– మేజర్ లీగ్ సాకర్‌లో 2025 వరకు ఒప్పందం ఖరారు
ఫ్లోరిడా (యుఎస్‌ఏ) : అమెరికా ఫుట్‌బాల్ అభిమానులు ఎదురుచూస్తున్న ఘట్టం రానే వచ్చింది. ప్రపంచ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, అర్జెంటీనా జాతీయ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సి అమెరికా మేజర్ లీగ్ సాకర్‌లో ఆడనున్నాడు. ఈ మేరకు ఎంఎల్‌ఎల్ ప్రాంఛైజీ ఇంటర్ మియామీతో లియోనల్ మెస్సి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2025 వరకు కాంట్రాక్టుపై లియోనల్ మెస్సి సంతకం చేసినట్టు శనివారం ఇంటర్ మియామీ వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగే ఓ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమంలో లియోనల్ మెస్సిని అభిమానులకు పరిచయం చేయనున్నారు. లియోనల్ మెస్సి, ఇంటర్ మియామీ యాజమాన్యం సోమవారం విలేకరుల సమావేశంలో పాల్గొంటారని ఇంటర్ మియామీ క్లబ్ తెలిపింది. ‘ఇది నాకు గొప్ప అవకాశం. మీతో కలిసి ఈ అందమైన సౌధం నిర్మాణంలో పాలుపంచుకుంటాను (అమెరికాలో ఫుట్‌బాల్‌ను పాపులర్ చేయటం). ఇంటర్ మియామితో కలిసి పని చేసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను’ అని లియోనల్ మెస్సి అన్నారు.