వృద్ధులు – మానసిక ఆరోగ్యం

Older people - mental healthఅక్టోబర్‌ 2వ తేదీ ఆదివారం ఎవి కాలేజీ కళకళలాడుతుంది, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఫుల్‌ డే జోష్‌ పొందేందుకు. ఆనందం, ఆరోగ్యం ఉండేలా చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేశారక్కడ. అక్కడికి నేను, సరోజని, కృష్ణ వేణి, స్వరూపారాణి అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళుతుంటే…. ఒకరి చేయి ఒకరు పట్టుకుని కొందరు, ఒంటరిగా మరి కొందరు, టెస్ట్‌ల కోసం అటూ ఇటూ తిరుగుతూ ఎంతో సందడిగా ఉంది. ఇంకొంచెం ముందుకి వెళ్ళాక మా డాక్టర్‌ మహేంద్ర కుమార్‌ దగ్గర చాలా మంది కనిపించగా పలకరిద్దామంటే ప్రతి ఒక్కరూ ఏదో కోల్పోయిన వారిగా, నిరాశ, ఆందోళనలతో ఉన్నారు.
హారు ఫ్రెండ్స్‌ అనగానే ఏదో కోటి వెలుగుల కాంతి వచ్చినట్లుగా మా వైపు చాలా ప్రేమగా చూసారు.
సామర్థ్యం లేకున్నా సాగాలని ఆరాటం, అలుముకున్న చీకటిలోనే అలమటించనేలా… అనేలా… అక్కడ పెద్దలే పిల్లలుగా ఎవరో వస్తారు, పలకరిస్తారని ఆశతో వృద్ధుల కోసం హెల్త్‌ క్యాంపు, ఆటలు, పాటలు, ఆరోగ్యం, ఆహారంతో పాటు కానుకలు బహుమతులు. అదరహో అనేలా ఎన్నో కార్యక్రమాలు. అయినా ఆ వృద్ధుల్లో నాకు కనిపించింది మాత్రం ఒత్తిడి. డిప్రెషన్‌ అనేది యువతరాన్ని మాత్రమే కాకుండా వృద్ధులను కూడా ప్రభావితం చేసే మానసిక – భావోద్వేగ రుగ్మత. దు:ఖంతో పాటు అప్పుడప్పుడు ‘బ్లూ’ మూడ్‌ వంటి భావాలు సాధారణం అయినప్పటికీ దీర్ఘకాలిక నిరాశ వృద్ధాప్యంలో సాధారణ భాగం కాదు. వృద్ధులలో డిప్రెషన్‌ జీవన నాణ్యతను తగ్గిస్తుంది. ఇది ఆత్మహత్య ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ డిప్రెషన్‌ లక్షణాలు ఏ వయస్సు వారికైనా ఒకేలా ఉంటాయి.
విచారం, పనికిరాని భావాలు, అలసట, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం, అశాంతి, ఆకలిలో మార్పులు, నిద్ర సమస్యలు.
1. అర్ధవంతమైన కార్యకలాపాలలో నిమగమవ్వడం: వృద్ధులలో నిరాశను పోగొట్టడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి వారిని ఏవైనా కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించడం. ఏదో ఒక అభిరుచిని కొనసాగించడం. వారికి నచ్చిన వ్యాపకం చేయడం, వారు విశ్వసించే కారణం కోసం స్వచ్ఛందంగా సేవ చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలి. ఇలా చేయడం వల్ల సీనియర్‌లకు ఒంటరిగా వున్నామనే బాధల లేకుండా తమ ఆలోచనలను తోటి వారితో పంచుకుంటారు. ఇది వారి మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది.
2. సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడం: ఇంటి చుట్టుపక్కల వారితో మాట్లాడ్డం, దూరంగా వున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో వీడియో కాల్స్‌ చేయడం, ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుని ఏదైనా వ్యాపకం పెట్టుకోవడం వంటివి చేయాలి. కొంతమందికి శారీరక పరిమితులు ఉన్నప్పటికీ పెద్దవారికి ప్రియమైన వారితో సంబంధాలను కొనసాగించడంలో ఎంతో ఆనందం వుంటుంది.
3. శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం: రెగ్యులర్‌ వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. నడక, యోగా, స్విమ్మింగ్‌. వీటిలో వారికి అనుకూలమైన వ్యాయామాలలో పాల్గొనమని ప్రోత్సహించడం.
4. మద్యం, ధూమపానానికి దూరంగా: మద్యం, ధూమపానం నిరాశా నిస్పహ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. అధిక మద్యపానం నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
5. ఆరోగ్యకరమైన ఆహారం: చేపలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్‌ ప్రోటీన్లు, చిక్కుళ్ళు వంటి సంపూర్ణ ఆహారాలపై దృష్టి పెట్టడం వలన మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
6. మనవలతో సమయం గడపడం: మనవలు, మనవరాళ్లతో సమయం గడపడం వల్ల శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంటారు.
7. శృంగారం ఓం వరం: ఆకలి, నిద్ర, సెక్స్‌ ప్రకృతి ఇచ్చిన వరం. ఈ వయసులో చింత చచ్చినా పులుపు చావలేదు, సిగ్గు మాలిన పని అనే మాటలను పట్టించుకుని, స్త్రీలు సహజంగా తప్పుగా భావిస్తుంటారు. పెద్దరికం పోతుందనే భావన నుంచి బయటపడండి. ముందు మీరు భార్యా భర్తలు. అరవై దాటాక కూడా సెక్స్‌లో పాల్గొనడం ఆరోగ్యదాయకమని చాలా పరిశోధనలు వెల్లడించాయి.
నేను చెప్పినవి కాస్త ఇబ్బంది అనుకోకుండా ఒక ప్రయత్నం చేయండి. ఆనందంగా జీవితాన్ని ఎంజారు చెయ్యగలరు.
థెరపిస్ట్‌ని సంప్రదించండి: డిప్రెషన్‌తో బాధపడుతున్న వృద్ధులకు అనేక చికిత్సలు వున్నాయి. మానసిక చికిత్సలో శిక్షణ పొందిన థెరపిస్ట్‌లు మీతో ప్రైవేట్‌గా మాట్లాడతారు. వారి దగ్గరికి వెళ్లడానికి భయపడాల్సిన, ఆలోచించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపీస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌