– జీహెచ్‌ఎంసీలోకి శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు..!
– గతంలో ప్రకటించిన బీఆర్‌ఎస్ సర్కార్
– కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై ఆసక్తి
– రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ
నవతెలంగాణ-సిటీబ్యూరో
శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు జీహెచ్‌ఎంసీలో విలీనం అంశం చర్చనీయాంశమవుతోంది. మెరుగైన పాలన కోసం మన్సిపాల్టీలు, కార్పొరేషన్లను బల్దియాలో కలుపుతామంటూ గతంలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించినా కాలేదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో ఈ విలీన ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. 2019లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మెరుగైన పాలన కోసమంటూ గ్రామపంచాయతీలను కలిపి కొత్తగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని సిటీ శివారుల్లో 4 కార్పొరేషన్లు, 13 మున్సిపాల్టీలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించి మెజార్టీ స్థానాలను అప్పటి బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తామని అప్పట్లో ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి పాలు కావడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త సర్కార్ గత ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటుందా..? పక్కన పెడుతుందా..? అని రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మరో ఏడాదిలో ఎన్నికలు..
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మరో ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ కొద్ది సమయంలో జీహెచ్‌ఎంసీలో వీలినం సాధ్యమవుతుందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ విలీనం చేయాల్సి వస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆరు జోన్లలో వీటిని కలపాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రేటర్ జనాభా కోటి దాటింది. ఈ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సైతం విలీనం చేస్తే జీహెచ్‌ఎంసీ జనాభా దాదాపు రెండు కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నిర్వహణ భారంగా ఉంది.
కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో మిగులు బడ్జెట్..
శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. దాదాపు అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు మిగులు బడ్జెట్‌తో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే విలీనం చేస్తారా? అన్నదే ప్రశ్నగా ఉంది. రాజకీయంగా కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. పదవుల పంపకాలలో తేడాలు రాక తప్పదంటున్నారు. అనవసరమైన తల నొప్పులు ప్రభుత్వం పెట్టుకోకపోవచ్చని అంటున్నారు.
సర్కార్ నిర్ణయంపై నర్వత్రా ఉత్కంఠ
శివారులోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల విలీనంపై సర్కార్‌దే తుది నిర్ణయం. కాగా.. విలీనానికి ముందు స్థానిక ప్రజల నుంచి ప్రజాభిప్రాయం తీసుకోవాలని కొందరు అభిప్రాయపడుతుండగా.. జీహెచ్‌ఎంసీలో విలీనం చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాలను సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీలనే..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సిటీ శివారులో బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేటతో కలిపి నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి. దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, మేడ్చల్, గుండ్ల పోచంపల్లితో కలిపి దాదాపు 13 మున్సిపాల్టీలు ఉన్నాయి. 2019కు ముందు ఇందులో చాలా కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు గ్రామ పంచాయతీలుగా ఉండేవి.