బంగాళాఖాతంలో కలిపేయండి..

In the Bay of Bengal combine..– కాంగ్రెస్‌ వస్తే దళారుల రాజ్యం వస్తుంది
– మూడు గంటల కరెంట్‌ కావాలా? 24 గంటల కరెంట్‌ కావాలా?
– జనగామలో చేర్యాల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు
– భువనగిరి జిల్లాకే యాదాద్రి ఒక బంగారు తునక : జనగామ, భువనగిరి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి/జనగామ/భువనగిరి
”కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ కౌలు రైతుల దుకాణం మొదలుపెట్టిందని.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటోందని.. అలా మాట్లాడుతున్న పార్టీనే బంగాళాఖాతంలో కలిపేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. సోమవారం జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్లొని మాట్లాడారు. ”మళ్లీ కౌలు రైతుల ముచ్చట మాట్లాడుతాండ్రు.. బంజారా హిల్స్‌లో కూడా బంగళాలను కౌలుకు ఇస్తరు.. అక్కడ ఎందుకో కబ్జా కాలమ్‌ పెడతలేరు..? రైతులను ముంచేందుకు మాత్రం కబ్జా కాలమ్‌ పెడతరా..” అని ప్రశ్నించారు. కౌలుకు ఇచ్చుడంటే, కిరాయికి ఇచ్చుడేనని తెలిపారు. రైతులు కష్టాలు పడొద్దని ఎవరి భూమి వారి పేరిట ఉండేలా ‘ధరణి’ని ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్‌ బతికున్నంత వరకు లౌకికవాదం వీడమని స్పష్టం చేశారు.
జనగామ జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కాలేజీ ప్రతిపాదిత మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే.. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును రైతులకు అందించామని, మూడు గంటలు కరెంటు ఇస్తే చాలని కాంగ్రెసోళ్లు చెబుతున్నారన్నారు. ఉద్యమ సమయంలో జనగామ జిల్లా పరిస్థితి ఘోరంగా వుండేదని, కిలోమీటర్ల దూరానికి వెళ్లి సాగు, తాగునీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక జనగామ ప్రాంతానికి మల్లన్నసాగర్‌ ద్వారా సాగు, తాగు నీరందిస్తున్నామన్నారు. బచ్చన్నపేట చెరువు ఇప్పుడు ఎప్పుడు చూసినా నిండుగా ఉంటుందని అధికారులు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెబుతుంటే సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌-వరంగల్‌ మధ్య రెండు ఎకనామిక్‌ గ్రోత్‌ కారిడార్లు ఏర్పాటు చేయాలని భావించడం వల్లే జనగామ, భువనగిరి రెండింటిని జిల్లాలుగా చేశామని తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో అద్భుతమైన ప్రగతి వస్తుందన్నారు.బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం, దళిత బంధును ఎట్టిపరిస్థితిల్లోనూ కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో ఐటీ పారిశ్రామిక అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని తెలిపారు. పదేండ్లలో రాష్ట్రంలో ఒక్క మత కల్లోలం కూడా లేదన్నారు. వినాయక చవితి, మిలాద్‌ ఉన్‌ నబీ పండుగలు ఒకే రోజు వస్తే ముస్లిం మత పెద్దలతో కూర్చొని నిర్ణయం తీసుకొని ఒకరోజు తరువాత పండుగలు నిర్వహించుకున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో మత సామరస్యానికి ఇది నిదర్శనమన్నారు. మల్లన్నసాగర్‌ రైతులకు నెత్తి మీద కుండలాగుందని, దాని నుంచి తపాస్‌పల్లికి లింకు కలపనున్నామని, దాంతో ఎక్కడ కరువు వచ్చినా జనగామకు కరువు రాదని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు కేవలం ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోసమేనన్నారు. అద్భుతమైన ప్రజా మ్యానిఫెస్టోను ప్రకటించామన్నారు. జనగామలో మెడికల్‌ కాలేజీ నిర్మాణంలో ఉన్నందున, దీనితోపాటు నర్సింగ్‌ కాలేజీ, పారా మెడికల్‌ కాలేజీలు కూడా వస్తాయన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన ఇంట్లోనే ఉంటారని, ఆయన్ను దీవించి లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్‌ఎస్‌లో ‘పొన్నాల’ చేరిక
సీఎం కేసీఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బీజేపీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, వారి అనుచరులు బీఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. సభలో మంత్రి సత్యవతిరాథోడ్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌, జడ్పీ చైర్మెన్‌ పి. సంపత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ టి. రాజయ్య, నాయకులు బోడకుంటి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జమున, నాగపురి రాజలింగం, మండల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి జిల్లాకే యాదాద్రి ఒక బంగారు తునక
యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి వరుస విజయాలతో అద్భుతంగా ముందుకు పోతున్నారని, ఈ ఎన్నికల్లోనూ 50వేల మెజార్టీతో గెలిపించుకోవాలని తెలిపారు. కరువు ప్రాంతమైన భువనగిరిలో రెండు మూడు చిన్న కాలువల పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. వాటిని పూర్తి చేయిస్తామన్నారు. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని నూతన కట్టడాలతో అత్యద్భుతంగా నిర్మించుకున్నామని, అది రాష్ట్రానికే బంగారు తునక అన్నారు. బస్వాపురం నరసింహ ప్రాజెక్టు 98శాతం పూర్తయిందని, మిగతా పనులూ పూర్తిచేసుకుని తన ఆధ్వర్యంలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ పరిపాలనలో పురుడుపోసుకున్న అరాచక శక్తులను.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూకటివేళ్లతో పెకిలించి పారేసిందన్నారు. రైతుల భూముల మీద రైతులకే హక్కులు కలిగించే విధంగా ధరణి వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. వీఆర్వో, గిర్దావర్‌, తహసీల్దార్‌ పేరిట తమ భూముల రిజిస్ట్రేషన్‌ నమోదు కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటన్నింటినీ తొలగించడంతోపాటు ఒకరి భూములు మీద మరొకరు అజమాయిషీ ఉండకుండా చేస్తామన్నారు. ఎంతో కష్టపడి రైతులు వ్యవసాయ భూమిని సమకూర్చుకుంటే ఆ భూమిలో కబ్జాకాలమ్‌ (కౌలు) పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ఆగమాగం కావద్దని, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టి.. వాస్తవాన్ని గుర్తించి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న భువనగిరికి స్పెషల్‌ ఐటీ పార్కు, ఇండిస్టియల్‌ పార్కు తెచ్చే బాధ్యత తనదేనని తెలిపారు. భూముల ధరలు పెరిగి రైతులు ప్రజలు సంతోషపడుతున్నారని తెలిపారు. కారు గుర్తుకే ఓటు వేయాలని జై తెలంగాణ అంటూ సభికులతో నినాదాలు చేయించారు. సభలో ప్రభుత్వ విప్‌ సునీత, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీచైర్మెన్‌ సందీప్‌ రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, గొంగిడి మహేందర్‌ రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌ రెడ్డి, బూడిది భిక్షమయ్యగౌడ్‌, పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్‌, గ్రంథాలయ సంస్థల జిల్లా అధ్యక్షులు జడల అమరేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.