చెట్టు పుట్ట గట్టులా
మందిర్ మసీదు చర్చీలు
చెలిమెలు నదులు సముద్రాలలా
రంగురంగుల పూలసమ్మేళనంలా భిన్నత్వంలో ఏకత్వం
ఆలయాలు మతప్రబోధకులెందరున్నా
అన్నం పెట్టేది రైతన్నలే గాయమైతే అమ్మనే తలిచేది
ఓదార్చేది అమ్మనే బతుకు దారి చూపేది నాన్ననే!
లేని జన్మల కోసం పాకులాడి
స్వర్గంకోసమని చెడ్డదారులకు సున్నమేయకు
సహదయంతో హరితగీతమై ప్రతిధ్వనించు
చేతులుంటే అశోకుడులా చెట్లు నాటు
నిందితుడు నవ్వడం కాదు
సామాన్యుడు నక్షత్రమై మెరువాలి
దేవుడు ఊరేగడము కాదు
మానవుడు మహాత్ముడై నడువాలి
దారిదప్పిన ఆలోచనలకు చరమగీతమై
సామాజిక ధర్మధ్వజం ఎగురవేరు
ద్వేషంతో అవమానించకు
భారతప్రజల చెమటతడుల సమ్మేళనమే భారత రాజ్యాంగం
అమ్మనాన్నలు కలిసి రాసిన రాజ్యపత్రం
నిచ్చెనకెన్ని మెట్లో అన్ని అవమానాలు
భూమికెన్నీ గాయాలో అన్ని అణచివేతలు
పీడితుల కన్ని దుఃఖాలు
సమతను తలపాగగా మనవత్వాన్ని శిఖరం చేశాడు
ప్రజాస్వామ్యాన్ని ఆకాశంగా స్వేచ్ఛను
హిమాలయం చేశాడు
ఓటు సకలజనుల హక్కుగా
సామాజిక న్యాయపు బావుటాగా
అస్తిత్వ చైతన్యపు జెండను ఎగరేసినందుకేనా రాజ్యాంగంపై బుద్దిలేని కూతలు
పెట్టుబడుల గారడీలతో అడుగడుగు విద్వేషపు కత్తులై ఊపిరినలిపె అరాచకాలు
భూగోళం వంటినిండా కురుపులు
గోవుమాంసపు యజమానులతో
ఎలక్టోరల్ బాండ్ల స్వైరవిహారాలు
సరిహద్దుల్లో నెత్తురు పండుగకాదు
సర్వప్రాణులపై ప్రేమను పంచు
నీ ఆశయం సూర్యుడైతే దారులన్ని వెలుగుచెరు
పవిత్ర భూమి ుణ్యనదులు
అద్భుత స్వయంభూ ఆలయాలు
రుషితుల్యులు త్యాగ ధనులు నడయాడిన నేలన రక్తాభిషేకాలేమిటి
పంట రాశుల సంకల్పాలు చెదలుపట్టి
డిల్లీలో రైతుల తండ్లాటలేమిటి
భక్తి ప్రబోధాలన్నీ బండల పాలా
మణిపూర్ ను మంట పెట్టడం
చందమామను కాల్చుకు తినటమే
సెక్యులరిజాన్ని చెరిపేయటం
నెలపొడుపును తుంచటమే
లౌకిక వాదమే ఈ దేశ తిలకం
భారత రాజ్యాంగమే ఈ దేశపు గుండె
– వనపట్ల సుబ్బయ్య, 9492765358