత, వేదాంతంపై అనేక ఉపన్యాసాల ద్వారా ఆయన వారి మనసుల పైన చాలా ప్రభావం చూపించాడు. చారిత్రాత్మకమైన తన చికాగో ప్రసంగంలో, ”పాక్షికత్వం (సెక్టేరియనిజం), మతదురభిమానం (బిగాట్రీ), దాని వారసత్వంగా వచ్చిన భయంకరమైన మతోన్మాదం, ఈ నేలను అమాయకుల రక్తంతో తడిపివేసాయని” ఆయన పేర్కొన్నాడు. అదే విధంగా, ప్రపంచ మతాల పార్లమెంట్ ప్రారంభానికి మోగిన గంట, మతోన్మాదానికి మృత్యుఘోష కావాలని ఆయన ఆశించాడు. వాస్తవానికి స్వామీ వివేకానందుని మాటలు చాలా కదిలించాయి. ఆయన ఆ మాటలు మాట్లాడిన 108 సంవత్సరాల తరువాత మతోన్మాదులు కొందరు అమెరికాపై దాడి చేశారు. దురదృష్టవశాత్తు, 2023లో ప్రపంచం, ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు, అధికసంఖ్యాకవాదం రూపంలో ఉన్న పాక్షికత్వం, మత దురభిమానం, మతోన్మాదాల సమ్మేళనాన్ని, భారతదేశ ప్రభుత్వ యంత్రాంగాన్ని నియంత్రించే వారు ప్రేరేపించే విభజన ప్రక్రియను ఎదుర్కొంటోంది.
జాతి సంహారం, జాతి ప్రక్షాళన కోసం పిలుపు
ఇప్పుడు, మతం పేరుతో హింస, ద్వేషాన్ని నిర్దాక్షిణ్యంగా వ్యాప్తి చేస్తున్న క్రమాన్ని మనం ఎదుర్కొంటున్నాం. మైనార్టీల్ని, ముఖ్యంగా ముస్లింల్ని అంతమొందించాలని, ధర్మసన్సద్‌లు, మత పార్లమెంట్ల నుండి చాలా కాలంగా ప్రతిరోజూ పిలుపులు జారీ చేస్తున్నారు. వీటికి, ముస్లింల సమగ్ర సామాజిక, ఆర్థిక బహిష్కరణ కోసం కూడా అశుభకరమైన పిలుపులు తోడు అయ్యాయి. ఇటీవల కాలంలో ఇలాంటి పిలుపులు హర్యానా రాష్ట్రంలోని నూహ్ లో ముస్లింలను హింసాత్మకంగా లక్ష్యంగా చేసుకొని, వారు పని చేస్తున్న ప్రాంతాల్ని వదిలివెళ్ళిపోవాలని ఆదేశిస్తూ, వారి ఇళ్ళను నేలమట్టం చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ సమస్యను సుమోటోగా స్వీకరించి, ఇది ”జాతి ప్రక్షాళన”లో చేస్తున్న కసరత్తా అని తన ఆర్డర్‌లో ప్రశ్నించింది. జాతి సంహారం, సామాజిక ఆర్థిక బహిష్కరణల కోసం ఇస్తున్న పిలుపుల్ని దృష్టిలో ఉంచుకొని, సుప్రీంకోర్టు రాష్ట్రాలకు జారీ చేసిన ఆజ్ఞల్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా తిరస్కరించడం విస్మయం కలిగించే విషయం. ఇటీవలి కాలంలో ద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్టవేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రదర్శించిందా ఏమిటని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది.
గతంలో ఎన్నడూలేని విధంగా, మణిపూర్ రాష్ట్రంలో జాతి ప్రాతిపదికన హింస, రక్తపాతం ఇంకా కొనసాగుతూనే ఉండడం విచారకరం. ఊహించని రీతిలో అక్కడి మహిళలు అనుభవించిన క్రూరత్వం, జాతి ప్రాతిపదికన వారిపై అనాగరికంగా జరిపిన లైంగిక హింస వీడియోలు, పాక్షికత్వం, మతదురభిమాన వ్యక్తీకరణలను బట్టబయలు చేశాయి. ఇలాంటివాటిపై స్వామీ వివేకానంద ధ్వజమెత్తారు, మతోన్మాదం భయంకరమైన వారసత్వం గురించి కూడా ఆయన హెచ్చరించారు. 11 సెప్టెంబర్ 1893న ఆయన మాట్లాడిన మాటలను నేడు భారతదేశంలో పరిగణలోకి తీసుకోకుండా తిరస్కరించబడుతున్న తీరు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మతం ఆధారంగా వేధింపులకు గురవుతున్న వారికి ఆశ్రయం ఇవ్వడం చూసి ఆయన ఆవేదన చెందేవాడు.
ద్వేషంతో ప్రమాదంలో దేశం మనుగడ
ఇతరులకు వ్యతిరేకంగా ద్వేషభావాన్ని వ్యాప్తి చేయడం ద్వారా దేశం యొక్క జీవనాధారం ప్రమాదంలో పడుతుందని స్వామీజీ అంతకు పూర్వమే హెచ్చరించాడు. సమాజంలో ఏర్పడిన ద్వేష భావం, తోటి భారతీయులకు వ్యతిరేకంగా ధిక్కారాన్ని ప్రదర్శించి వారితో సంబంధాలు నిలిపివేయడంతో చరిత్రలో భారతదేశ క్షీణతను ఆయన గుర్తించాడు. 27 అక్టోబర్ 1894న అమెరికా నుండి తన శిష్యుడు అలసింగా పెరుమాళ్‌కు రాసిన లేఖలో, ”ఏ మనిషి, ఏ దేశం, నా కొడుకు, ఎవ్వరూ ఇతరులను ద్వేషించి, బతుకలేరని” ఆయన సున్నితంగా పేర్కొన్నాడు.” వారు, ‘మ్లేచ్ఛులు’ అనే పదం కనిపెట్టిన రోజు, ఇతరులతో సన్నిహిత సంబంధాలు నిలిచిపోయినప్పుడే భారతదేశ వినాశనం ఖాయం అయిందని” ఆయన అన్నాడు. ”కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామీ వివేకానంద”లోని ఐదవ అధ్యాయంలో అందు బాటులో ఉంది. విశ్వాసం పేరుతో భారతీయులను విభజిస్తూ, అంతర్ విశ్వాసాలను, సామరస్యాన్ని విషపూరితం చేస్తున్న ద్వేషభావం, 2023 భారతదేశం ఉన్న ప్రస్తుత సందర్భంలో ఆయన రచనలోని విషయాలకు ప్రాధాన్యత ఉంది.
మతోన్మాదం వల్ల కలిగే ముప్పుపై ధ్వజమెత్తిన సుప్రీంకోర్టు
1893 సెప్టెంబర్ 11న ”పాక్షికత్వం, మత దురభిమానం, భయంకర మతోన్మాద వారసత్వాలు, ఈ నేలను అమాయకుల రక్తంతో తడిపివేసాయని” స్వామీ వివేకానంద హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలు మన స్వంత ప్రమాదంలో విస్మరించబడవచ్చు. అయిశత్ శిఫా వర్సెస్ కర్నాటక రాష్ట్రం మధ్య ఉన్న కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో (13 అక్టోబర్ 2022) మతోన్మాదం వల్ల కలిగే ప్రమాదం పైన ధ్వజమెత్తింది. ఏ పాఠశాలల్లో, ఏ కళాశాలలో ఎక్కడైనా ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని అనుమతించే సందర్భంలో కోర్ట్ ఎస్.బీ.చవాన్ కమిటీ నివేదిక 1999పై ఆధార పడింది. ఈ నివేదిక సామాజిక ఐక్యత, సామాజిక, మతసామరస్య సాధనంగా మతాల గురించిన విద్యను చాలా గట్టిగా సిఫార్సు చేసింది. కోర్టు ఆ పేరాను ఈ విధంగా ఉదహరించింది:
”మతోన్మాదం, ద్వేషభావం, హింస, అవినీతి, నిజాయితీలేనితనం, దోపిడీ, మాదకద్రవ్యాల వినియోగం లాంటి వాటికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో దేశానికి విలువ ఆధారిత విద్య, సహాయకంగా ఉంటుంది. సూర్యుని వలె, విజ్ఞానం కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. సంకుచిత మనస్తత్వం, అంధవిశ్వాసాలకు, పిడివాద సిద్ధాంతాలకు స్థానం ఉండకూడదు. ఈ లక్ష్యం కోసం ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మతాల ప్రాథమిక సిద్ధాంతాలను నేర్చుకుంటే, లౌకికవాదానికి మనుగడ ఉండదని చెప్పలేం.”
భారతదేశ సమ్మిళిత దార్శనికత
వంద సంవత్సరాల క్రితం, స్వామీ వివేకానంద ఏ ఒక్క మతం పైనా ఆధారపడకుండా ఒక సమ్మిళిత పద్ధతిలో భారతదేశాన్ని నిర్వచించాడు. భారతదేశానికి ఒక వేదాంతి మెదడు, ఇస్లామిక్ శరీరం అవసరమని అన్నాడు. ఇలాంటి విధానం, ఏకరూపతను ప్రోత్సాహించి, బహుళ సాంస్కృతికవాదానికి అపాయం కలిగించే, సాంస్కృతిక జాతీయవాదానికి భిన్నంగా భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి బహుళ విశ్వాస మార్గాన్ని అనుసరించాలని నొక్కి చెపుతుంది. కానీ ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే విశ్వాసంపై ప్రమాణం చేస్తున్నవారు, తమ పవిత్ర పురుషునిగా చెప్పుకుంటున్న స్వామీ వివేకానంద దార్శనికతను నిరాకరిస్తున్నారు.
వేదాంతంపై నెహ్రూ, అంబేద్కర్
స్వామీ వివేకానంద వేదాంత మార్గాన్ని ఆసక్తికరంగా మన మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన సుప్రసిద్ధ రచన ”బేసిక్ అప్రోచ్”లో ఉదహరించాడు. మానసిక బలహీనతకు కారణమైన ఆధునిక నాగరికత యొక్క అనేక సవాళ్ళకు, వేదాంత ధోరణి పరిష్కారాలను చూపుతుందని నెహ్రూ తన రచనలో పేర్కొన్నాడు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, సామాజిక అసమానతలపై ఆధారపడి ఏర్పడిన మతం, హిందూ మతం అని, ”కుల నిర్మూలన” అనే రచనలో పేర్కొన్నాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంపై ఆధారపడి ఏర్పడిన మతం భారత దేశానికి అవసరమని, అలాంటి ఒక మతం, జీవనాధారాన్ని ఉపనిషత్తుల నుండి పొందుతుందని ఆయన అన్నాడు. వాస్తవానికి ఉపనిషత్తులు వేదాంతాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆధునిక భారతదేశ నిర్మాతలైన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, బీ.ఆర్.అంబేద్కర్ లిరువురూ, స్వామీ వివేకానంద, భారతదేశ దార్శనికతను ఆవిష్కృతం చేసే ఇస్లాం విలువలతో పాటు సూచించిన వేదాంత మార్గాన్ని గురించి నొక్కి చెప్పారు. భారతదేశ భావనను బెదిరించే మతోన్మాదాన్ని ఓడించాలంటే, 1893 సెప్టెంబర్ 11 నాడు స్వామీ వివేకానంద మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉండడం అత్యావశ్యకం.
(”ద వైర్” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్,9848412451
ఎస్.ఎన్. సాహూ